ఉత్సాహంగా ఊరూవాడా భోగి సంబరాలు
ABN, Publish Date - Jan 14 , 2024 | 10:11 PM
మండలంలో ఆదివారం భోగి సంబరాలు మిన్నంటాయి. రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు స్వగ్రామమైన ఇస్కపల్లిలో తెలుగుదనం ఉట్టిపడేలా హరిదాసులు, గంగిరెద్దు, కోలాటాలు తదితర కార్యక్రమాలతో సంబరాలను నిర్వ
అల్లూరు, జనవరి 14 : మండలంలో ఆదివారం భోగి సంబరాలు మిన్నంటాయి. రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు స్వగ్రామమైన ఇస్కపల్లిలో తెలుగుదనం ఉట్టిపడేలా హరిదాసులు, గంగిరెద్దు, కోలాటాలు తదితర కార్యక్రమాలతో సంబరాలను నిర్వహించారు. పది రోజులుగా నిర్వహించిన క్రికెట్ పోటీలు, ఇతర క్రీడా పోటీలు, ముగ్గుల పోటీల విజేతలకు ఆయన సతీమణి, కుటుంబ సభ్యులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ దర్శిగుంట శశిరేఖ, సర్పంచి రంజిత్, కావలి ఏఎంసీ మాజీ చైౖర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యం, తదితరులు ప్రముఖులు పాల్గొన్నారు.
లింగసముద్రం : మండలంలో భోగిని పురస్కరించుకొని ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుంచే ప్రజలు భోగి మంటలు వేశారు. అలాగే తమ ఇండ్ల ముందు రంగవల్లులు వేశారు. పండుగను స్వగ్రామాల్లో జరుపుకునేందుకు ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలలో ఉంటున్న మండల వాసులు తరలివచ్చారు. దీంతో మండలంలోని లింగసముద్రం, పెదపవని, వీఆర్ కోట, మొగిలిచెర్ల తదితర గ్రామాలు కలకలలాడాయి. ఈ పండుగకు సంప్రదాయంగా నడిచి వచ్చే హరిదాసులు హైటెక్‌గా మోటారు సైకిల్‌పై వస్తూ దర్శనమిచ్చారు.
జలదంకి : మండలంలోని అన్నిగ్రామాల్లో ఇంటింటాప్రజలు భోగిమంటలు వేశారు. దూరప్రాంతాల్లో ఉండే బంధువులు పండుగకు ఇంటికి చేరుకుని భోగిని ఘనంగా జరుపుకుంటున్నారు. ఇంటివాకిళ్ల ముందు రంగురంగులముగ్గులను మహిళలు పోటాపోటీగా వేశారు. కాకర్లట్రస్ట్ అధినేత కాకర్ల సురేష్ తన ట్రస్ట్ తరుపున ముగ్గుల పోటీ నిర్వహిస్తుండగా, పలువురు సెల్ఫీలు తీసి పంపారు.
కలిగిరి : మండల ప్రజలు భోగి వేడుకను ఆదివారం వేడుకగా జరుపుకున్నారు. వేకువనే మహిళలు, చిన్నారులు, యువత భోగి మంటలు వేశారు. అనంతరం తలంటు స్నానాలుచేసి నూతన వస్ర్తాలు ధరించి ఆలయాలలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. హరిదాసులు, పగటి వేషగాళ్లకు పిండివంటలు పంపిణీ చేశారు. వలసవెళ్లిన వారు స్వగ్రామాలకు తరలిరావడంతో సందడి నెలకొంది.
కొండాపురం : మండల పరిధిలోని అన్ని గ్రామాలలోనూ భోగిని భక్తులు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా భోగిమంటలు వేసి పండుగకు స్వాగతం పలికారు. తాటేకులతోపాటు ఇంటిలోని పనికిరాని వస్తువులను మంటల్లో వేశారు.
Updated Date - Jan 14 , 2024 | 10:11 PM