Jharkhand: వీడిన సస్పెన్స్.. సీఎంగా ప్రమాణం చేసిన చంపయి సోరెన్..
ABN, Publish Date - Feb 02 , 2024 | 01:05 PM
జార్ఖండ్(Jharkhand) ప్రభుత్వంలో ఏర్పడిన సందిగ్ధత ఎట్టకేలకు వీడింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జేఎంఎం సీనియర్ నేత, మంత్రి చంపయి సోరెన్(Champai Soren) శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.
రాంచీ: జార్ఖండ్(Jharkhand) ప్రభుత్వంలో ఏర్పడిన సందిగ్ధత ఎట్టకేలకు వీడింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జేఎంఎం సీనియర్ నేత, మంత్రి చంపయి సోరెన్(Champai Soren) శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని రాంచీలోని రాజ్ భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఆయనతోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే అలంగీర్ మంత్రిగా ప్రమాణం చేశారు.
హేమంత్ అరెస్ట్ నుంచి చంపయి ప్రమాణం వరకు..
జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడి రూ.600 కోట్ల భూకుంభకోణానికి పాల్పడి అక్రమంగా సంపాదించిన డబ్బును విదేశాలకు తరలించినట్లు ఈడీ ఆరోపించింది. ఈ క్రమంలో ఆయనపై కేసు నమోదు చేసింది. అరెస్టు తప్పదని తేలడంతో రాజ్ భవన్‌లో ఆయన రెండు రోజుల క్రితం రాజీనామా చేశారు. అక్కడే ఉన్న ఈడీ అధికారులు ఆయన్ని అరెస్టు చేశారు.
తొలుత హైకోర్టును ఆశ్రయించిన హేమంత్.. తరువాత పిటిషన్‌ని వెనక్కి తీసుకుని సుప్రీం తలుపు తట్టారు. ఆయన పిటిషన్‌పై విచారించిన కోర్టు.. తీర్పు వెలువరించింది. ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. దీంతో సోరెన్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టైంది. సోరెన్ అరెస్ట్ కాగానే జేఎంఎం, కాంగ్రెస్‌కు చెందిన 43 మంది ఎమ్మెల్యేలు తదుపరి సీఎంగా మంత్రి చంపయి సోరెన్‌కు మద్దతు తెలిపారు. శుక్రవారం గవర్నర్ సమక్షంలో సీఎం ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Feb 02 , 2024 | 01:32 PM