Delhi: అంతరిక్షంలో భారత్ తొలి స్పేస్ స్టేషన్.. ఎలా ఉంటుందో చూడండి
ABN, Publish Date - Mar 04 , 2024 | 10:51 AM
అంతరిక్షంలో భారత్ తొలి స్పేస్ స్టేషన్‌ను రానున్న కొన్నేళ్లలో అందుబాటులోకి రానుందని ఇస్రో(ISRO) చీఫ్ ఎస్ సోమనాథ్ చెప్పారు. రాబోయే రోజుల్లో స్టేషన్‌లోని మొదటి మాడ్యూల్స్‌ను ప్రయోగించే అవకాశం ఉందని ఆయన అన్నారు.
ఢిల్లీ: అంతరిక్షంలో భారత్ తొలి స్పేస్ స్టేషన్‌ను రానున్న కొన్నేళ్లలో అందుబాటులోకి రానుందని ఇస్రో(ISRO) చీఫ్ ఎస్ సోమనాథ్ చెప్పారు. రాబోయే రోజుల్లో స్టేషన్‌లోని మొదటి మాడ్యూల్స్‌ను ప్రయోగించే అవకాశం ఉందని ఆయన అన్నారు. స్పేస్ స్టేషన్ సంబంధించి ఊహాచిత్రాన్ని విడుదల చేశారు.
"ప్రధాని మోదీ.. 2035నాటికి భారత్‌కు చెందిన తొలి స్పేస్ స్టేషన్ అందుబాటులోకి రావాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ స్పేస్ స్టేషన్ అంతరిక్షంలో 2 - 4 వ్యోమగాములకు వసతి కల్పిస్తుంది. ఇప్పటివరకు రష్యా, అమెరికా, చైనాలు మాత్రమే అంతరిక్ష కేంద్రాలను కక్షలోకి పంపాయి. స్పేస్‌లో స్వతంత్ర అంతరిక్ష కేంద్రాన్ని కలిగి ఉన్న నాలుగో దేశంగా భారత్ అవతరించే అవకాశం ఉంది" అని సోమనాథ్ అన్నారు.
విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్ డాక్టర్ ఉన్నికృష్ణన్ నాయర్ మాట్లాడుతూ.. స్పేస్ స్టేషన్ నిర్మాణానికి పనులు వేగంగా జరుగుతున్నాయి. భూమికి 400 కి.మీ.ల దూరంలోని కక్ష్యలో దీన్ని నిలిపేందుకు బరువైన రాకెట్, బాహుబలి లాంచ్ వెహికిల్‌ని ఉపయోగించాలని ప్రణాళిక రూపొందించాం. ఆస్ట్రోబయోలజీ సహా అంతరిక్షంలో మైక్రోగ్రావిటీ ప్రయోగాలు చేయాలని, చంద్రుని ఉపరితలంపై నివసించే మార్గాలను అన్వేషించాలని భారత్ భావిస్తోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం.. అంతరిక్ష కేంద్రం దాదాపు 20 టన్నుల బరువు ఉంటుంది.
దీన్ని ఘన పదార్థాలతో తయారు చేస్తారు. వాటికి గాలితో కూడిన మాడ్యూల్స్‌ని జోడిస్తారు. నిర్మాణం పూర్తయ్యేసరికి దాని బరువు 400 టన్నుల వరకు పెరిగే అవకాశం ఉంది. స్పేస్ విజన్ 2047లో భాగంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతోపాటు 2040 నాటికి తొలి భారతీయుడిని చంద్రుడిపైకి పంపడం వంటివాటిని లక్ష్యంగా పెట్టుకోవాలని ప్రధాని మోదీ శాస్త్రవేత్తలకు సూచించారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 04 , 2024 | 10:53 AM