Parliament Sessions: నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు.. 19 బిల్లులకు ఆమోదం?
ABN, Publish Date - Jan 31 , 2024 | 05:30 AM
నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగనున్నాయి. ప్రస్తుత 17వ లోక్‌సభకు ఇవే చివరి సమావేశాలు కానుండగా నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాక తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాదిలోనే లోక్‌సభ ఎన్నికలు
కొత్త పార్లమెంటు భవనంలో తొలిసారి
ఫిబ్రవరి 9వ తేదీ వరకు సెషన్స్ నిర్వహణ
ప్రస్తుత లోక్‌సభకు ఇవే చివరి సమావేశాలు
లోక్‌సభలో రేపు మధ్యంతర బడ్జెట్
ప్రవేశపెట్టనున్న ఆర్థిక శాఖ మంత్రి నిర్మల
కిసాన్ సమ్మాన్ 50 శాతం పెంపునకు చాన్స్
ప్రతి సమస్యపై చర్చకు సిద్ధం: కేంద్ర ప్రభుత్వం
అఖిలపక్ష భేటీలో ఫ్లోర్ లీడర్లకు వెల్లడి
11 మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షనూ ఎత్తివేత
ఉమ్మడి కార్యాచరణ కొరవడిన ప్రతిపక్ష కూటమి
న్యూఢిల్లీ, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగనున్నాయి. ప్రస్తుత 17వ లోక్‌సభకు ఇవే చివరి సమావేశాలు కానుండగా నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాక తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాదిలోనే లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. బుధవారం ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. బుధవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. గురువారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ప్రస్తుత లోక్‌సభకు చివరి సమావేశాలు కావడంతో సుహృద్భావ వాతావరణంలో నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుత సమావేశాల్లో 19 బిల్లులు ఆమోదించే అవకాశం ఉంది. శీతాకాల సమావేశాల్లో లోక్‌సభ, రాజ్యసభల్లో కలిపి 146 ఎంపీలను సస్పెండ్ చేయగా వారిలో 132 మందిపై దీన్ని ఆ సెషన్ వరకే పరిమితం చేశారు. మిగతా 14 మందిలో 11 మంది రాజ్యసభ సభ్యులు, ముగ్గురు లోక్‌సభ సభ్యులున్నారు. ఈ 14 మంది సభ్యుల కేసును ఉభయసభల ప్రివిలేజ్ కమిటీలకు పంపారు. జనవరి 12న లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ ముగ్గురు లోక్‌సభ సభ్యులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసింది.
రాజ్యసభకు చెందిన ప్రివిలేజ్ కమిటీ మంగళవారం 11 మంది సభ్యులపై సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. మరోవైపు.. బడ్జెట్ సమావేశాల్లో ప్రతి సమస్యపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషి ఈ మేరకు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, గత సమావేశాల్లో మోదీ ప్రభుత్వాన్ని పార్లమెంటు భద్రత, మహువా మొయిత్రా లోక్‌సభ సభ్యత్వ రద్దు అంశంపై నిలదీసిన ప్రతిపక్ష కూటమి ఈసారి ఉమ్మడి కార్యాచరణను ఇప్పటివరకూ ప్రకటించలేదు. కాగా, కేంద్రం తాజా ప్రవేశపెట్టే బడ్జెట్‌లో పీఎం కిసాన్ మొత్తాన్ని 50ు పెంచి ఎకరాకు రూ.9 వేలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Updated Date - Jan 31 , 2024 | 07:06 AM