Ram Mandir: అయోధ్యలో సరికొత్త దోపిడీ.. అదును చూసి కొట్టారు.. చివరికి కథలో ట్విస్ట్!
ABN, Publish Date - Jan 29 , 2024 | 10:22 PM
అయోధ్యలో సరికొత్త దోపిడీ వెలుగులోకి వచ్చింది. ఆహార పదార్థాలను సాధారణ ధరలకు కాకుండా భారీ రేట్లకు విక్రయిస్తూ.. కొన్ని హోటళ్లు కస్టమర్లను నిండా దోచేసుకుంటున్నాయి. మంచి సేవలు అందించాల్సింది పోయి.. కస్టమర్లను ముంచేసే చెత్త సర్వీసులతో నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
అయోధ్యలో సరికొత్త దోపిడీ వెలుగులోకి వచ్చింది. ఆహార పదార్థాలను సాధారణ ధరలకు కాకుండా భారీ రేట్లకు విక్రయిస్తూ.. కొన్ని హోటళ్లు కస్టమర్లను నిండా దోచేసుకుంటున్నాయి. మంచి సేవలు అందించాల్సింది పోయి.. కస్టమర్లను ముంచేసే చెత్త సర్వీసులతో నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అయోధ్యలో రామమందిరం ప్రారంభమైనప్పటి నుంచి భక్తులు పోటెత్తుతున్న తరుణంలో.. ఇదే అదునుగా రెస్టారెంట్లు రేట్లను భారీగా పెంచేశాయి. ఒక రెస్టారెంట్ చేసిన నిర్వాకం చూస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే.
ఆ రెస్టారెంట్ పేరు శబరి రసోయి. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత ఈ రెస్టారెంట్‌ని కొత్తగా ప్రారంభించారు. రామాలయాన్ని దర్శించుకోవడం కోసం భక్తులు భారీ స్థాయిలో తరలివస్తారు కాబట్టి.. మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా బిజినెస్ బాగా జరుగుతుందన్న ఉద్దేశంతో ఈ రెస్టారెంట్‌ని తెరిచారు. అయితే.. కస్టమర్లు ఎక్కువ సంఖ్యలో వస్తుండటం చూసి ఈ రెస్టారెంట్ యాజమాన్యం కక్కుర్తి పడింది. ధరలను అమాంతం పెంచేసింది. రూ.10 అమ్మాల్సిన టీ ధరను ఏకంగా రూ.55కు పెంచేసింది. అలాగే.. ఒక్కో టోస్ట్ ధరను రూ.65గా కేటాయించింది. ఒక కస్టమర్ ఆ రెస్టారెంట్‌కి వెళ్లి.. రెండు టీలు, రెండు టోస్టులు ఆర్డర్ చేయగా.. జీఎస్టీతో కలిపి మొత్తం రూ.252 వసూలు చేసింది.
ఈ బిల్లుని చూసి ఖంగుతిన్న సదరు కస్టమర్.. ఇదేంటని ఆ రెస్టారెంట్ స్టాఫ్‌ని ప్రశ్నించాడు. ఇక్కడ అంతే అన్నట్లుగా వాళ్లు సమాధానం ఇచ్చారు. దీంతో.. అతడు ఆ బిల్లుని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయోధ్యలో రాముడి పేరుతో నిండా దోచేసుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పోస్టు కొద్దిసేపటికే నెట్టింట్లో తెగ వైరల్ అయ్యింది. చివరికి ఈ అంశం అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ (ఏడీఏ)కి చేరింది. దీంతో.. అధికారులు సదరు హోటల్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. మూడు రోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని.. లేకపోతే ఒప్పందాన్ని రద్దు చేస్తామంటూ హెచ్చరించింది. దీనిపై ప్రస్తుతం రాద్ధాంతం జరుగుతోంది.
Updated Date - Jan 29 , 2024 | 10:22 PM