Bernard Arnault: ఎలాన్ మస్క్‌ని అధిగమించి ప్రపంచ సంపన్నుడిగా అవతరించిన బెర్నార్డ్ ఆర్నాల్ట్.. సంపద ఎంతంటే..
ABN, Publish Date - Jan 28 , 2024 | 10:47 AM
ప్రపంచ సంపన్నుల జాబితాలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ రెండవ స్థానానికి దిగజారారు. ఫ్రెంచ్ లగ్జరీ గూడ్స్ దిగ్గజ కంపెనీ ‘ఎల్‌వీఎంహెచ్’ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ మరోసారి ప్రపంచంలో అత్యంత సంపన్న వ్యక్తిగా అవరించారు. ఆర్నాల్ట్ నికర సంపద విలువ శుక్రవారం నాటికి 207.8 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందగా ఎలాస్ మస్క్ ఆస్తి విలువ 204.5 బిలియన్ డాలర్లుగా ఉంది.
ప్రపంచ సంపన్నుల జాబితాలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ రెండవ స్థానానికి దిగజారారు. ఫ్రెంచ్ లగ్జరీ గూడ్స్ దిగ్గజ కంపెనీ ‘ఎల్‌వీఎంహెచ్’ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ మరోసారి ప్రపంచంలో అత్యంత సంపన్న వ్యక్తిగా అవరించారు. ఆర్నాల్ట్ నికర సంపద విలువ శుక్రవారం నాటికి 207.8 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందగా ఎలాస్ మస్క్ ఆస్తి విలువ 204.5 బిలియన్ డాలర్లుగా ఉంది. మస్క్ కంటే ఆర్నాల్డ్ సంపద 23.6 బిలియన్ డాలర్లు అధికంగా ఉందని ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా పేర్కొంది. మస్క్ అధినేతగా ఉన్న ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ ‘టెస్లా’ షేర్లు గురువారం ఏకంగా 13 శాతం పతనమవ్వడం ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. దీంతో సుమారు 18 బిలియన్ డాలర్ల విలువైన మస్క్ సంపద కరిగిపోయింది. ఇదే సమయంలో ఎల్‌వీఎంహెచ్ షేర్లు శుక్రవారం 13 శాతానికి పైగా వృద్ధి చెందాయి. ఆర్థిక వ్యవస్థలో కొనుగోళ్లు జోరందుకున్నాయని రిపోర్టుల నేపథ్యంలో ఎల్‌వీఎంహెచ్ షేర్లు కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు ఎగబడడం ఇందుకు కారణంగా ఉంది.
కాగా శుక్రవారం నాటికి ఎల్‌వీఎంహెచ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 388.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక టెస్లా మార్కెట్ క్యాప్ 586.14 బిలియన్ డాలర్లుగా ఉందని ఫోర్బ్స్ రిపోర్ట్ తెలిపింది. కాగా ప్రపంచ కుబేరుడిగా అవతరించిన ఆర్నాల్ట్ ప్రస్తుత వయసు 74 సంవత్సరాలు. ఈ స్థాయి ధనార్జనకు ఆయన దాదాపు నాలుగు దశాబ్దాలు కష్టపడ్డారు. చాలా జాగ్రత్తగా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. లూయిస్ విట్టన్, ట్యాగ్ హ్యూయర్, డోమ్ పెరిగ్నాన్ వంటి దిగ్గజ బ్రాండ్‌లను నిశితంగా పరిశీలించి కొనుగోలు చేశారు. అనంతరం చాలా వ్యూహంగా వాటిని అభివృద్ధి చేశారు. తన ఐదుగురు పిల్లలను కూడా వ్యూహాత్మకంగా వ్యాపారంలోకి తీసుకొచ్చారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎల్‌వీఎంహెచ్ మార్కెట్ వాల్యుయేషన్ 500 బిలియన్ డాలర్లు దాటింది. ఈ ఘనతను సాధించిన తొలి యూరోపియన్ కంపెనీగా నిలిచింది. ఆర్థిక సంక్షోభ కాలంలో కూడా కంపెనీ లగ్జరీ వస్తువులకు మంచి డిమాండ్ ఉంటుంది.
Updated Date - Jan 28 , 2024 | 10:52 AM