కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పిల్లి శాపాలకు ఉట్టి తెగిపడదు..!

ABN, Publish Date - Jan 11 , 2024 | 01:12 AM

పుట్టి ముంచేవారిని ఏమంటారు? మన రాష్ట్రంలో మాత్రం వారిని బీఆర్ఎస్ నాయకులంటారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు నిండకుండానే దానిపై నిందలేస్తున్నారు...

పిల్లి శాపాలకు ఉట్టి తెగిపడదు..!

పుట్టి ముంచేవారిని ఏమంటారు? మన రాష్ట్రంలో మాత్రం వారిని బీఆర్ఎస్ నాయకులంటారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు నిండకుండానే దానిపై నిందలేస్తున్నారు. అన్నప్రాశన నాడే ఆవకాయ తినమన్నట్టు బీఆర్ఎస్ నాయకులు, వారి అనుయాయుల తీరు ఉంది. ఇంగితం ఉన్నవారెవరూ ప్రభుత్వాన్ని ఇంత తక్కువ వ్యవధిలో ఇలాంటి ప్రశ్నలు వేయరు. తొమ్మిదిన్నరేళ్ల సారు, కారు పాలన రాష్ట్రానికి అంతులేని నష్టాన్ని కలిగించింది. అప్పుల్లో ముంచింది. దొంగలు దోచుకున్న ఇల్లులా ఆర్థిక వ్యవస్థ చిందరవందరయింది. ఎక్కడ ఎంత అప్పో, ఎన్ని ప్రాజెక్టులకు ఎన్ని నెర్రెలిచ్చాయో తెలుసుకుని, ప్రజలకు అర్థం చేయించడానికి కనీసం ఆరు నెలల వ్యవధి అవసరం ఉంటుంది.

అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 7న సీఎం, మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అయిన వెనువెంటనే తొలి మంత్రివర్గ సమావేశం అయింది. ఆరు హామీల్లో రెండు అమలుకు పునాది పడింది. సీఎం ఆరు హామీల ఫైలుపైనే తొలి సంతకం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజుల్లోనే ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకొచ్చింది. గడీ ముందున్న ఉక్కు కంచె బద్దలైంది. వేలాది మంది ప్రజలు తమ సొమ్ముతో నిర్మితమైన ప్రజాభవన్‌కు వస్తున్నారు. ఇది విస్పష్టంగా కనిపిస్తున్న మార్పు. ఇలాంటి మార్పు, తెలంగాణ వచ్చాక ప్రజలు ఆత్మగౌరవంతో మెలగడం, బీఆర్‌ఎస్‌ పార్టీ వారు అసలు సహించలేకపోతున్నారు. ఎటూ తోచక, ఏదో మాట అనాలని కడుపుబ్బరంతో అల్లాడుతున్నారు. అధికారం కోల్పోయారు. అహంకారం అణగిపోవడంతో ఆగం అవుతున్నారు.

ప్రజా ప్రభుత్వం శ్వేతపత్రాలతో ప్రజలను అప్రమత్తం చేయడాన్ని సహించలేకపోతున్నారు. కౌంటర్‌గా స్వేదపత్రాలని అంటున్నారు. కాంగ్రెస్ హామీలను 420 అంటున్నారు. బుక్కులు రిలీజ్ చేస్తున్నారు. ప్రజల పక్షాన పోరాటం అంటూ నటిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన 30 రోజుల్లోనే హామీల అమలు సాధ్యం అవుతుందా? అప్పట్లో 30 రోజుల్లో ఇంగ్లీష్, తమిళం, మలయాళం సులభంగా నేర్చుకోండి అని పుస్తకాలమ్మేవారు. పాలన అంటే రెపిడెక్స్ కోర్స్ కాదు. ఈ విషయాల గురించి అవగాహన సగటు మనుషులెవరికైనా ఉంటుంది... ఒక్క గత పాలకులు, వారి భజనపరులకు తప్ప.

ఇప్పుడు బోనులో నిలబడాల్సిన అనివార్యత వచ్చింది. జనం దృష్టి మరల్చాలి, అందుకే ఈ గగ్గోలు, గందరగోళాలు. నిజం నిప్పులాంటిది బయటపడక తప్పదు. చేసిన అప్పులు, తప్పులు అన్నీ బయటకు వస్తున్నాయి. గద్దె పోయి, గడి దూరమై, దొరల గుండెలు మండుతున్నాయి. నెల రోజుల కాంగ్రెస్ పాలనలో ప్రజల మేలు కోసం పడుతున్న తపన కళ్లముందు కనిపిస్తున్నది. ఆరు నెలల్లో చేయాల్సిన పనులు, సమీక్షలు కేవలం ఒక్క నెలలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసింది. ముఖ్యమంత్రి సచివాలయంలో అందుబాటులో ఉంటున్నారు. ఎవరైనా మంత్రులను, సీఎంను సులభంగా కలవవచ్చు. మంత్రులు స్వతంత్రంగా తమ శాఖల సమీక్షలు చేసుకుంటున్నారు, నిర్భయంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎటు చూసినా ప్రభుత్వం ప్రజలలోనే ఉండేందుకు ప్రజాపాలన నిదర్శనంగా నిలుస్తుంది. ఏ మాటకామాట చెప్పుకోవాలి గత ప్రభుత్వం అంటే కేవలం ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే. ఇప్పుడు ప్రభుత్వం అంటే అందరం, మనం అనే భావన ప్రజల్లో వచ్చింది. ఒక గుణాత్మకమైన మార్పు కనిపిస్తున్నది.

సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులను వెంటపెట్టుకొని కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తున్నారు. పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు 60 శాతం నిధుల హామీని కేంద్రం నుంచి పొందారు. ప్రధాని, ఆర్థిక, రక్షణ, హోంమంత్రిని ఇట్లా అందరినీ కలిశారు. పంతాలకు పోవడం లేదు వారెంతా అనే గత పాలకుల అహంకార ధోరణి అసలే లేదు. అన్నిటి కంటే ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు పడ్డాయి. మన రాష్ట్రానికి సరిపడే నమూనా ఆవిష్కృతం అవుతున్నది. ఇదంతా స్ఫటిక సదృశంగా కానవస్తున్న మార్పు. ఇవేవీ అప్పుడే కాంగ్రెస్ పాలనపై 420 బుక్కు రిలీజ్‌ చేసిన నాయకులకు కనబడటం లేదు, వినిపించడం లేదు. అందుకే ఈ 420 అంటూ సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారు.

నెహ్రూ ప్రజాస్వామ్య వారసత్వాన్ని మన రాష్ట్రంలో రేవంత్‌ కొనసాగిస్తున్నారు. నెహ్రూ విపక్ష సభ్యులు సభలో ఉండాలని కోరుకునేవారు, ఆచరించేవారు. ఇక్కడ రేవంత్ కూడా అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు ఉండాలని, చర్చ చేయాలని చెప్పారు, ఆచరించారు. నాటి బీఆర్ఎస్ పాలకులు సభ నుంచి విపక్ష సభ్యులను నిర్దయగా బయటకు పంపారు. ప్రజాస్వామ్య విలువలకు పాతర వేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించే వారికి, నియంతృత్వపు ధోరణి గలవారికి పొంతన కుదరదు. ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్నదిదే.

సంకుచిత మనస్తత్వంతో ప్రభుత్వం ఏర్పడుతుండగానే ఆ ప్రభుత్వం కూలిపోతుందని ప్రకటనలు ఇచ్చారు. ఆరు నెలల్లో ప్రభుత్వం కూలుతుందని జోస్యాలు చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు ఇలా తమ వక్రబుద్ధిని బయట పెట్టుకుంటున్నారు. పిల్లి శాపాలకు ఉట్లు తెగిపడవు. ప్రజాస్వామ్యం నియంతలకు తలవంచదు. ఈ విషయం గత పాలకులు, వారి భజనపరులు గుర్తుంచుకోవాలి.

ఏడాది, రెండేళ్ల తర్వాత ప్రభుత్వ పనితీరు బాగా లేకుంటే నిలదీయాలి, హామీలు విస్మరిస్తే ప్రజాక్షేత్రంలో ప్రశ్నించాలి. అంతేగానీ సంకుచితభావాన్ని వ్యక్తీకరిస్తే జనంలో బీఆర్‌ఎస్‌కు ఉన్న ఆ కాస్త ఇమేజ్ కూడా పోతుంది జాగ్రత్త. చివరి మాట వాస్తవంలో జీవించండి, వాస్తవాలు మాట్లాడండి, ప్రజలలో కలవండి. ప్రభుత్వ పనితీరుపై సద్విమర్శ చేయండి.

బోదనపల్లి వేణుగోపాలరెడ్డి

అధ్యక్షుడు–తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక

Updated Date - Jan 11 , 2024 | 01:12 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising