Bihar: జేడీయూ లేకుండా ప్రభుత్వం ఏర్పాటుకు ఆర్జేడీ కసరత్తు... బలాబలాలు ఎలా ఉన్నాయంటే..
ABN, Publish Date - Jan 26 , 2024 | 04:47 PM
బీహార్ రాజకీయాల్లో తలెత్తిన అనిశ్చితికి మరి కొద్ది గంటల్లోనే తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార మహాకూటమితో నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూ తెగతెంపులు చేసుకుని బీజేపీ మద్దతుతో అధికారం కొనసాగించే ఆలోచనలో ఉందని జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుకు ఆర్జేడీ కసరత్తు మొదలుపెట్టింది.
పాట్నా: బీహార్ (Bihar) రాజకీయాల్లో తలెత్తిన అనిశ్చితికి మరి కొద్ది గంటల్లోనే తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార మహాకూటమితో నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూ తెగతెంపులు చేసుకుని బీజేపీ మద్దతుతో అధికారం కొనసాగించే ఆలోచనలో ఉందని జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ నితీష్ కుమార్ ముందస్తు షెడ్యూల్స్ రద్దు చేసుకుని పాట్నాలోనే ఉండిపోవడం, రాజ్‌భవన్ వద్ద 'ఎట్ హోం' రెసెప్షన్‌లో పాల్గొనడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. మరోవైపు, ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్న లాలూప్రసాద్ యాదవ్ సారథ్యంలోని ఆర్జేడీ (RJD)సైతం నితీష్ జేడీయూ లేకుండా ప్రభుత్వం ఏర్పాటుకు కసరత్తు మొదలుపెట్టినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ పార్టీల బలాబలాల్లోకి ఓసారి వెళ్తే...
బలాబలాలు...
ప్రభుత్వం ఏర్పాటుకు బీహార్ అసెంబ్లీలో 122 సీట్ల సంఖ్యా బలం ఉండాలి. ప్రస్తుతం అధికార కూటమిలో 160 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఆర్జేడీ 79 సీట్లతో లీడింగ్‌లో ఉంది. జేడీయూ- 45, కాంగ్రెస్-19, సీపీఐ-ఎంఎల్-12, సీపీఐ-02, సీపీఎం-02, ఒక ఇండిపెండెంట్ ఇందులో ఉన్నారు. విపక్షంలో బీజేపీతో కలిపి 78 సీట్లు ఉన్నాయి. జితన్ రామ్ మాంఝీ హిందుస్థానీ అవామీ మోర్చా (సెక్యులర్)కు 4 సీట్లు, ఏఐఎంఐఎంకు ఒక సీటు ఉంది. జేడీయూ లేకుండా ఆర్జేడీ అధికారంలోకి రావాలంటే 08 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. ఇందుకోసం జితిన్ రామ్ మాంఝీ, ఎంఐఎం, ఒక ఇండిపెండెంట్‌ను తమ వైపు తిప్పుకోవాలి. అప్పటికీ మెజారిటీకి అవసరమైన రెండు సీట్లు తగ్గుతాయి.
Updated Date - Jan 26 , 2024 | 05:32 PM