Bihar Politics: నితీశ్.. గాలిలాగా భావాన్ని మార్చే సోషలిస్ట్ .. లాలూ కుమార్తె సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Jan 25 , 2024 | 02:39 PM
బిహార్‌లో ఆర్జేడీ - జేడీయూ(RJD - JDU) శిబిరంలో లుకలుకలు బయటపడుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య చేసిన ట్వీట్లు కలకలం రేపుతున్నాయి. స్వాతంత్ర్య సమర యోధుడు, మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు కేంద్రం భారత రత్న ప్రకటించడాన్ని ప్రశంసిస్తూ సీఎం నితీశ్ కుమార్ కామెంట్స్ చేశారు.
పట్నా: బిహార్‌లో ఆర్జేడీ - జేడీయూ(RJD - JDU) శిబిరంలో లుకలుకలు బయటపడుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య చేసిన ట్వీట్లు కలకలం రేపుతున్నాయి. స్వాతంత్ర్య సమర యోధుడు, మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు కేంద్రం భారత రత్న ప్రకటించడాన్ని ప్రశంసిస్తూ సీఎం నితీశ్ కుమార్ కామెంట్స్ చేశారు.
కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ రాజవంశ రాజకీయాలపై విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై రోహిణి తీవ్రంగా స్పందించారు. ఆమె ఎక్స్‌లో నితీశ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. "నితీశ్ గాలిలాగా ఎప్పటికప్పుడు తన భావజాలాన్ని మార్చే సోషలిస్ట్" అని వ్యంగ్యంగా స్పందించారు. దీంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
నితీశ్ యూటర్న్?
అత్యంత వెనకబడిన వర్గాల కోసం జీవితాంతం కృషి చేసిన కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న ఇవ్వాలని తమ పార్టీ ఎంతోకాలంగా కేంద్రప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసిందని, గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలను కూడా డిమాండ్ చేశామని నితీశ్ బుధవారం చెప్పారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వానికి కూడా పలుమార్లు విజ్ఞప్తి చేస్తే, ఇప్పటికి పురస్కారం ఇచ్చారని తెలిపారు. తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ డిమాండ్‌ను పట్టించుకోలేదని పరోక్షంగా పేర్కొన్నారు. కర్పూరీ ఠాకూర్ శతజయంతి నేపథ్యంలో, బుధవారం జేడీయూ నిర్వహించిన సమావేశంలో నితీశ్ ప్రసంగించారు. కర్పూరీ ఠాకూర్ పదవిని అడ్డం పెట్టుకొని కుటుంబానికి ఏనాడూ లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేయలేదని.. దాని నుంచి తాను స్ఫూర్తి పొందానని, తన కుటుంబంలో ఎవరినీ ముందుకు తీసుకురాలేదని, ఈ విషయం అందరికీ తెలుసునని నితీశ్ పేర్కొన్నారు.
ఆర్జేడీని ఉద్దేశించే నితీశ్ కుటుంబ రాజకీయాల గురించి ఈ వ్యాఖ్య చేశారని ఊహాగానాలు వెలువడ్డాయి. ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఆర్జేడీ కీలక భాగస్వాములన్న విషయం తెలిసిందే. నితీశ్ చేసిన వ్యాఖ్యలతో మరోసారి రాజకీయ చర్చలు మొదలయ్యాయి. ఆయన ఇండియా కూటమిని వదిలి తిరిగి ఎన్‌డీఏ గూటికి చేరుతారా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఇండియా కూటమి చెయిర్ పర్సన్‌గా ఖర్గే ఎంపికైన సందర్భంలో కూడా నితీశ్ అసంతృప్తిపై వార్తలు వెలువడ్డాయి.
Updated Date - Jan 25 , 2024 | 02:39 PM