మంత్రిగారు వస్తారని !
ABN, Publish Date - Jan 04 , 2024 | 11:54 PM
గతేడాది నవంబర్‌లో దక్షణ మధ్య రైల్వే కర్ణాటక లోని హుబ్లీ వెళ్లే అమరావతి ఎక్స్‌ప్రెస్‌ను విజయవాడ నుంచి నరసాపురం వరకు పొడిగించింది. ఈరైలు ప్రారంభానికి ఒక కేంద్ర మంత్రి అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. అయితే అప్పట్లో ఆయన షెడ్యూల్ రద్దయ్యాయి.
అమరావతి ఎక్స్‌ప్రెస్ నరసాపురం వరకు పొడిగింపు !
మంత్రి చేతుల మీదుగా ప్రారంభించాలని నిర్ణయం
ఏడాదిగా దొరకని అపాయింట్‌మెంట్
ఎన్నికల నాటికైనా గ్రీన్ సిగ్నల్ పడేనా ?
నరసాపురం, జనవరి 4: నరసాపురం– విజయవాడల మధ్య డబ్లింగ్ లైన్ పనులు పూర్తయ్యాయి. అప్పటి వరకు సింగిల్ లైన్ ఉండటం వల్ల కొత్త రైళ్లకు ఆస్కారం లేకుండాపోయింది. గతేడాది పనులు పూర్తయ్యాయి. దీంతో పెండింగ్‌లో ఉన్న కొత్త రైళ్లు పట్టాలెక్కుతాయని జిల్లా వాసులు ఆశగా ఎదురు చూశారు. దానికి తగ్గట్టుగానే గతేడాది నవంబర్‌లో దక్షణ మధ్య రైల్వే కర్ణాటక లోని హుబ్లీ వెళ్లే అమరావతి ఎక్స్‌ప్రెస్‌ను విజయవాడ నుంచి నరసాపురం వరకు పొడిగించింది. షెడ్యూల్ ప్రకారం ఈ రైలు ఈ ఏడాది జనవరిలో పట్టాలెక్కాల్సి ఉంది. దీనికి సంబంధించి అన్ని క్లియరెన్స్‌లను రైల్వేశాఖ మంజూరు చేసింది. దీంతో జిల్లా నుంచి గుంతకల్, బళ్లారి, రాయచూర్, హుబ్లీతో పాటు గోవా వెళ్లే ప్రయాణికులు కూడా ఈ కొత్త రైలు కోసం ఎదురుచూశారు. ఈరైలు ప్రారంభానికి ఒక కేంద్ర మంత్రి అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. ఆయనచేతుల మీదుగా దీన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేశారు. అయితే అప్పట్లో ఆయన షెడ్యూల్ రద్దయ్యాయి. దీంతో మార్చిలోనైనా ప్రారం భించాలని ప్రయత్నించారు. అది కుదరలేదు. తరువాత తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఆ మంత్రిగారు బిజీ అయిపోయారు. అప్పటి నుంచి ఈ రైలు ప్రారం భానికి ముహూర్తం కుదరలేదు. దీంతో ఈ ఎక్స్‌ప్రెస్ విజయవాడ నుంచే నడుస్తున్నది. ఈ ఎక్స్‌ప్రెస్‌తో పాటు మరో ఎనిమిది కొత్త రైళ్ళకు అప్పట్లో దక్షిణ మధ్య రైల్వే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వాటిలో మచిలీపట్నం –ధర్మవరం కూడా ఉంది. ఇవన్నీ పట్టాలె క్కాయి. కానీ నరసాపురం నుంచి ప్రారంభం కావాల్సిన అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు మాత్రం గ్రీన్‌సిగ్నల్ పడలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో ఈ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించాలని మరోసారి ప్రయత్నించారు. అది కూడా చివరి నిమషంలో రద్దయింది. దీంతో ఎలాగైనా ఎన్నికల షెడ్యూల్ వచ్చేనాటికైనా ఆ మంత్రిగారిని తీసుకొచ్చి ఈ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించాలని రైల్వే అధికారులతో పాటు ఆ పార్టీ నాయకులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.
జిల్లాలో కర్ణాటక వాసులెక్కువే
ఉమ్మడి పశ్చిమలో కర్ణాటకలోని రాయచూర్, బళ్లారి, గంగావతి, హుబ్లీ తదితర ప్రాంతాల్లో అనేక మంది స్థిరపడ్డారు. దాదాపు 50 ఏళ్ల క్రితం వీరంతా వ్యవసాయ నిమిత్తం ఆక్కడికి వలస వెళ్లారు. అక్కడ నుంచి రావా లంటే బస్సు లేదా విజయవాడ వరకు రైలును ఆశ్రయి స్తున్నారు. చాలా ఏళ్లుగా అమరావతి ఎక్స్‌ప్రెస్‌ను నరసాపురం వరకు పొడిగించాలని రైల్వే, రాజకీయ నేతలకు ఆనేక విజ్ఞప్తులు కూడా చేశారు. చివరికి డబ్లింగ్ పని పూర్తికావడంతో తమ కల నేరవేరిందను కున్నారు. రైలుకు అనుమతి వచ్చినా గ్రీన్‌సిగ్నల్ మాత్రం పడలేదని పెదవి విరుస్తున్నారు.
Updated Date - Jan 04 , 2024 | 11:54 PM