పందెం కోఢీ
ABN, Publish Date - Jan 17 , 2024 | 12:44 AM
జిల్లాలో పందెం కోళ్లు తొడకొట్టాయి. లక్షల్లో డబ్బులు చేతులు మారాయి. ఇంతస్థాయిలో బరులు ఏర్పాటు కావడం ఇదే తొలిసారి. పలు గ్రామాల్లో ఆది, సోమ, మంగళవారాల్లో కోడి పందేలు జోరుగా సాగాయి.
జిల్లావ్యాప్తంగా పందేల జోరు
యథేచ్ఛగా బరుల ఏర్పాటు
కోడికి రూ.500, కత్తికి రూ.500 వసూలు
కొన్నిచోట్ల ప్రవేశ రుసుం
పోలీసుల ప్రేక్షకపాత్ర
అధికారపార్టీ నేతల అండతోనే ఆట
రూ.లక్షల్లో చేతులు మారిన వైనం
భారీగానే పేకాట శిబిరాలు
జిల్లాలో పందెం కోళ్లు తొడకొట్టాయి. లక్షల్లో డబ్బులు చేతులు మారాయి. ఇంతస్థాయిలో బరులు ఏర్పాటు కావడం ఇదే తొలిసారి. పలు గ్రామాల్లో ఆది, సోమ, మంగళవారాల్లో కోడి పందేలు జోరుగా సాగాయి. అధికారపార్టీకి చెందిన నాయకుల అండతో పందెంరాయుళ్లు రెచ్చిపోయారు. ‘మేముండగా మీకెందుకు భయం.. ఏం జరిగినా మేం చేసుకుంటాం.. మీరు మమ్మల్ని చూసుకోండి’ అంటూ పెద్ద నేతలు అభయమివ్వడంతో మూడు రోజులుగా పలు గ్రామాల్లో గోదావరి జిల్లాల స్థాయిలోనే బరులు నడిచాయి. కోడి పందేలు, పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు పండుగకు ముందురోజు చేసిన హెచ్చరికలను ఎవరూ లెక్క చేయలేదు. తమ అనుయా యులతో ఎక్కడికక్కడ య థేచ్ఛగా కోడిపందేలు, పేకాట శిబిరాలను వైసీపీ నేతలు దగ్గరుండి ఏర్పాటు చేశారు.
ఒంగోలు (క్రైం), జనవరి 16 : సంప్రదాయం ఆటలు కాదని జిల్లాలో కోడి పందేలు, పేకాట తదితరాలతో సంక్రాం తి పండుగ జోరుగా హుషారుగా సాగింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎక్కడ చూసినా బరులను బాహాటంగా ఏర్పాటు చేసి పందేలు వేశారు. పైపెచ్చు మద్యం ఏరులై పారింది. ప్రధానంగా ఒంగోలు నగరానికి సమీపంలోనే పందేలను యథేచ్ఛగా నిర్వహించారు. వేల మంది అక్కడకు చేరినా కనీసం పట్టించుకునేవారు కరువయ్యారు. ఎస్పీ మలికగర్గ్ కోడి పందేలు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరికలు జారీ చేసినా పందేల నిర్వాహకులు లెక్కపెట్టలేదు. ఆధికార పార్టీ నాయకుల అండదండలు ఉండటం తోనే బరితెగించి బరులు నిర్వహించారు. చోటామోటా నాయకుల కనుసన్నలలో కోడిపందేలు వేయడం గమనార్హం. జిల్లాలో అనేక ప్రాంతాల్లో పందేలు వరుసగా మూడు రోజులు వేశారు. పెద్దఎత్తున పైపందేలు నడిచాయి. లక్షల్లో నగదు చేతులు మారింది. ఉదాహరణకు కొత్తపట్నం మండలం గవండ్లపాలెంలో మూడు రోజులపాటు కోడి పందేలు జోరుగా సాగాయి. చీమకుర్తి మండలం ఎర్రగుడిపాడులో బరి ఏర్పాటు చేసినట్లు జిల్లా అధికారులకు తెలిసినప్పటికీ మిన్నకుండటం చర్చనీయాంశమైంది. వరుసగా బరులు ఏర్పాటు చేసి పైపందేలు వేస్తుంటే చూస్తూ ఉండిపోవడం నిస్సహాయతా? లేక పచ్చజెండా ఊపడమా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బరులు వేసేవారి నుంచి పోలీసులకు ప్యాకేజీలు ముట్టాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
రూ.లక్షల్లో పైపందేలు
కోడి పందేల కంటే పైపందేలు లక్షల్లో నడిచాయి. బరి వద్ద సకల సౌకర్యాలు కల్పించారు. అక్రమంగా మద్యం విక్రయించారు. అందుకు అనుమతిచ్చినందుకు రోజుకు రూ.10వేలకుపైనే బరి నిర్వాహకుడికి ముట్టజెప్పినట్లు సమాచారం. బిర్యానీలు, మటన్, చికెన్ వంటకాలు బండ్లపై పెట్టుకుని విక్రయించేవారు రూ.10వేలు చెల్లించారు. ఇతర వ్యాపారాలు కూడా జోరుగా సాగాయి. ఇలా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా బరులు మారినా, పోలీసు అధికా రులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. పండుగకు ముందు రోజు ఎస్పీ మలికగర్గ్ ఓ ప్రకటన విడుదల చేశారు. కోడి పందేలు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు సమాచారం ఇవ్వాలని కోరారు. అయితే మూడు రోజులు వరుసగా ఒకేచోట పందేలు అధికారబలంతో నిర్వహించినా చర్యలు కరువయ్యాయి. అసలు సమాచారం ఇచ్చిన వారికి ఎదురైన మర్యాద ఏమిటి అన్నది కూడా చర్చనీయాంశమైంది. అంతేకాదు కోడి పందేలలో పై పందేలు వేసి లక్షలు పోగొట్టుకున్న వారు అనేక మంది ఉన్నారు.
పశ్చిమ ప్రాంతంలోనూ భారీగా..
జిల్లాలో పశ్చిమ ప్రాంతంతోపాటు మైదానాలు, సముద్ర తీరప్రాంతాలలో కోడి పందేల జోరు సాగింది. ముందుగా పందెంరాయుళ్లకు సమాచారం ఇచ్చి పందేలు వేయడం విశేషం. అయితే ‘పండుగ కదా పోనివ్వండి’ అని పోలీసు అధికారులు చెప్పడం చూస్తే కోడి పందేలకు వారే పచ్చజెండా ఊపారన్న అనుమానాలు ఉన్నాయి. సింగరాయకొండ మండలం పాకల సమీపంలోని పట్టపుపాలెం, నాగులుప్పలపాడు మండలం కనపర్తి, కొత్తపట్నం మండలం గవండ్లపాలెం, మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు, చీమకుర్తి మండలం ఎర్రగుడిపాడు ఇలా అనేక ప్రాంతాల్లో కోడి పందేలు భారీ ఎత్తున సాగాయి. వందలమంది రోజంతా అక్కడే తిష్ట వేసి పందేలను తిలకించారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే జిల్లావ్యాప్తంగా పేకాట శిబిరాలు కూడా మూడు రోజులపాటు కోలాహలంగా సాగాయి. రూ.లక్షల్లో నగదు చేతులు మారింది.
అధికార పార్టీ నాయకుల అండతో.
పీసీపల్లి : మండలంలోని లక్ష్మక్కపల్లి, భట్టుపల్లి, ఇర్లపాడు పరిసర ప్రాంతాల్లో బరులను ఏర్పాటు చేసి కోడి పందేలు నిర్వహించారు. కోడిని తెచ్చిన వ్యక్తి నుంచి రూ.500, కత్తి కడితే రూ.500 చొప్పున నిర్వాహకులు వసూలు చేశారు. పందేలు జరుగుతున్న సమయంలో చూసేందుకు వెళ్లిన వారు పందెం కాసి వేలల్లో నష్టపోయినట్లు చెప్తున్నారు. కొన్ని బరుల వద్ద ప్రవేశ రుసుం పేరుతో నగదు వసూలు చేశారు. లక్షల్లో పందేలు సాగినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. బరుల వ్యవహారాన్ని కొంతమంది సోషల్ మీడియాలో పెట్టడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. మంగళవారం పీసీపల్లి ఎస్‌ఐ జి.కోటయ్య సిబ్బందితో భట్టుపల్లి సమీపంలో జరుగుతున్న పందెం వద్దకు వెళ్లి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కేవలం రెండు కోళ్లు, రూ.2,250 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
వెలిగండ్లలో జోరుగా కోడి పందేలు
వెలిగండ్ల : పోలీసుల హెచ్చరికలను లెక్కచేయకుండా వైసీపీ నాయకులు కోడి పందేలను జోరుగా నిర్వహించారు. పందేలు వేస్తే చర్యలు తప్పవని చెప్పిన పోలీసు, రెవెన్యూ అధికారులు పరోక్షంగా చూసీచూడనట్లు వ్యవహరించడంతో అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పందేలు యథేచ్ఛగా సాగాయి. వెదుళ్లచెరువు, రాళ్లపల్లి, కవ్వంపాడు గ్రామాల శివారులో మూడు రోజులుగా కోడి పందేలు, జూదం జరిగినా అటువైపు పోలీసులు కన్నెత్తి కూడా చూడలేదని గ్రామస్థులు అంటున్నారు. లక్షలు ఇచ్చి కోడి పందేలకు అనుమతి తెచ్చుకున్నట్లు నిర్వాహకులు బహిరంగంగా చెప్తున్నారు.
Updated Date - Jan 17 , 2024 | 12:44 AM