Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సూపర్ యాప్ వచ్చేస్తోంది
ABN, Publish Date - Jan 03 , 2024 | 03:54 PM
రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ‘భారతీయ రైల్వే’ తనవంతు కృషి చేస్తూ వస్తోంది. సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు ఇప్పటికే అధునాతన సౌకర్యాలు కలిగిన ట్రైన్లను రంగంలోకి దింపింది. ఇప్పుడు తాజాగా...
Indian Railways Super App: రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ‘భారతీయ రైల్వే’ తనవంతు కృషి చేస్తూ వస్తోంది. సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు ఇప్పటికే అధునాతన సౌకర్యాలు కలిగిన ట్రైన్లను రంగంలోకి దింపింది. ఇప్పుడు తాజాగా ‘సూపర్ యాప్’ను అభివృద్ధి చేస్తోంది. సాధారణంగా.. రైలు టికెట్ బుక్ చేసుకోవాలన్నా, ఎటువంటి ఫిర్యాదులు చేయాలన్నా, ట్రైన్ రన్నింగ్‌తో పాటు పీఎన్ఆర్ స్టేటస్ తెలుసుకోవాలన్నా.. రకరకాల యాప్స్‌ని వాడాల్సి వస్తోంది. ఈ సేవలన్నీ ఒకే యాప్‌లో అందుబాటులో లేవు. ఇప్పుడు ఇతర యాప్స్ తంటాలు లేకుండా, ఆ సేవలన్నింటినీ ఒకే వేదికపైకి తెచ్చేందుకు ఇండియన్ రైల్వే సిద్ధమవుతోంది. అదే ‘సూపర్ యాప్’.
రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (CRIS) ఈ కొత్త యాప్‌ని డెవలప్ చేస్తోంది. ఈ యాప్ కోసం రైల్వే శాఖ అక్షరాల రూ.90 కోట్లు వెచ్చించనుందని ‘ఎకనమిక్ టైమ్స్’ పేర్కొంది. భారతీయ రైల్వేకు సంబంధించిన అన్ని రకాల సేవలను ఒకే చోట అందించడమే ఈ యాప్ ఉద్దేశం. ఈ యాప్ అందుబాటులోకి వచ్చాక, యూజర్లకు ఇక ఇతర యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. యూజర్ల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ కొత్త యాప్‌ని తీర్చిదిద్దుతున్నట్టు రైల్వే శాఖ పేర్కొంది. అయితే.. ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. రూ.90 కోట్ల బడ్జెట్‌తో మొత్తం మూడేళ్లలో దీనిని డెవలప్ చేయాలన్న ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిసింది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న రైల్వే యాప్స్‌లో ‘ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్’ అత్యంత ప్రజాదరణ పొందింది. ఇది 100 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్స్‌ని కలిగి ఉంది. దీంతో పాటు యూటీఎస్, రైల్ మదద్ యాప్స్ కూడా మంచి సేవలు అందిస్తున్నాయి. 10 మిలియన్ డౌన్‌లోడ్స్ కలిగిన యూటీఎస్.. ప్లాట్‌ఫారమ్ టిక్కెట్స్, సీజన్ పాస్‌లను అందించడంపై దృష్టి సారించింది. ఇప్పుడు కొత్తగా అభివృద్ధి చేస్తున్న సూపర్ యాప్‌లో.. ఐఆర్‌సీటీసీ అందించే విమాన టికెట్ బుకింగ్, ఫుడ్ డెలివరీ వంటి సేవలూ కూడా లభించనున్నట్టు తెలుస్తోంది. ఈ సూపర్ యాప్‌ని వీలైనంత త్వరగా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Updated Date - Jan 03 , 2024 | 03:54 PM