Rakesh Bedi: హాస్య నటుడ్ని బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాడు.. ఆర్మీ ఆఫీసర్‌నని నమ్మించి..
ABN, Publish Date - Jan 02 , 2024 | 09:05 PM
పరిస్థితులకు అనుగుణంగా సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఆయా సిచ్యుయేషన్‌కి తగ్గట్టు ఏర్పాట్లు చేసుకొని, ప్రజల్ని బురిడీ కొట్టించి, లక్షలు రూపాయలు దోచేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ హాస్యనటుడు...
Rakesh Bedi Cyber Case: పరిస్థితులకు అనుగుణంగా సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఆయా సిచ్యుయేషన్‌కి తగ్గట్టు ఏర్పాట్లు చేసుకొని, ప్రజల్ని బురిడీ కొట్టించి, లక్షలు రూపాయలు దోచేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ హాస్యనటుడు రాకేశ్ బేడీ కూడా సైబర్ ఉచ్చులో చిక్కుకుని, కొంత మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. తాను ఆర్మీ ఆఫీసర్‌నని నమ్మించి, ఆయన్ను మాటల్లో పడేసి.. సునాయాసంగా రూ.80 వేలు కాజేశాడు. దీంతో.. ఆయన పోలీసులను సంప్రదించాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
రాకేశ్ బేడీకి పుణేలో ఒక ఇల్లు ఉంది. దాన్ని ఆయన అమ్మాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే.. ఓ హౌసింగ్ పోర్టల్‌లో ఆ ఇంటికి సంబంధించిన వివరాల్ని పొందుపరిచారు. మరుసటి రోజు ఆయనకు ఓ సైబర్ నేరగాడి నుంచి ఫోన్ వచ్చింది. తనని తాను ఆర్మీ ఆఫీసర్‌గా ఆ కమెడియన్‌తో పరిచయం చేసుకున్నాడు. గతంలో కూడా ఒక ఆర్మీ అధికారికి ఒక ఇల్లుని బేటీ అమ్మారు కాబట్టి, తనకు నిజమైన అధికారి నుంచే ఫోన్ వచ్చి ఉంటుందని ఆయన నమ్మారు. పైగా.. అతడు ఆర్మీ అధికారిలాగా మాట్లాడటంతో, ఆయన అతని మాటల మాయలో పడిపోయారు. తన ఇంటిని అతనికి అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇంకేముంది.. తాను వేసిన గాలంలో చేప చిక్కుకుందని భావించి, ఆ కేటుగాడు తన ‘సైబర్ క్రైమ్’ ప్లాన్‌ని అమలు చేయడం మొదలుపెట్టాడు.
తొలుత తాను రూ.1 లక్ష బదిలీ చేస్తానని చెప్పి.. రాకేశ్ బేడీ బ్యాంక్ ఖాతా వివరాలు తీసుకున్నాడు. అయితే.. బదిలీ ప్రక్రియలో కొన్ని సమస్యలు వచ్చాయని చెప్పి, బేడీ సతీమణి బ్యాంక్ వివరాలు అడిగాడు. అందుకు సరేనని తన భార్య బ్యాంక్ ఖాతా వివరాల్ని పంపించారు. ఒకే సమయంలో ఎక్కువ మొత్తం డబ్బుని బదిలీ చేస్తే.. బ్యాంక్ నుంచి ఒక సందేశం వస్తుందని, దాన్ని అంగీకరిస్తేనే డబ్బు జమ అవుతుందని అతడు నమ్మించాడు. అతడు చెప్పినట్టే రాకేశ్ చేయగా.. డబ్బు జమ అవ్వడం కాదు కదా, ఖాతాలో ఉన్న రూ.50 వేలు మాయం అయ్యాయి. ఇదేంటని తిరిగి ఫోన్ చేసి ప్రశ్నిస్తే.. ఏదో పొరపాటు జరిగిందని, మరో రూ.30 వేలు ఖాతాలో డిపాజిట్ కోరాడు. అతడు చెప్పినట్టు రూ.30 వేలు జమ చేయగా.. ఆ డబ్బు కూడా పోయింది.
ఆ తర్వాత రాకేశ్ బేడీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా.. అటువైపు వ్యక్తి నుంచి స్పందన రాలేదు. చివరికి కాసేపయ్యాక ఆ నంబర్ స్విచ్చాఫ్ అయ్యింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆయన.. వెంటనే పోలీసులకు సంప్రదించారు. ఆర్మీ ఆఫీసర్‌నని నమ్మించి.. తన వద్ద నుంచి ఓ సైబర్ కేటుగాడు రూ.80 వేలు కాజేశాడని ఫిర్యాదు చేశారు. దీంతో.. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. మరోవైపు.. ఇలాంటి మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా ఫోన్ చేసి మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తే తెలివిగా వ్యవహరించాలని సూచించారు. తనకు పెద్ద నష్టమైతే జరగలేదని, కానీ ఇలాంటి వ్యక్తుల పట్ల యాక్షన్ తీసుకోవాలని కాబట్టి తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని రాకేశ్ బేడీ చెప్పుకొచ్చారు.
Updated Date - Jan 02 , 2024 | 09:05 PM