IndiGo Flight: ఇండిగో కెప్టెన్‌పై ప్యాసింజర్ దాడి.. వీడియో వైరల్.. అసలేమైందంటే?
ABN, Publish Date - Jan 15 , 2024 | 01:26 PM
IndiGo Flight: ఢిల్లీ-గోవా ఇండిగో 6E2175 విమానం ఆదివారం కొన్ని గంటలపాటు ఎయిర్‌పోర్టులోనే నిలిచిపోయింది. ప్రయాణికులందరూ ఎక్కిన తర్వాత.. ఆ విమానాన్ని దాదాపు 10 గంటలపాటు విమానాశ్రయంలో ఆపి ఉంచారు. ఉత్తర భారతదేశంలో దట్టమైన పొగమంచు ఉండటంతో, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆ విమానం టేకాఫ్ అవ్వలేదు.
ఏదైనా ఒక విమానం ఆలస్యం అయ్యిందంటే, దాని వెనుక ఏదో ఒక కారణం తప్పకుండా ఉంటుంది. సాంకేతిక లోపం తలెత్తడమో, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడమో, ఇంకా ఇతరత్ర కారణాలు ఉండొచ్చు. అంతేతప్ప.. ఏ విమానయాన సంస్థ కూడా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయవు. కానీ.. ఈ పరిస్థితిని కొందరు ప్రయాణికులు అర్థం చేసుకోరు. కారణాలు చెప్పినా సరే.. అర్థం చేసుకోకుండా ఆగ్రహావేశాలకు గురవుతుంటారు. కొందరైతే విమాన సిబ్బందిపై చెయ్యి లేపడానికి కూడా వెనుకాడరు. ఇప్పుడు ఓ ప్రయాణికుడు కూడా అదే పని చేశాడు. ఫ్లైట్ ఆలస్యం అవ్వడంతో కోపాద్రిక్తుడైన అతగాడు.. పైలట్‌పై దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఆ వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ-గోవా ఇండిగో 6E2175 విమానం ఆదివారం కొన్ని గంటలపాటు ఎయిర్‌పోర్టులోనే నిలిచిపోయింది. ప్రయాణికులందరూ ఎక్కిన తర్వాత.. ఆ విమానాన్ని దాదాపు 10 గంటలపాటు విమానాశ్రయంలో ఆపి ఉంచారు. ఉత్తర భారతదేశంలో దట్టమైన పొగమంచు ఉండటంతో, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆ విమానం టేకాఫ్ అవ్వలేదు. పరిస్థితులు అనుకూలంగా మారినప్పుడు బయలుదేరాలని అనుకున్నారు. అయితే.. చూస్తుండగానే 10 గంటల సమయం గడిచిపోయింది. ఈ క్రమంలో ఫ్లైట్ కో-కెప్టెన్ అనూప్ కుమార్ ఈ ఆలస్యానికి గల కారణాలేంటో ప్రయాణికులకు తెలిపేందుకు వచ్చాడు. ఆయన మాట్లాడుతుండగానే.. పసుపు రంగు టీషర్ట్ ధరించిన సాహిల్ కతారియా అనే ప్రయాణికుడు దూసుకొచ్చి ఆయనపై దాడి చేశాడు.
ఇంతలో ఎయిర్-హోస్టెస్ కలగజేసుకొని, ‘మీరిలా చేయకూడదు’ అని వాదిస్తూ సాహిల్‌ని అడ్డుకుంది. అంతటితో ఆగని సాహిల్.. ‘నేనెందుకిలా చేయకూడదు?’ అంటూ ఆమెపై అరిచాడు. అనంతరం కెప్టెన్‌కి వేలు చూపిస్తూ.. ‘వీలైతే విమానం నడుపు, లేకపోతే గేట్ ఓపెన్ చెయ్’ అని హెచ్చరించాడు. ఇంతలో మరో ప్రయాణికుడు అందుకొని, కొన్ని గంటల నుంచి తాము ఇక్కడే చిక్కుకుపోయామని అన్నారు. ఈ మొత్తం తతంగాన్ని ఫ్లైట్‌లోనే ఉన్న ఓ ప్యాసింజర్ రికార్డ్ చేసి.. నెట్టింట్లో పోస్టు చేశారు. దీంతో.. ఈ వీడియో వైరల్ అయ్యింది. మరోవైపు.. సాహిల్ కతారియాపై తగిన చర్యలు తీసుకున్నారు. అతడ్ని అదుపులోకి తీసుకొని, భారతీయ శిక్షాస్మృతిలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Updated Date - Jan 15 , 2024 | 01:26 PM