ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Budget 2024: వరాలు.. వాతలు లేకుండానే.. ఓట్లాటకు సై

ABN, Publish Date - Feb 02 , 2024 | 03:50 AM

ఎన్నికల ముందు మరో ‘బడ్జెట్‌ బండి’ దూసుకొచ్చింది. ‘ఓటాన్‌’ బడ్జెట్‌ కాస్తా మధ్యంతర బడ్జెట్‌గా మారిపోయింది. పదేళ్ల ‘ప్రగతి’పై వివరణ! వరాలూ... వడ్డింపులు లేకుండా... అందమైన భవిష్యత్‌ వర్ణనతో బడ్జెట్‌ కథా చిత్రం రక్తి కట్టింది. గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజాకర్షక ప్రకటనలు

సార్వత్రిక ఎన్నికలున్నా సాదాసీదాగానే నిర్మల బడ్జెట్‌

బడ్జెట్‌ ప్రసంగంలోనే గెలుపుపై ధీమా..

పదేళ్ల ‘ప్రగతి’ చూసి ఓటేయాలని సంకేతం

కేంద్రం ‘మధ్యంతర’ బడ్జెట్‌.. వరాల్లేవు.. వాతల్లేవు

మధ్య తరగతి గృహ నిర్మాణానికి కొత్త పథకం

ఆవాస యోజన కింద మరో 2 కోట్ల ఇళ్లు

300 యూనిట్ల వరకూ ఉచిత సోలార్‌ విద్యుత్తు

రైల్వేలో ఇంధన, మినరల్‌, సిమెంట్‌కు కారిడార్లు

వందే భారత్‌ స్థాయికి మరో 40 వేల బోగీలు

వెయ్యికిపైగా విమానాల కొనుగోలుకు ఆర్డర్లు

స్టార్ట్‌పల ప్రారంభానికి లక్ష కోట్ల కార్పస్‌ ఫండ్‌

దేశవ్యాప్తంగా ఐదు ఆక్వా పార్కుల ఏర్పాటు

9-14 ఏళ్ల బాలికలకు సర్వైకల్‌ క్యాన్సర్‌ టీకా

ఆయుష్మాన్‌ భారత్‌లోకి అంగన్వాడీలు, ఆశాలు

రాష్ట్రాలకు రూ.1.3 లక్షల కోట్ల వడ్డీ లేని రుణాలు

ఈ బడ్జెట్‌ దేశాభివృద్ధి కొనసాగింపునకు గ్యారెంటీ. దేశాభివృద్ధికి పడిన పునాదులను మరింత బలోపేతం చేస్తుంది. ఇది మధ్యంతర బడ్జెట్‌ కాదు.. సృజనాత్మక, సమ్మిళిత బడ్జెట్‌. యువత, పేద, మహిళలు, రైతుల సాధికారతకు దోహదపడుతుంది. యువ భారత్‌ ఆకాంక్షలను ప్రతిబింబిస్తోంది.

- ప్రధాని నరేంద్ర మోదీ

మొత్తం బడ్జెట్‌ 47,65,768 కోట్లు

పన్ను రాబడి 26,01,574 కోట్లు

అప్పులు 16,85,494 కోట్లు

(న్యూఢిల్లీ - ఆంధ్రజ్యోతి)

ఎన్నికల ముందు మరో ‘బడ్జెట్‌ బండి’ దూసుకొచ్చింది. ‘ఓటాన్‌’ బడ్జెట్‌ కాస్తా మధ్యంతర బడ్జెట్‌గా మారిపోయింది. పదేళ్ల ‘ప్రగతి’పై వివరణ! వరాలూ... వడ్డింపులు లేకుండా... అందమైన భవిష్యత్‌ వర్ణనతో బడ్జెట్‌ కథా చిత్రం రక్తి కట్టింది. గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజాకర్షక ప్రకటనలు ఉంటాయని... వేతన జీవికి భారీ ఊరట లభిస్తుందని... పెట్రో ధరల మంట తగ్గుతుందని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. ‘అయోధ్య రాముడి’ ఆశీస్సులు మెండుగా ఉన్నాయనుకున్నారేమోగానీ... ఓటరు దేవుడికి మాత్రం ఒట్టి చెయ్యే చూపించారు. గత ఎన్నికల ముందు కూడా మధ్యంతర బడ్జెట్‌నే ప్రవేశపెట్టారు. అప్పట్లో స్టాండర్డ్‌ డిడక్షన్‌ను 50 వేలకు పెంచారు. పన్ను ఆదాయం 5 లక్షల వరకూ ఉన్నవారికి రిబేటు ప్రకటించారు. ‘పీఎం కిసాన్‌’ పేరిట కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు! దాంతో, ఈ బడ్జెట్‌లోనూ వరాల జల్లులు కురిపించవచ్చని వివిధ వర్గాలు ఆశించాయి! కానీ... నిర్మలమ్మ వీరందరినీ నిరాశపరిచారు. పదేళ్లలో ఎంతో కష్టపడ్డామని, ఇంకెంతో సాధించామని లెక్కలు విప్పారు. అందుకే... ప్రజలు తమకు మరోసారి అద్భుత విజయం కట్టబెడతారనే ఆశాభావం ప్రకటించారు. పదేళ్లలో ఏం చేశామో బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మల ఏకరువు పెట్టారు! ఎప్పట్లాగే, ఆర్థిక క్రమశిక్షణే తమ ప్రథమ లక్ష్యమని చెప్పారు! అందుకు అనుగుణంగానే.. ‘గత పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా పరిణామం చెందింది’ అంటూ తన బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు! పదేళ్ల కిందటి యూపీఏ; తమ పాలనలోని విజయ, వైఫల్యాలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రకటించారు! వెరసి, ‘ఈసారి బడ్జెట్‌లో ప్రజాకర్షక పథకాలు గుప్పించం... పదేళ్ల మా పాలన చూసి ఓటు వేయండి’ అని ప్రజలకు స్పష్టం చేశారు!

ఊరించి.. ఉసూరనిపించి..!

నిరుపేదలు, మహిళలు, యువత, రైతుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మల.. వారితోపాటు ఇతరులకూ నిర్దిష్టంగా ఎటువంటి వరాలూ ప్రకటించలేదు. అలాగే వాతలూ పెట్టలేదు. మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనన్న మోదీ సర్కారు ధీమా బడ్జెట్‌ ప్రసంగంలో ప్రతిఫలించింది! రాబోయే ఐదేళ్లలో మునుపెన్నడూ లేని అభివృద్ధి జరగనుందని, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌ కల సాకారానికి ఇది స్వర్ణ యుగమని నిర్మల చెప్పారు. రాబోయే ఐదేళ్లలో మధ్య తరగతి గృహ నిర్మాణానికి సంబంధించి కొత్త పథకం ప్రకటిస్తామని నిర్మల ప్రకటించారు. ప్రధాన మంత్రి ఆవాస యోజన కింద మూడు కోట్ల మార్కుకు చేరుకుంటున్నామని, రాబోయే ఐదేళ్లలో మరో రెండు కోట్ల ఇళ్లను నిర్మిస్తామని వెల్లడించారు. రైల్వేలో మూడు (ఎనర్జీ, మినరల్‌, సిమెంట్‌) భారీ కారిడార్లను చేపట్టడంతోపాటు ఏకంగా 40 వేల సాధారణ బోగీలను వందే భారత్‌ స్థాయిలో తీర్చిదిద్దుతామని తెలిపారు. పోర్టు కనెక్టివిటీ కారిడార్లు, హై ట్రాఫిక్‌ డెన్సిటీ కారిడార్లనూ తీసుకొస్తామన్నారు. విమానాశ్రయాలను విస్తరించడంతోపాటు కొత్తగా వెయ్యికిపైగా విమానాలను కొంటామని చెప్పారు. రూఫ్‌ టాప్‌ సోలార్‌ పథకం కింద దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తు అందజేస్తామని ప్రకటించారు. టెక్నాలజీ అంటే చెవి కోసుకునే యువత స్టార్ట్‌పలను ప్రారంభించేందుకు చేయూత ఇస్తామని, తక్కువ వడ్డీకి లేదా వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చేందుకు లక్ష కోట్ల రూపాయలతో కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఐదు ఇంటిగ్రేటెడ్‌ ఆక్వా పార్కులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే, మహిళల ఆరోగ్యంపై నిర్మల ప్రత్యేకంగా దృష్టి సారించారు. 9-14 ఏళ్ల బాలికలకు సర్వైకల్‌ క్యాన్సర్‌ టీకా వేసేందుకు ప్రత్యేక పథకాన్ని తీసుకొస్తామని ప్రకటించారు. మాతా శిశు సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెబుతూనే.. ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని అంగన్వాడీలు, ఆశాలకూ విస్తరించారు. మహిళలను లక్షాధికారుల (లాక్‌పతి దీదీ)ను చేసే పథకం కింద ఇప్పటికే కోటి మందిని లక్షాధికారులను చేశామని, రాబోయే ఐదేళ్లలో మరో తొమ్మిది కోట్ల మందిని చేయడమే తమ లక్ష్యమని వెల్లడించారు. అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ ఆస్పత్రులను నిర్మిస్తామని, మరిన్ని మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉపాధి హామీ పథకం కేటాయింపులను 43 శాతం పెంచి 86 వేల కోట్లు చేశారు. ఎప్పట్లాగే రక్షణ బడ్జెట్‌కు పెద్దపీట వేశారు. గత బడ్జెట్‌తో పోలిస్తే 4 శాతం పెంచి రూ.6.2 లక్షల కోట్లు కేటాయించారు. ఇక, ప్రత్యక్ష, పరోక్ష పన్నులు సహా దిగుమతి సుంకాల్లో ఎటువంటి మార్పులు చేయలేదు. అయితే, స్టార్ట్‌ప్సకు ఇచ్చే కొన్ని రాయితీలు, సావరిన్‌ వెల్త్‌ బాండ్స్‌, పింఛను నిధుల్లో పెట్టే పెట్టుబడులకు ఇచ్చే రాయితీలు తదితరాలు వచ్చే ఏడాది మార్చి 31 వరకూ కొనసాగుతాయని తెలిపారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన 10 వేలు; 25 వేలలోపు వివాదాస్పద ఐటీ పన్ను డిమాండ్లను రద్దు చేశారు. తద్వారా, కోటి మందికి ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. విద్యుత్తు వాహన వ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్పిన నిర్మల.. అందుకు సంబంధించి నిర్దిష్ట కార్యాచరణను మాత్రం బడ్జెట్లో ప్రకటించలేదు. సరికదా.. ఫేమ్‌ పథకం బడ్జెట్‌నూ 44 శాతం కోత కోశారు.

మూలధన వ్యయానికి పెద్దపీట

ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, ద్రవ్యలోటును అదుపులో ఉంచడమే తమ ముందు ఉన్న ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. బడ్జెట్లో ఆ దిశగానే అడుగులు వేశారు. ఇందులో భాగంగా మూలధన వ్యయం పెంపునకు పెద్దపీట వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి మూలధన వ్యయాన్ని భారీగా 11.1 శాతం పెంచి రూ.11,11,111 కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించారు. తద్వారా, ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పన పుంజుకుంటాయని సంకేతాలు ఇచ్చారు. అయితే, గత ఏడాది రూ.10 లక్షల కోట్లు మూలధన వ్యయం కింద ఖర్చు చేస్తామని చెప్పినా.. రూ.9.5 లక్షల కోట్లకే పరిమితం కావడం గమనార్హం. రాష్ట్రాలకు కూడా మూలధన వ్యయం పెంచేందుకు ఈ ఏడాది రూ.1.3 లక్షల కోట్ల మేరకు వడ్డీ లేని రుణం కల్పిస్తామని, వికసిత్‌ భారత్‌ యాత్రలో భాగంగా సంస్కరణల అమలుకు రాబోయే 50 ఏళ్లలో మరో రూ.75 వేల కోట్ల వడ్డీ లేని రుణాలను రాష్ట్రాలకు అందిస్తామని వెల్లడించారు. ఆర్థిక కార్యకలాపాల్లో బలమైన వృద్ధి కారణంగా రెవెన్యూ వసూళ్లు పెరిగాయని, గత ఏడాది డిసెంబరుకు జీఎస్టీ వసూళ్లు రూ.1.65 లక్షల కోట్లు ఉన్నాయని వివరించారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో రూ.47.77 లక్షల కోట్ల మేరకు ఆదాయం లభిస్తుందని, ఇందులో కేవలం పన్ను రాబడులే రూ.26.99 లక్షల కోట్లు ఉంటాయని అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ.30 లక్షల కోట్లు ఉంటాయని తెలిపారు. ఫలితంగా, సంక్షేమ పథకాలకు వ్యయాన్ని కూడా పెంచామని వివరించారు. గత పదేళ్లలో తీసుకున్న నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో పురోగతి చెందిందని గణాంక వివరాలతో సహా వివరించారు. 2023-24కు సవరించిన ఆర్థిక లోటు జీడీపీలో 5.8 శాతానికి చేరుకుందని చెప్పిన నిర్మల.. ఇది ఆర్థిక పటిష్ఠత దిశలో మోదీ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు నిదర్శనమని తెలిపారు. వచ్చే ఏడాది కూడా ఆర్థిక లోటును తగ్గించి జీడీపీలో 5.1 శాతానికే పరిమితం చేస్తామని చెప్పారు. మార్కెట్‌ రుణాలు గత ఏడాది కంటే తక్కువగా ఉంటాయని, వీటిని మరింత తగ్గిస్తామని అంటూనే.. నికర మార్కెట్‌ రుణాలు రూ.11.75 లక్షల కోట్లు ఉండవచ్చునని తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి ఇది స్వర్ణయుగమని, 2005-14తో పోలిస్తే 2014-23లో రెట్టింపు ఎఫ్‌డీఐలు లభించాయని, ఈ ఐదేళ్లలోనే 596 బిలియన్‌ డాలర్ల (రూ.4,172 వేల కోట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దేశానికి వచ్చాయని వివరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడీపీ 7.3 శాతం ఉంటుందని అంచనా వేశారు. 2027 నాటికి భారత్‌ ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఐఎంఎఫ్‌ సహా పలు అంతర్జాతీయ సంస్థలు అంచనా వేశాయని చెప్పారు.

వడ్డీ చెల్లింపులు 11.90 లక్షల కోట్లు

రక్షణ బడ్జెట్‌ 6.1 లక్షల కోట్లు

సబ్సిడీలకు 3,80,925 కోట్లు

రవాణా, రోడ్లకు 2.78 లక్షల కోట్లు

రైల్వే బడ్జెట్‌ 2,55,393 కోట్లు

ఆహారం, ప్రజాపంపిణీ 2.13 లక్షల కోట్లు

గ్రామీణాభివృద్ధి 1.77 లక్షల కోట్లు

ఎరువులు, రసాయనాలు 1.68 లక్షల కోట్లు

వ్యవసాయశాఖ 1,27,469.88 కోట్లు

విద్యా రంగం 1,20,627 కోట్లు

ఆరోగ్యం, కుటుంబసంక్షేమం 90,658.63 కోట్లు

ఆధునిక రంగాల్లో పరిశోధనలు లక్ష కోట్ల నిధి

రాష్ట్రాలకు ఇచ్చేది 22,22,264 కోట్లు

మహిళ, శిశు అభివృద్ధి 26 వేల కోట్లు

నదుల అనుసంధానం 3,500 కోట్లు


రాష్ట్రాలకు ఇచ్చేది రూ.22,22,264 కోట్లు

పన్నుల వాటా కింద చెల్లించే నిధులు, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు ఇచ్చే సొమ్ము, పలు గ్రాంట్లు/లోన్లు తదితర అవసరాల కోసం రాష్ట్రాలకు కేంద్రం రూ.22,22,264 కోట్లు చెల్లించనుంది. ఇందులో రాష్ట్రాలకు పన్నుల వాటా కింద రూ.12,19,783 కోట్లు కోట్లు, ఆర్థిక కమిషన్‌ నిధుల రూపంలో రూ.1,32,378 కోట్లు, కేంద్ర ప్రభుత్వ పథకాలకు రూ.6,81,480 కోట్లు ఇవ్వనుంది.

వడ్డీ చెల్లింపులకు రూ.11,90,440 కోట్లు

వివిధ అవసరాల కోసం తెచ్చిన రుణాలకు చెల్లించే

వడ్డీల చెల్లింపుల కోసం సుమారు రూ.11,90,440 కోట్లు అవసరం అవుతుందని బడ్జెట్‌లో అంచనా వేశారు. 2023-24లో వడ్డీల చెల్లింపులకు 10,55,427 కోట్లు అవుతుందని అంచనా వేశారు. 2022-23లో

రూ.9,28,517 కోట్ల నిధులను వడ్డీలకు చెల్లించారు.

జీడీపీ రూ.3,27,71,808 కోట్లు

వచ్చే ఏడాదికిగాను జీడీపీ రూ.3,27,71,808 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

గత ఏడాదితో పోలిస్తే ఇది

10ు అధికం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ రూ.2,96,57,745 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

Updated Date - Feb 03 , 2024 | 02:56 PM

Advertising
Advertising