Modi Mission 2024: దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెంచిన మోదీ.. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో బిజిబిజీ
ABN, Publish Date - Jan 03 , 2024 | 10:51 AM
లోక్ సభ ఎన్నికలు త్వరలో జరగనున్న వేళ ప్రధాని మోదీ(PM Modi) దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెంచారు. ఇందులో భాగంగా ఆయన రెండు రోజుల పర్యటన నిమిత్తం తమిళనాడు, లక్షద్వీప్, కేరళలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
చెన్నై: లోక్ సభ ఎన్నికలు త్వరలో జరగనున్న వేళ ప్రధాని మోదీ(PM Modi) దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెంచారు. ఇందులో భాగంగా ఆయన రెండు రోజుల పర్యటన నిమిత్తం తమిళనాడు, లక్షద్వీప్, కేరళలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. నూతన సంవత్సరం తొలినాళ్లలో మోదీ దక్షిణాది పర్యటన బీజేపీ మిషన్ సౌత్ 2024 టార్గెట్ ని సూచిస్తోందని నిపుణులు అంటున్నారు.
మంగళవారం తమిళనాడులో పర్యటించిన ఆయన కొత్త పార్లమెంటులో సెంగోల్ ఏర్పాటును గుర్తు చేశారు. తమిళనాడు సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందనేలా ఆయన పర్యటన సాగింది. ఆ రాష్ట్రంలో మొత్తంగా 16 భారీ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు చేశారు.
"2014కి ముందు 10 సంవత్సరాలపాటు అప్పటి యూపీఏ సర్కార్ రాష్ట్రాలకు రూ.30 లక్షల కోట్లు ఇచ్చింది. కానీ ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక 2014-24 మధ్య కాలంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు రూ.120 లక్షల కోట్లు వెచ్చించిది. తమిళనాడుకు 2.5 రెట్లు ఎక్కువ నిధులు సమకూర్చాం" అని ప్రధాని అన్నారు. దక్షిణాదిలోని 131 లోక్‌సభ స్థానాల్లో 84 స్థానాల్లో బీజేపీ ఎప్పుడూ గెలవలేదు. బీజేపీ కంచుకోటగా ఉన్న కర్ణాటక ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో చేజారిపోయింది.
2019 లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలోని 27 సీట్లలో బీజేపీ 25 స్థానాలు గెలుచుకుంది. కేరళలో ఒక సీటు సాధించింది. దక్షిణాదిలో ఈ సారి ఎలాగైనా బోణీ కొట్టాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నట్లు నిపుణులు అంటున్నారు. ఒక్క తమిళనాడులోనే రూ.20 వేల కోట్ల విలువైన 16 ప్రాజెక్టులు ప్రారంభించారు. ఇవాళ లక్షద్వీప్ లో పర్యటించిన అనంతరం గురువారం మధ్యాహ్నం కేరళలోని త్రిసూర్ లో మోదీ పర్యటన సాగనుంది.
"మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"
Updated Date - Jan 03 , 2024 | 10:52 AM