Bengaluru CEO Case: కొడుకుని చంపిన సీఈవో కేసులో మరిన్ని ఝలక్‌లు.. భర్తకు మెసేజ్ చేసి మరీ..
ABN, Publish Date - Jan 11 , 2024 | 03:44 PM
గోవాలో తన నాలుగేళ్ల కుమారుడిని చంపిన ‘మైండ్‌ఫుల్ ఏఐ’ కంపెనీ సీఈవో సుచనా సేఠ్ కేసులో తాజాగా మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సుచనాని పట్టుకోవడంలో తమకు...
Bengaluru CEO Suchana Seth Case: గోవాలో తన నాలుగేళ్ల కుమారుడిని చంపిన ‘మైండ్‌ఫుల్ ఏఐ’ కంపెనీ సీఈవో సుచనా సేఠ్ కేసులో తాజాగా మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సుచనాని పట్టుకోవడంలో తమకు ట్రాఫిక్ జామ్ కలిసొచ్చిందని, లేకపోతే ఆమెని అరెస్ట్ చేయడం చాలా కష్టమయ్యేదని పోలీసు వర్గాలు తెలిపాయి. గోవా సరిహద్దుల్లో సుమారు నాలుగు గంటల పాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడటం వల్ల.. ఆమెని పట్టుకోవడంతో పాటు కుమారుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకోగలిగామని పోలీసులు చెప్పారు.
కుమారుడి మృతదేహంతో ఆమె పారిపోతున్నప్పుడు.. గోవా సరిహద్దుల్లోని క్లోరా ఘాట్ వద్ద ఒక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందని, దాంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని పోలీసు అధికారులు వెల్లడించారు. ఫలితంగా.. సుచనా అక్కడే నాలుగు గంటల పాటు చిక్కుకుపోయారని, ఆమెను వేగంగా చేరుకోవడానికి అది తమకు ఉపయోగపడిందని అన్నారు. ఒకవేళ ఆ ట్రాఫిక్ జామ్ ఏర్పడకపోయి ఉంటే.. ఆమెని పట్టుకోవడం, చిన్నారి మృతదేహాన్ని కనిపెట్టడం కష్టమయ్యేదని అధికారులు పేర్కొన్నారు. ఇదే సమయంలో.. ఆమెను పోలీసులకు పట్టించడంలో క్యాబ్ డ్రైవర్ కూడా ఎంతో చాకచక్యంగా వ్యవహరించాడని, ఆమెకు ఏమాత్రం అనుమానం రాకుండా నేరుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడని తెలిపారు.
ఈ ఘటనపై క్యాబ్ డ్రైవర్ మాట్లాడుతూ.. లగేజీ బరువుగా అనిపించినా తనకు పెద్దగా అనుమానం రాలేదని, ప్రయాణంలోనూ సుచనా ఏం మాట్లాడలేదని చెప్పాడు. కాసేపయ్యాక పోలీసులు ఫోన్ చేసి, తనకు ఘటన గురించి చెప్పారన్నాడు. ఆ తర్వాత తాను మెల్లగా మాటలు కలిపి కుమారుడి గురించి అడిగానని.. ఫ్రెండ్ ఇంట్లో వదిలేశానని ఆమె సమాధానం ఇచ్చిందన్నాడు. ఆమెలో తనకు కంగారేమీ కనిపించలేదన్నాడు. ఆమెని దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లమని పోలీసులు చెప్పారని.. వాళ్లు చెప్పినట్లే ఓ రెస్టారెంట్ వద్ద ఆగి, దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేశానన్నాడు. పోలీసులు వెంటనే వచ్చి ఆమెని అదుపులోకి తీసుకున్నప్పుడు.. సూట్‌కేసులో బాలుడి మృతదేహం కనిపించిందని అన్నాడు.
ఇదిలావుండగా.. విభేదాలు తలెత్తాక తన భర్త వెంకటరత్నంపై సుచనా ద్వేషం పెంచుకుంది. కుమారుడు తల్లి వద్దే ఉండొచ్చని కోర్టు తెలపడంతో.. ప్రతి ఆదివారం తండ్రి కలవొచ్చని ఆదేశించింది. అయితే.. ఇది సుచనాకు నచ్చలేదు. తండ్రికొడుకుల్ని కలవనివ్వకూడదని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే కుమారుడి మరణశాసనం రాసింది. చిన్నారిని హత్య చేయడానికి ముందు.. ‘జనవరి 7న కుమారుడ్ని చూడొచ్చు’ అనే మెసేజ్ తన భర్తకి సుచనా పంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. కాగా.. మరింత విచారించేందుకు సుచనాను కస్టడీలోకి తీసుకున్నారు. ఆమెకు మానసిక పరీక్షలు కూడా నిర్వహించినట్లు తెలిసింది.
Updated Date - Jan 11 , 2024 | 03:44 PM