శ్రీదేవి మృతిపై యూట్యూబ్‌లో తప్పుడు చర్చ
ABN, Publish Date - Feb 05 , 2024 | 06:36 AM
ప్రముఖ నటి శ్రీదేవి మరణంపై దర్యాప్తు చేశానంటూ చెప్పుకొన్న ఓ మహిళపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. తన దర్యాప్తునకు ఆధారాలంటూ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి
మహిళపై సీబీఐ చార్జిషీట్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ప్రముఖ నటి శ్రీదేవి మరణంపై దర్యాప్తు చేశానంటూ చెప్పుకొన్న ఓ మహిళపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. తన దర్యాప్తునకు ఆధారాలంటూ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల పేరున ఫోర్జరీ పత్రాలు సృష్టించినట్టు ఆరోపించింది. ఇన్వెస్టిగేటర్‌నంటూ తనకు తాను చెప్పుకొన్న భువన్వేర్‌కు చెందిన మహిళ దీప్తి రాణి పిన్నిటి, ఆమెకు సహకరించిన న్యాయవాది భరత్ సురేష్ కామత్‌పై చార్జిషీట్ దాఖలు చేసినట్టు ఆదివారం సీబీఐవర్గాలు తెలిపాయి. దీనిపై తొలుత ముంబైకి చెందిన న్యాయవాది చాందినీ షా ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. పీఎంవో నుంచి వచ్చిన లేఖ ఆధారంగా సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. బాలీవుడ్ నటులు శ్రీదేవి, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ల మరణంపై సామాజిక మాధ్యమాల్లో జరిగిన చర్చల్లో దీప్తి చురుగ్గా పాల్గొన్నారు. 2018 ఫిబ్రవరిలో శ్రీదేవి దుబాయ్‌లో మరణించగా దీనిపై యూట్యూబ్‌లో జరిగిన చర్చలో ఆమె భాగస్వాములయ్యారు. శ్రీదేవి మరణాన్ని యునైటెడ్ ఎమిరేట్స్, భారత్ ప్రభుత్వాలు కలిసి కప్పిపుచ్చుతున్నాయని, ఇది తన ‘దర్యాప్తు’లో తేలిందని చెప్పారు. ఇందుకు ఆధారంగా మోదీ, అమిత్ షా పేరుతో ఉన్న నకిలీ లేఖలను చూపారు.
Updated Date - Feb 05 , 2024 | 06:36 AM