AP: కబ్జాల భూపాలుడు! కర్నూలులో సీనియర్ ఎమ్మెల్యే దాదాగిరి
ABN, Publish Date - Jan 15 , 2024 | 09:43 AM
అక్రమార్జనలో ఎమ్మెల్యే బాటలోనే ఆయన తనయుడూ రాటుదేలుతున్నారు. ఆయన భూ కబ్జాలు, సెటిల్‌మెంట్లు చేస్తే.. కుమారుడు ఏజెంట్లను పెట్టుకుని మామూళ్లు దండుకుంటున్నారు. నియోజకవర్గంలోని ఎర్రమట్టి ‘గట్టు’ను మరో ‘కేజీఎఫ్’గా మార్చేశారు.
జోరుగా భూకబ్జాలు, దందాలు, సెటిల్‌మెంట్లు
వక్ఫ్ ఆస్తులూ కబ్జా.. జోరుగా ఎర్రమట్టి, ఇసుక రవాణా
ముందు అనుచరుల రాక.. ఆపై ఆయనతోనే పంచాయితీ
తుపాకీతో సోలార్ కాంట్రాక్టరుకు బెదిరింపులు
ఎర్రమట్టి రవాణాలో తనయుడికి మామూళ్లు
బావమరిదికీ కీలక కాంట్రాక్టులు
నాయకుడి అండతో అనుచరులూ అక్రమాల బాట
అక్రమార్జనలో ఎమ్మెల్యే బాటలోనే ఆయన తనయుడూ రాటుదేలుతున్నారు. ఆయన భూ కబ్జాలు, సెటిల్‌మెంట్లు చేస్తే.. కుమారుడు ఏజెంట్లను పెట్టుకుని మామూళ్లు దండుకుంటున్నారు. నియోజకవర్గంలోని ఎర్రమట్టి ‘గట్టు’ను మరో ‘కేజీఎఫ్’గా మార్చేశారు. ఎర్రమట్టి మాఫియా నుంచి రోజు వారీ వాటా తీసుకుంటున్నట్టు సమాచారం. ఇక ఎమ్మెల్యే బావమరిది కూడా కీలక కాంట్రాక్టులు దక్కించుకున్నారు. బినామీ పేర్లతో వక్ఫ్ ఆస్తులూ కబ్జా .. ముందుగా అనుచరులు రంగంలోకి ఆ తరువాత నేత వద్ద పంచాయితీ
(అమరావతి/కర్నూలు–ఆంధ్రజ్యోతి)
ఫ్యాక్షన్ కుటుంబ నేపథ్యమున్నా బయటకు సౌమ్యంగా మాట్లాడుతారు. లోపల అసలు సిసలైన రాజకీయ నాయకుడిగా పవర్ చూపిస్తారు. వక్ఫ్ భూములైనా, ప్రభుత్వ స్థలాలైనా, వివాదాస్పద భూములైనా ఆ సీనియర్ ఎమ్మెల్యే కన్నుపడిందంటే తనకో.. తనకు అత్యంత సన్నిహితులైన ముఖ్య అనుచరులకో దక్కాల్సిందే. దందాలు అయినా, సెటిల్‌మెంట్లు అయినా నేరుగా ఆయన పాత్ర ఉండదు. ముందుగా తన అనుచరులు రంగంలో దిగుతారు. ఆ తరువాత పంచాయితీ పేరుతో పరోక్షంగా రంగంలో దిగి తనకు అనుకూలంగా సెటిల్ చేసుకోవడంతో ఆయన ఆరితేరిన నాయకుడు. ఎమ్మెల్యే అండదండలతో నియోజకవర్గంలో ఎర్రమట్టి మాఫియా, ఇసుక అక్రమార్కులు పెట్రేగిపోతున్నారు. ఆయనకు పరోక్ష పాత్ర ఉండడంతో అధికారులు కళ్లకు గంతలు కట్టుకున్నారు. కర్నూలు నగర శివారులో 590 ఎకరాల విస్తీర్ణంలో జగన్నాథగట్టు ఉంది. ప్రభుత్వ భవిష్యత్తు అవసరాల (ప్రభుత్వ ఆఫీసులు, విద్యా సంస్థలు మొదలైనవి) కోసం ల్యాండ్ బ్యాంక్‌లో ఉంచారు. ఇక్కడే హైకోర్టు నిర్మిస్తామని ప్రభుత్వ పెద్దలు పదేపదే చెబుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ట్రిపుల్ ఐటీ కళాశాల నిర్మించారు. పలు ప్రభుత్వ సంస్థలకు భూములు కేటాయించారు. నాణ్యమైన ఎర్రమట్టికి నిలయమైన జగన్నాఽథగట్టుపై ఎర్రమట్టి మాఫియా కన్నుపడింది. ఎక్స్‌కవేటర్లను కొండలో దింపేసి రేయింబవళ్లు మట్టి తవ్వేసి అక్రమ రవాణా చేశారు. ఎట్టకేలకు మైనింగ్ అధికారులు సర్వే చేసి 1.71 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా ఎర్రమట్టి అక్రమంగా రవాణా చేశారని నిగ్గు తేల్చారు. 8 మంది అక్రమార్కులను గుర్తించి అపరాధ రుసుంతో కలిపి రూ.19.36 కోట్లు చెల్లించాలని నోటీసులు జారీ చేసిందంటే ఏ స్థాయిలో జగన్నాథగట్టును కొల్లగొట్టారో తెలుస్తుంది. ఇక ఇసుక అక్రమ రవాణా సరేసరి. ఎమ్మెల్యే అనుచరులు తంగభధ్ర నుంచి ఎలాంటి బిల్లులు లేకుండా రాత్రి వేళల్లో ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారు.
‘భూ’మాయ!
సీనియర్ ఎమ్మెల్యే పంచాయితీ చేశారంటే ఆస్తి బినామీలకో.. అనుచరులకో రావాల్సిందే. రూ.కోట్లు విలువైన భూములను సెటిల్‌మెంట్‌ల ద్వారా, ఫోర్జరీ రికార్డుల ద్వారా అధికారం మాటున వైసీపీ నాయకులు సొంతం చేసుకున్నారు. నియోజకవర్గంలో దాదాపు ఆరు ఎకరాల విస్తీర్ణంలో 2006లో వెంచర్ వేశారు. హైదరాబాద్–బెంగళూరు వయా కర్నూలు జాతీయ రహదారి పక్కనే ఉండటంతో ఇళ్లు కట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుందని పలువురు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, చిరువ్యాపారులు ప్లాట్లు కొనుగోలు చేశారు. 164 మంది రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే బినామీ పేరుతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేశారని బాధితులు లబోదిబోమంటూ జాయింట్ కలెక్టర్‌ను ఆశ్రయించారు. హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ భూమి విలువ రూ.25–30 కోట్లకు పైగా ఉంటుందని అంటున్నారు.
తండ్రి బాటలో పుత్రరత్నం
కర్నూలు జిల్లాలో ఆయన సీనియర్ నేత. ఫ్యాక్షన్ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చారు. ఐదారు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పలుమార్లు మంత్రి పదవి వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. మంత్రి కాలేకపోయినా సదరు ఎమ్మెల్యే అక్రమార్జనలో మాత్రం టాప్! భూకబ్జాలు, దందాలు, ఎర్రమట్టి, ఇసుక అక్రమ రవాణా, సెటిల్‌మెంట్ వ్యవహారాలన్నింటిలోనూ ఆరితేరారు.
గన్ పెట్టి బెదిరించి..
నియోజకవర్గంలోని ఓ మండలంలో టీడీపీ హయాంలో వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో ఆసియాలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. సోలార్ పలకలు క్లీనింగ్ (దుమ్ము శుభ్రం చేయడం) చేసే కాంట్రాక్ట్ (ఓఅండ్‌ఎం) ఓ ప్రైవేటు సంస్థకు ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే ఆ కాంట్రాక్ట్‌పై ఆ పార్టీ ముఖ్య నాయకుల కన్ను పడింది. వారికి ఎమ్మెల్యే అండ కూడా ఉంది. సోలార్ పవర్ ఉత్పత్తి కంపెనీ ఆఫీసుకు వెళ్లి టేబుల్‌పై గన్ పెట్టి పలకల క్లీనింగ్ కాంట్రాక్ట్ తమకే ఇవ్వాలని బెదిరించారు. ఇక చేసేది లేక ప్రజాప్రతినిధి అనుచరులకు కాంట్రాక్ట్‌ను ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఓ మండలం కేంద్రంగా 33 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ఓ పరిశ్రమ నిర్మాణంలో ఉంది. భారత ప్రభుత్వ రంగ సంస్థ డీఆర్‌డీఓ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ పనులన్నీ ముఖ్య ప్రజాప్రతినిధికి చెందిన సంస్థ, ఆయన బావమరిది చేజిక్కించుకున్నారని అంటున్నారు.
వక్ఫ్‌బోర్డు భూమి కబ్జా
నగరు శివారులోని ఓ ఎస్టేట్‌లో 10.64 ఎకరాలు వక్ఫ్ బోర్డు భూమి ఉంది. షాషా మసీదుకు 5.30 ఎకరాలు, అల్లిషా మసీద్‌కు 5.14 ఎకరాలు చెందిన భూమి అని నిర్వాహకులు అంటున్నారు. అందులో రెండు ఎకరాలు కబ్జా చేశారు. దీని విలువ రూ.20–30 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. దీనిపై మసీదు నిర్వాహకులు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎమ్మెల్యే ముఖ్య అనుచరులే నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆక్రమించుకొని రిజిస్ట్రేషన్లు కూడా చేసుకున్నారని ముస్లిం మతపెద్దలు అంటున్నారు. దీనిపై పంచాయితీ పేరుతో ఇంటికి పిలిపించి ఆ ప్రజాప్రతినిధి బెదిరింపులకు గురి చేశారని ఆరోపిస్తున్నారు. నెల రోజుల క్రితం టీడీపీ మైనారిటీ నేతలు ఈ భూమిని పరిశీలించి వక్ఫ్‌బోర్డు ఆస్తిని కాపాడాలని డిమాండ్ చేశారు. కబ్జాకు గురైన 2 ఎకరాలు వక్ఫ్ బోర్డుకు చెందిన భూమేనని రెవెన్యూ అధికారులు కూడా నిగ్గు తేల్చారు.
దేవుడి భూమినీ వదల్లేదు!
నియోజకవర్గంలో ఓ ప్రముఖ ఆలయానికి 6.65 ఎకరాల భూమి ఉంది. నేషనల్ హైవే–44 కోసం 0.42 సెంట్లు భూ సేకరణ చేశారు. సబ్ డివిజన్ చేసి 6.23 ఎకరాలు దేవదాయశాఖ భూమిగా చూపించారు. బహిరంగ మార్కెట్ ప్రకారం ఆ భూమి విలువ రూ.35–40 కోట్లు ఉంటుంది. ఈ భూములపై కన్నేసిన అక్రమార్కులు రికార్డులో లేని సర్వే నంబరును సృష్టించారు. 6.23 ఎకరాలకు సరిహద్దులు చూపించి ఏకంగా రిజిస్ట్రేషన్ చేయించారు. ఓ వైసీపీ నాయకుడు నకిలీ డాక్యుమెంట్లతో కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. 35 సెంట్ల భూమిలో ఏకంగా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. ఎమ్మెల్యే అండదండలతోనే ఆ పార్టీ నాయకులు బరితెగించారని అంటున్నారు.
• నియోజకవర్గ కేంద్రం మండల పరిధిలో 605 ఎకరాలు ప్రభుత్వ కొండ పరంబోకు భూమి ఉంది. ఎమ్మెల్యే అనుచరులు ఎర్రమట్టి మాఫియాగా మారి ఇష్టారాజ్యంగా పచ్చని కొండను కొల్లగొట్టారు.
Updated Date - Jan 15 , 2024 | 09:44 AM