తలుపూరుపాడులో దారుణం
ABN, Publish Date - Jan 30 , 2024 | 10:58 PM
మండలంలోని తలుపూరుపాడులో వృద్ధురాలి ఒంటిపై ఉన్న నగలపై కన్నేసిన యువకుడు కసాయిగా మారాడు. ఆ వృద్ధురాలి భర్తకు మద్యం తాపించి కోమాలోకి వెళ్లిన తరువాత అర్ధరాత్రి వృద్ధురాలిని గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఆ వృద్ధురాలి ఒంటిపై ఉన్న నగలు అపహరించి, గుట్టు చప్పుడు
భర్తకు మద్యం తాపించి వృద్ధురాలి హత్య
ఆపై నగల అపహరణ
అంత్యక్రియల తరువాత అనుమానం
పరారీలో నిందితుడు
సంగం, జనవరి 30: మండలంలోని తలుపూరుపాడులో వృద్ధురాలి ఒంటిపై ఉన్న నగలపై కన్నేసిన యువకుడు కసాయిగా మారాడు. ఆ వృద్ధురాలి భర్తకు మద్యం తాపించి కోమాలోకి వెళ్లిన తరువాత అర్ధరాత్రి వృద్ధురాలిని గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఆ వృద్ధురాలి ఒంటిపై ఉన్న నగలు అపహరించి, గుట్టు చప్పుడు కాకుండా జారుకున్నాడు. మరుసటిరోజు మధ్యాహ్నం కోమాలో నుంచి బయటకు వచ్చిన వృద్ధుడు భార్య అపస్మారక స్థితిలో పడి మృతి చెంది ఉండడంతో గమనించి స్థానికులకు, కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆ యువకుడిపై అనుమానంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ కథనం వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ సాహెబ్, మస్తాన్‌బీ వృద్ధ దంపతులు. వీరు స్వంత ఇంట్లో నివశిస్తున్నారు. వీరికి నలుగురు కుమారులు, అందరికి వివాహాలయ్యాయి. వీరిలో ఇద్దరు దామరమడుగులో, ఒకరు బెంగళూరు, మరొకరు మర్రిపాడులో ఉన్నారు. వృద్ధురాలి వద్ద 8 సవర్ల బంగారు నగలు ఉన్నాయి. ఇంట్లో భద్రపరిచే అవకాశం లేదని ఆమె ఒంటి మీద ధరించింది. గ్రామంలో ఉన్న ఓ మనవరాలు వీరికి ఏదైనా అవసరమైతే చూస్తుంటుంది. ఈ క్రమంలో దంపతులిద్దరు శనివారం దామరుడుగులోని కుమారుల వద్దకు వెళతామని మనవరాలికి చెప్పారు. ఊరికి వెళ్లి ఉంటారని ఆమె భావించి వృద్ధులున్న ఇంటి వైపు వెళ్లలేదు. అయితే శనివారం సాయంత్రం స్థానిక యువకుడు వృద్ధుడికి మద్యం సీసా తెచ్చించాడు. మద్యం తాగిన వృద్ధుడు కోమాలోకి వెళ్లాడు. ఈ విషయం ఎవరికీ తెలియదు. ఆదివారం మధ్యాహ్ననికి కోమాలో నుంచి బయటకు వచ్చాడు. ఇంటోకి వెళ్లి చూడగా భార్య మస్తాన్‌బీ (77) అపస్మారక స్థితిలో కింద పడి మృతి చెంది ఉంది. దీంతో కాలనీలో ఉన్న మనవరాలికి సమాచారం అందించాడు. ఆమె స్థానికులతో కలిసి వచ్చి చూడగా వాంతులు చేసుకుని, బట్టలో మలవిసర్జన చేసుకుని విగతజీవిగా పడి ఉంది. దీంతో గుండె పోటుతో మృతి చెంది ఉంటుందని అందరూ భావించారు. కుటుంబ సభ్యులందరూ వచ్చిన తరువాత సోమవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. అయితే వృద్ధురాలి ఒంటి మీద ఉన్న బంగారు నగలు మొదట వచ్చిన కుటుంబ సభ్యులే తీసి ఉంటారని మిగతా కుటుంబ సభ్యులతోపాటు స్థానికులు భావించారు. అంత్యక్రియల తరువాత నగలపై ఆరా తీయగా కుటుంబ సభ్యులెవరూ తీయలేదని తెలిసింది. ఈ నేపధ్యంలో మద్యం సీసా తెచ్చిచ్చిన యువకుడు విషయం వెలుగు చూసింది. దీనికి తోడు మృతదేహానికి స్థానం చేపించేటప్పుడు మెడ మీద గాయాలు, వాసి ఉండడాన్ని కుటుంబ సభ్యులు గమనించారు. ఈ క్రమంలో వృద్ధురాలి మృతిపై అనుమానంతో మద్యం సీసా తెచ్చిచ్చిన యువకుడుపై మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి విచారించారు. మద్యం సీసా తెచ్చించిన యువకుడు పరారీలో ఉన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
--------------
Updated Date - Jan 30 , 2024 | 10:58 PM