Vehicles: భారత్‌లో ట్రాఫిక్ రద్దీ అత్యధికంగా ఉంటున్న నగరం అదే..
ABN, Publish Date - Feb 04 , 2024 | 10:54 AM
అభివృద్ధి చెందుతున్న దేశాలను ఇప్పుడు ప్రధానంగా వేధిస్తున్న సమస్య ట్రాఫిక్. దినదినాభివృద్ధి చెందుతున్న నగరాలు, పట్టణాలను ఈ సమస్య ఏళ్లుగా పట్టి పీడిస్తోంది. వలసలతో ఓ వైపు నగరాలు కిక్కిరిస్తుంటే మరోవైపు మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా మారుతోంది.
ఢిల్లీ: అభివృద్ధి చెందుతున్న దేశాలను ఇప్పుడు ప్రధానంగా వేధిస్తున్న సమస్య ట్రాఫిక్. దినదినాభివృద్ధి చెందుతున్న నగరాలు, పట్టణాలను ఈ సమస్య ఏళ్లుగా పట్టి పీడిస్తోంది. వలసలతో ఓ వైపు నగరాలు కిక్కిరిస్తుంటే మరోవైపు మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా మారుతోంది. మౌలిక సదుపాయాల్లో ప్రధానమైనవి రోడ్లు. భారత్‌లో చాలా నగరాలు సరైన ప్రణాళిక లేకుండా నిర్మించడం వల్ల ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్(Traffic) సమస్య నిత్యకృత్యంగా మారింది.
తాజాగా టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్(TomTom Traffic Index) నివేదిక ట్రాఫిక్‌తో అత్యంత రద్దీగా ఉండే నగరాల లిస్టును విడుదల చేసింది. యూకే రాజధాని లండన్ ప్రపంచంలోనే అత్యంత రద్దీ నగరంగా.. ట్రాఫిక్ సమస్యలతో ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నట్లుగా నివేదిక తెలిపింది. ఇక్కడ రద్దీ సమయంలో వాహనాలు గంటకు అత్యల్పంగా 14 కి.మీ.ల వేగంతో ప్రయాణిస్తాయని వివరించింది. 2023లో ప్రపంచంలో ట్రాఫిక్‌తో అత్యధికంగా ప్రభావితమైన పది నగరాల్లో బెంగళూరు (6), పుణె(7)లు ఉన్నాయి.
బెంగళూరులో ప్రతి10 కి.మీలకు సగటు ప్రయాణ సమయం 28 నిమిషాల 10 సెకన్లు కాగా, పుణెలో ఇది 27 నిమిషాల 50 సెకన్లుగా ఉంది. బెంగళూరు.. ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ తర్వాత అత్యంత రద్దీగా ఉండే రెండో ఐటీ నగరంగా నిలిచింది. గతేడాది సెప్టెంబర్ 27న బెంగళూరులో 10 కి.మీ వెళ్లడానికి 32 నిమిషాల సమయం పట్టింది.
ఢిల్లీ, ముంబయిలు కూడా..
టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్‌లో ఢిల్లీ (44), ముంబై (52) కూడా ఉన్నాయి. ఢిల్లీలో సగటున 10 కిలోమీటర్ల దూరానికి 21 నిమిషాల 40 సెకన్లు పట్టిందని, ముంబయిలో 21 నిమిషాల 20 సెకన్లు పట్టిందని నివేదిక వెల్లడించింది. 2022తో పోలిస్తే 2023లో 228 నగరాల్లో వాహనాల సగటు వేగం తగ్గిందట.
రిపోర్ట్ ఇలా..
టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ఆరు ఖండాల్లోని 55 దేశాలలో 387 నగరాల్లో సగటు ప్రయాణ సమయం, ఇంధన ఖర్చులు, కార్బన్‌డైఆక్సైడ్ ఉద్గారాల ద్వారా వివరాలు సేకరించింది. 600 మిలియన్లకు పైగా ఇన్-కార్ నావిగేషన్ సిస్టమ్‌లు, స్మార్ట్ఫోన్ల డేటా ఆధారంగా నివేదిక రూపొందించింది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Feb 04 , 2024 | 10:55 AM