Business: ప్రాణప్రతిష్ఠ రోజున రికార్డ్ స్థాయిలో అమ్మకాలు.. ఒక లక్ష కోటికిపైగా వ్యాపారం
ABN, Publish Date - Jan 23 , 2024 | 08:10 PM
అయోధ్యలోని రామమందిరంలో రామ్‌లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగిన రోజున దేశంలో రికార్డ్ స్థాయిలో వ్యాపారం జరిగింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAT) ప్రకారం.. రామమందిర ప్రారంభోత్సవం కారణంగా దేశంలో సుమారు రూ.1.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందని తేలింది.
అయోధ్యలోని రామమందిరంలో రామ్‌లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగిన రోజున దేశంలో రికార్డ్ స్థాయిలో వ్యాపారం జరిగింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAT) ప్రకారం.. రామమందిర ప్రారంభోత్సవం కారణంగా దేశంలో సుమారు రూ.1.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందని తేలింది. ఇందులో.. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే రూ.40 వేల కోట్లు, ఢిల్లీలో రూ.25 కోట్ల మేర వ్యాపారం జరిగినట్టు ఆ సంస్థ పేర్కొంది. భక్తి కారణంగా ఈ రేంజ్‌లో బిజినెస్ జరగడం.. దేశంలోనే తొలిసారి అని క్యాట్ జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ ఖండేల్వాల్ చెప్పారు. చిరు వ్యాపారుల ద్వారా ఇంత బిజినెస్ జరగడం విశేషమని.. ఈ డబ్బంతా వ్యాపారంలో ఆర్థిక ద్రవ్యతను పెంచుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
CAT ప్రకారం.. అయోధ్యలోని రామమందిరం కారణంగా దేశంలో ఎన్నో కొత్త వ్యాపార అవకాశాలు పుట్టుకొచ్చాయి. ఫలితంగా.. ప్రజలకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాపారవేత్తలు, స్టార్టప్ కంపెనీలకు తమ వ్యాపారాలను విస్తరించుకోవడం కోసం కొత్త ప్రణాళికలు రచించే సమయం ఆసన్నమైంది. ఈ అంశంపై.. క్యాట్ త్వరలోనే న్యూఢిల్లీలో సెమినార్ నిర్వహించనుంది. క్యాట్‌కు చెందిన ‘హర్ షహర్ అయోధ్య - హర్ ఘర్ అయోధ్య’ జాతీయ ప్రచారం కింద.. జనవరి 1 నుండి జనవరి 22 వరకు 30 వేలకు పైగా చిన్న, పెద్ద వ్యాపార సంస్థలు దేశవ్యాప్తంగా 1.5 లక్షలకు పైగా కార్యక్రమాలను నిర్వహించాయి. ఇందులో ఒక్క జనవరి 22వ తేదీన లక్షకు పైగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆరోజు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉండటంతో.. కనివినీ ఎరుగని స్థాయిలో వ్యాపారం జరిగింది.
ఈ వ్యాపారంలో ఎక్కువగా అమ్ముడుపోయిన వస్తువుల్లో.. రామమందిర నమూనాలు, పూలమాలలు, లాకెట్లు, కంకణాలు, బిందెలు, రాముడి జెండాలు, రాముని టోపీలు, రాముని పెయింటింగ్స్‌తో, రామ్ దర్బార్ ఫోటోలు మొదలైనవి ఉన్నాయని ఖండేల్వాల్ చెప్పారు. పండిట్లు, బ్రాహ్మణులు కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆదాయం పొందారన్నారు. ప్రసాదం రూపంలో కోట్ల కిలోల మిఠాయిలు, డ్రైఫ్రూట్స్ విక్రయించారన్నారు. భక్తి అనే సాగరంలో మునిగితేలిన వ్యక్తులు ఇదంతా చేశారని, గతంలో మునుపెన్నడూ ఇలా జరగలేదని అన్నారు. కోట్లాది రూపాయల విలువైన క్రాకర్లు, మట్టి దీపాలు, ఇత్తడితో చేసిన దీపాలు, ఇతర వస్తువులు కూడా దేశవ్యాప్తంగా విరివిగా అమ్ముడయ్యాయన్నారు. రాబోయే రోజుల్లో రామమందిర విగ్రహాలను కానుకలుగా ఇచ్చే అవకాశం ఉందని, ఆల్రెడీ పెళ్లిళ్లలో ఇది ప్రారంభమైందని తెలిపారు.
Updated Date - Jan 23 , 2024 | 08:10 PM