Sharmila : దూరం.. దూరంగానే!
ABN, Publish Date - Jan 19 , 2024 | 04:49 AM
యాంటికబ్బా ఇప్పుడు ఆమె రావడం!’... అంటూ సోదరి షర్మిలను కలిసేందుకు ఇష్టపడని జగన్!
అన్నతో కలివిడిగా ఉండలేని షర్మిల
మేనల్లుడి నిశ్చితార్థానికి జగన్, భారతి
ఫొటో కోసం పదేపదే అన్న పిలుపు
వేదికపై నిమిషంలోపే జగన్ దంపతులు
హైదరాబాద్, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): ‘యాంటికబ్బా ఇప్పుడు ఆమె రావడం!’... అంటూ సోదరి షర్మిలను కలిసేందుకు ఇష్టపడని జగన్! ‘అయితే, నా కుమారుడి పెళ్లి కార్డు గేటు దగ్గర సెక్యూరిటీకి ఇచ్చి పోతా’ అని చెల్లి షర్మిల స్పందన! దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో చెల్లెలిని కలిసి, మేనల్లుడి వివాహ పత్రికను జగన్ అందుకున్నారు. ఇది... మొన్నటి చిత్రం! ఇక... గురువారం హైదరాబాద్ శివారులోని ఓ రిసార్టులో జరిగిన నిశ్చితార్థ వేడుకలోనూ ఇద్దరి మధ్య విభేదాలు బయటపడ్డాయి. తన భార్య భారతితో కలిసి జగన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతకుముందు తనకు ఎదురైన అనుభవం వల్ల కాబోలు... జగన్ వేదికపైన ఉన్న ఆ ఒక్క నిమిషం కూడా షర్మిల ఆయనతో కలివిడిగా ఉండలేకపోయారు. స్వయానా సోదరుడు, అందునా రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు రెండు అడుగులు ముందుకు వేసి, ఆహ్వానించి... కాబోయే కోడలిని పరిచయం చేయడం వంటివి జరగాలి. కానీ... జగన్ దంపతులు వస్తున్నా ఎక్కడున్న షర్మిల అక్కడే నిల్చున్నారు. జగనే ఆమె దగ్గరికి వచ్చి, అలా పలకరిస్తూ ముందుకెళ్లి... మేనల్లుడైన వరుడు రాజారెడ్డికి, వధువు ప్రియా అట్లూరికి పుష్పగుచ్ఛం ఇచ్చారు. తర్వాత అంతా కలిసి ఫొటో దిగుదామంటూ జగన్ పదేపదే షర్మిలను, బావ అనిల్‌నూ పిలిచారు. రెండుమూడుసార్లు చేతులు ఊపినా షర్మిల స్పందించలేదు. అనిల్ అలా రెండు అడుగులు ముందుకు వేసి... ఇలా వెనక్కి వచ్చారు. చివరికి... తల్లి విజయలక్ష్మి పిలవడంతో షర్మిల, అనిల్ వచ్చి ఫొటో కోసం నవ్వుతూ నిలబడ్డారు. మొత్తంగా నిమిషం కూడా జగన్ వేదికపై ఉండలేదు!
హాజరైన పలువురు ప్రముఖులు
నిశ్చితార్థ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాబోయే వధూవరులకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రులు రఘువీరారెడ్డి, జానారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పళ్లం రాజు, పీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, నటుడు మంచు విష్ణు, సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు వచ్చారు.
Updated Date - Jan 19 , 2024 | 04:50 AM