India vs England: భారత్, ఇంగ్లండ్ నాలుగో టెస్టుకు పన్నూన్ బెదిరింపులు.. రోహిత్ శర్మ పేరు ప్రస్తావిస్తూ..
ABN, Publish Date - Feb 21 , 2024 | 05:22 PM
ఖలిస్తానీ ఉగ్రవాది, నిషేధిత సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ (Sikhs For Justice) అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్ (Gurpatwant Singh Pannun) మరోసారి రెచ్చిపోయాడు. రాంచీలో ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నాలుగో టెస్టు మ్యాచ్‌కు (India vs England) అతని నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ మ్యాచ్‌ని అడ్డుకోవాలని.. అలాగే జార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించాలని అతను సీపీఐ దళాన్ని కోరాడు.
ఖలిస్తానీ ఉగ్రవాది, నిషేధిత సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ (Sikhs For Justice) అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్ (Gurpatwant Singh Pannun) మరోసారి రెచ్చిపోయాడు. రాంచీలో ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నాలుగో టెస్టు మ్యాచ్‌కు (India vs England) అతని నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ మ్యాచ్‌ని అడ్డుకోవాలని.. అలాగే జార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించాలని అతను సీపీఐ దళాన్ని కోరాడు. ఇంగ్లండ్ క్రికెట్ జట్టుని కూడా వెనక్కి తిరిగి వెళ్లిపోవాలని హెచ్చరించాడు. ఈ మేరకు యూట్యూబ్‌లో పన్నూన్ ఒక వీడియో అప్‌లోడ్ చేశాడు. ఇందులో అతడు రోహిత్ శర్మ (Rohit Sharma) పేరుని కూడా ప్రస్తావించాడు. దీంతో రాంచీ పోలీసులు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసుని సీనియర్ పోలీసు అధికారి, రాంచీ డీసీ రాహుల్ సిన్హా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
పన్నూన్ వీడియోలో ఏముంది?
ఈ వీడియోలో పన్నూన్ సీపీఐ (CPI) మావోయిస్టులను రెచ్చగొడుతూ.. గిరిజనుల భూముల్లో క్రికెట్ ఆడకూడదని పేర్కొన్నాడు. రాంచీ టెస్టు మ్యాచ్‌ని అడ్డుకొని.. ఆ రెండు దేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక క్రీడా సంబంధాలను చెడగొట్టాలని చెప్పాడు. జార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో అలజడులు సృష్టించాలని.. ఫలితంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) మ్యాచ్ ఆడలేరని తెలిపాడు. ఈ నేపథ్యంలోనే జార్ఖండ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. మ్యాచ్ జరగనున్న జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌లో మరింత భద్రతను పెంచారు. మరోవైపు.. పన్నూన్‌పై దుర్వా పోలీస్ స్టేషన్‌లో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇలాంటి వివాదాస్పద వీడియోల వల్ల ప్రభుత్వానికి భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతుందని, అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం కూడా జరిగిందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
ఇదిలావుండగా.. పన్నూన్ ఇలాంటి బెదిరింపులకు పాల్పడటం ఇదే మొదటిసారి కాదు. వరల్డ్ కప్ 2023 ఫైనల్, ఎయిర్ ఇండియా విమానాలు, అమెరికా & కెనడా దేశాల్లోని భారతీయుల్ని లక్ష్యంగా చేసుకుంటామంటూ గతంలో బెదిరించాడు. పంజాబ్ వాసి అయిన పన్నూన్.. ప్రస్తుతం అమెరికాలో ఉంటూ ఇటువంటి బెదిరింపు వీడియోల్ని రిలీజ్ చేస్తున్నాడు. మరోవైపు.. 2007లో సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థను స్థాపించగా, భారత్ దాన్ని 2019లో నిషేధించింది. 2020లో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని పన్నూన్‌ని భారత్ ఉగ్రవాదిగా ప్రకటించింది. 2021లో అతనిపై నాన్-బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయ్యింది.
Updated Date - Feb 21 , 2024 | 05:22 PM