Ram Mandir: రామ్‌లల్లా మారిపోయాడు.. శిల్పి అరుణ్ యోగిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN, Publish Date - Jan 25 , 2024 | 07:09 PM
ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ తాజాగా అయోధ్యలోని రామమందిరంలో ప్రతిష్ఠించిన రామ్‌లల్లా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు. తాను రూపొందిస్తున్న సమయంలో రాముడి విగ్రహం ఒక రకంగానూ, ప్రతిష్ఠాపన తర్వాత మరో రకంగానూ కనిపించిందని పేర్కొన్నారు.
ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ తాజాగా అయోధ్యలోని రామమందిరంలో ప్రతిష్ఠించిన రామ్‌లల్లా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు. తాను రూపొందిస్తున్న సమయంలో రాముడి విగ్రహం ఒక రకంగానూ, ప్రతిష్ఠాపన తర్వాత మరో రకంగానూ కనిపించిందని పేర్కొన్నారు. ప్రాణప్రతిష్ఠ తర్వాత శ్రీరాముడు మరో రూపాన్ని సంతరించుకున్నాడని తెలిపారు. తాను ఏ రామ్‌లల్లాను అయితే ఏడు నెలల పాటు రూపొందించానో, ప్రతిష్ఠాపన తర్వాత అదే రామ్‌లల్లాను గుర్తించలేకపోయానని చెప్పారు. గర్భగుడిలోకి అడుగుపెట్టగానే రామ్‌లల్లాలో చాలా మార్పులు వచ్చాయని, ఆ విగ్రహంలోని ప్రకాశం మరోలా ఉందని చెప్పుకొచ్చారు.
‘‘రామమందిరంలోని గర్భగుడిలో ప్రతిష్ఠించిన తర్వాత రాముడు పూర్తిగా మారిపోయాడు. రాముడి విగ్రహాన్ని నిర్మిస్తున్నప్పుడు నాకు ఒక రకంగానూ, ప్రాణప్రతిష్ఠ తర్వాత మరో రకంగానూ కనిపించాడు. ఇది చూసి నేను సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాను. ఇది నా పని కాదని నేను భావించాను. ఇది ఆ ఈశ్వరుడి చమత్కారమో లేక మరే ఇతర కారణమో తెలీదు కానీ.. ఇది నిజంగా అద్భుతం’’ అని అరుణ్ యోగిరాజ్ పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా పూర్వీకుల తపస్సు ఫలితమే తాను ఈ పనికి ఎంపికయ్యానని, తన భావాలను తాను మాటల్లో వర్ణించలేనని అన్నారు. రామ్‌లల్లా విగ్రహాన్ని తయారు చేసేందుకు తనకు ఏడు నెలల సమయం పట్టిందన్నారు. ఆ ఏడు నెలల కాలం తనకు ఛాలెంజింగ్‌గా అనిపించిందని తెలిపారు.
ఇదే సమయంలో అరుణ్ యోగిరాజ్ ఒక ఆసక్తికరమైన కథని కూడా పంచుకున్నారు. తాను రామ్‌లల్లా విగ్రహాన్ని రూపొందించే సమయంలో కోతులు వచ్చేవని, అప్పుడు పనిని కొనసాగించడం కాస్త ఇబ్బందిగా ఉండేదని అన్నారు. ఆ కోతుల బెడద నుంచి తప్పించుకోవడం కోసం తాము ద్వారాలు ఫిక్స్ చేశామని.. అయినప్పటికీ ఆ కోతులు విడిచిపెట్టలేదని అన్నారు. అవి అక్కడికొచ్చి తలుపులు కొట్టేవని చెప్పారు. తాము తలుపులు తెరిచేదాకా అవి కొడుతూనే ఉండేవన్నారు. చివరికి తాము తలుపులు తీస్తే.. అవి విగ్రహాన్ని చూసి వెళ్లిపోయేవన్నారు. ఇక డిసెంబర్ 29వ తేదీన ప్రాణప్రతిష్ఠకు తమ విగ్రహాన్ని ఫైనల్ చేశారని.. దాంతో తాము తుది మెరుగులు దిద్ది, అనుకున్న సమయానికే పని పూర్తి చేశామని వెల్లడించారు.
Updated Date - Jan 25 , 2024 | 07:09 PM