జీడిపప్పుపై నల్లమచ్చలు
ABN, Publish Date - Jan 20 , 2024 | 12:09 AM
ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది జీడిపప్పుపై నల్లని మచ్చలు వ్యాపారులను కలవరపెడుతున్నాయి. సాధారణంగా ప్రతికూల పరిస్థితుల్లో జీడిపప్పుపై మచ్చలు వస్తుంటాయి.
- నష్టపోతున్న వ్యాపారులు
(పలాస)
ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది జీడిపప్పుపై నల్లని మచ్చలు వ్యాపారులను కలవరపెడుతున్నాయి. సాధారణంగా ప్రతికూల పరిస్థితుల్లో జీడిపప్పుపై మచ్చలు వస్తుంటాయి. గుడ్డు రంగు మారడం, కుళ్లడం జరుగుతుంటాయి. కానీ ఈ ఏడాది ఎక్కువగా విదేశీ పిక్కలపై టన్నుకు 50 కిలోల వరకు ఇటువంటి మచ్చలు ఉండడంతో తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మచ్చల కారణంగా రవాణాకు అనుకూలంగా లేకపోవడంతో జీడిపప్పును ముక్కలు చేసి విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది రూ.20కోట్ల వరకు వ్యాపారులు నష్టపోయినట్లు అంచనా. డిసెంబరు నుంచి మార్చి నెల వరకు జీడిపప్పు విక్రయాలు ఎక్కువగా ఉంటాయి. మనదేశంలో పిక్కల లభ్యత తక్కువగా ఉండడంతో వియాత్నం, ఐవిరికోస్ట్, శ్రీలంక, టాంజీనియా, ఘన వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. పిక్కలు పీలింగ్ చేసిన తరువాత ఎక్కువ శాతం పప్పుపై నల్లని మచ్చలు వస్తున్నాయి. పొగమంచు, తెగుళ్లు జీడిపంటపై ప్రభావం చూపుతాయి. పిక్కలు కొనుగోలు చేసినప్పుడు నాణ్యత పరీక్షించాలి. ప్రతి వంద పిక్కలను సేకరించి పచ్చి పిక్కలనే పీలింగ్ చేయడం వల్ల నాణ్యత లభిస్తుంది. అయితే విదేశీ పిక్కలు నాణ్యత కొలుచుకోవడానికి ఇబ్బందులు ఉండడంతో బ్రోకర్లు, ట్రేడర్లు ఇచ్చిన రేటుకు, నాణ్యతతో సంబంధం లేకుండా కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీనివల్ల పప్పు తీసినప్పుడు ఇటువంటి సమస్యలు తరచూ వస్తున్నాయి. మన ప్రాంత పిక్కలకు ఇటువంటి సమస్యలు ఉన్నా కేవలం ఒకటి, రెండు శాతం వరకు మాత్రమే జీడిపప్పుకు మచ్చలు వస్తుంటాయి. పప్పు రకాల ఏరివేతలో ఇటువంటివి నివారించవచ్చు. కానీ టన్నుకు 50 కిలోల చొప్పున మచ్చలు వస్తుండడంతో వాటిని తొలగించడానికి అంత సాంకేతిక నైపుణ్యం మన వద్ద లేకపోవడంతో మొత్తం ఆ పప్పునంతా స్ర్కాప్ కింద అట్టిపెట్టి ఉంచాల్సి వస్తుంది. ఉదాహరణకు సాధారణంగా జీడిపప్పు కిలో రూ.600 ఉన్నప్పుడు మచ్చలు ఉన్న పప్పు రూ.300కు మాత్రమే అమ్ముడవుతోంది. దీనివల్ల వ్యాపారులు ఈ ఏడాది నష్టాలు చవిచూశారు. ప్రస్తుతం మార్కెట్‌లో జీడిపప్పు రేట్లు తగ్గుముఖం పట్టడం, మచ్చల పప్పు ఎక్కువ కావడం వంటి ఘటనలు వల్ల దెబ్బతిన్నారు. మరో ఆరు నెలలు ఇలాంటి జీడిపిక్కలు దిగుమతి అయితే తాము కుదేలయ్యే పరిస్థితి ఉందని ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
నాణ్యత పరీక్షిస్తే నష్టాలు ఉండవు
నాణ్యత పరీక్షించిన తరువాతే పిక్కలు కొనుగోలు చేస్తే ఇటువంటి సమస్యలు ఉండవు. వ్యాపారులు ఏటా ఏదోఒక విధంగా నష్టపోతున్నారు. మార్కెఫెడ్ జీడి గింజలు కొనుగోలు, అమ్మకాలు జరిపితే వ్యాపారులకు ఇటువంటి ఇబ్బందులు ఉండవు.
- మల్లా భాస్కరరావు, జీడి వ్యాపార సంఘ మాజీ కోశాఽధికారి
Updated Date - Jan 20 , 2024 | 12:09 AM