ఆడలేం ఆంరఽధ!
ABN, Publish Date - Jan 29 , 2024 | 12:04 AM
క్రీడాకారులు ఆటల్లో పాల్గొనేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. చూసేవారు లేక ఆడేవారు లేక మైదానాలు వెలవెలబోయాయి. మొత్తానికి ఆర్భాటంగా ప్రారంభించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ‘ఆడలేం ఆంధ్ర’గా ముగియనుంది.
ఆసక్తి చూపని క్రీడాకారులు, సంఘాలు
మరోవైపు సచివాలయాల్లో కనిపించని సెక్రటరీలు
నేటితో ముగియనున్న జిల్లాస్థాయి పోటీలు
ఏలూరు స్పోర్ట్స్, జనవరి 28 :
ప్రజల్లో తమపార్టీ ప్రచారం కోసం ప్రభుత్వం చేసిన కొత్త ఎత్తులు తుస్సుమన్నాయి. 47 రోజుల పాటు ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రారంభించిన క్రీడా పోటీలకు స్పందన కరు వైంది. ఇప్పటికే మండల, నియోజకవర్గస్థాయి క్రీడా పోటీలు ముగిశా యి. సోమవారంతో జిల్లాస్థాయి పోటీలు ముగియనున్నాయి. ఆర్భా టంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా చాలా క్రీడాసంఘాలు దూరంగా ఉన్నాయి. క్రీడాకారులు ఆటల్లో పాల్గొనేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. చూసేవారు లేక ఆడేవారు లేక మైదానాలు వెలవెలబోయాయి. మొత్తానికి ఆర్భాటంగా ప్రారంభించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ‘ఆడలేం ఆంధ్ర’గా ముగియనుంది.
ఆడుదాం ఆంధ్ర పేరుతో ప్రభుత్వం తలపెట్టిన క్రీడాపోటీల నిర్వహణపై అనేక ఆరోపణలు వచ్చా యి. ఇప్పటికే ఈ క్రీడాపోటీల పేరిట ఓట్ల వేట కోసం అధికార పార్టీకి అనుబంధంగా పనిచేసేవారికి కిట్లు పంచారన్న విమర్శలు ఉన్నాయి. దీనికి అలుసుగా తీసుకుని కొందరు పీఈటీలు ఆటలను సైతం పంచేసుకున్నారు. ఇష్టానుసారంగా ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం జరిగింది. ముందే గెలుపు, ఓటమిలను నిర్దేశించారు. ఈ వ్యవహారంలో కొందరు పీఈటీలపై విమర్శలు వస్తున్నాయి. ఇదేం క్రీడాస్ఫూర్తి అంటూ ఆరోపణలు వస్తున్నాయి.
అధికార పార్టీ నేతల కనుసన్నల్లో..
ఎన్నికల హడావుడిలో అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడంతో ఈ కార్యక్రమం పూర్తిగా అధికారపార్టీ నేతల చేతుల్లోకి వెళ్లింది. గ్రామీణ ప్రాంతంలో జరిగిన ఆడుదాం ఆంధ్రా పోటీలకు వచ్చిన వారంతా వలంటీర్లు పురమాయించిన వారే ఎక్కువ. అధికార పార్టీకి సంబంధించిన వారు, తమ కన్నుసన్నల్లో పనిచేసే పీఈటీల ద్వారా మంచి జట్లు వేయించారు. వలంటీర్ల ద్వారా సమాచారం తెలుసుకుని అధికార పార్టీకి ఉపయోగపడే వారిని మండల స్థాయిలో మంచి టీమ్‌లో నియమించారు. మండల స్థాయిలో ఇప్పటి వరకు జరిగిన పోటీలు చూస్తే అసలు షెడ్యూల్ పాటించిన దాఖలాలే లేవు. ఈ పోటీలకు 15 ఏళ్లు పైబడిన వారినే తీసుకోవడంతో సమస్యలు అధికమయ్యాయి. భారీఎత్తున రిజిస్ర్టేషన్లు చేయించినా ఆ తర్వాత అంతా రాజకీయం అవ్వడంతో క్రీడాకారులు చాలా మంది తప్పుకున్నారు. మధ్యలో సంక్రాంతి సెలవులు కారణంగా చాలామంది ఆటగాళ్లు వెనుతిరిగారు. దీంతో ఆటగాళ్లు లేక జనంలేక వెలవెలబోయిన పోటీలను బయటకు తెలియకుండా ఉండడం కోసం ఆటలను కొందరు పీఈటీలు పంచేసుకున్నారు. ఇటీవల ఏలూరు ఇండోర్ స్టేడియంలో క్రికెట్ ఫైనల్ పోటీల్లో ప్రత్యర్థి జట్టుతో తలపడకుండానే విజేతను నిర్ణయించి రూ.35 వేలు చెక్కును మహిళా టీమ్‌కు అందజేయడం విమర్శలకు తావిస్తోంది. ప్రజల్లో పార్టీపేరును ప్రచారం చేయాలని ప్రభుత్వం వ్యూహం పన్నింది. రెండునెలల పాటు గ్రామ, సచివాలయ, మండల, నియోజకవర్గ, జిల్లా పోటీలు నిర్వ హించి సీఎం ఫొటోతో పబ్లిసిటీ ఇచ్చింది. అధికారులు సైతం తమ విధులను చేసుకోకుం డా ఈ కార్యక్రమం సక్సెస్ చేయాలని విసుగు పుట్టించారు. నిధులు కేటాయించకపోగా నిర్వహణపై అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. పేరుకు అన్నిచోట్ల అధికారులు పోటీలను ప్రారంభించి వెళ్ళిపోయారు. ఆ తరువాత ఆటగాళ్లు లేక మైదానాలు బోసిపోయాయి. సచివాలయాల్లో అధికారులు అందుబాటులో లేక పౌరసేవలు కరువు అయ్యాయి.
Updated Date - Jan 29 , 2024 | 12:04 AM