Delhi: జంతు ప్రేమికులకు గుడ్ న్యూస్.. పెరిగిన చిరుతపులుల సంఖ్య.. ప్రస్తుతం ఎన్నున్నాయంటే
ABN, Publish Date - Feb 29 , 2024 | 04:35 PM
జంతు ప్రేమికులకు పర్యావరణ మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. చిరుత పులుల సంఖ్యకు సంబంధించిన గణాంకాలను ఫిబ్రవరి 29న విడుదల చేసింది. గతంతో పోల్చితే 1.08 శాతం చిరుతపులుల సంఖ్య పెరిగినట్లు గణాంకాల సారాంశం. 2018 - 2022 మధ్య కాలానికి సంబంధించిన ఈ సర్వేకు సంబంధించి కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ నివేదిక విడుదల చేశారు.
ఢిల్లీ: జంతు ప్రేమికులకు పర్యావరణ మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. చిరుత పులుల సంఖ్యకు సంబంధించిన గణాంకాలను ఫిబ్రవరి 29న విడుదల చేసింది. గతంతో పోల్చితే 1.08 శాతం చిరుతపులుల సంఖ్య పెరిగినట్లు గణాంకాల సారాంశం. 2018 - 2022 మధ్య కాలానికి సంబంధించిన ఈ సర్వేకు సంబంధించి కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్(Bhupender Yadav) నివేదిక విడుదల చేశారు. నివేదికలోని వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 3,907 చిరుతపులులు ఉన్నాయి. 2018లో అక్కడ 3,421 మాత్రమే చిరుతలు ఉండేవి. మధ్యప్రదేశ్ తరువాత అత్యధికంగా మహారాష్ట్రలో 1,985, కర్ణాటక(1,879), తమిళనాడు(1,070) చిరుతలు ఉన్నాయి.
మొత్తంగా భారత్‌లో 2022నాటికి 13,874 చిరుతలు సంచరించినట్లు తేలింది. కేంద్ర అధికారుల బృందం నాలుగు ప్రధాన పులుల సంరక్షణ ప్రాంతాలను కవర్ చేస్తూ దాదాపు 18 రాష్ట్రాల్లో చిరుతల సంఖ్యను లెక్కించారు. అడవులు లేని ప్రాంతాలు, తీర ప్రాంతాలు, ఎడారులు, ఎక్కువ ఎత్తులో ఉన్న హిమాలయాల వంటి ప్రాంతాలను ఈ సర్వేలో పరిగణలోకి తీసుకోలేదు. 2018లో చిరుతల సంఖ్య 12,852గా ఉండగా.. 5 ఏళ్లలో 1,022 పెరిగింది. టైగర్ రిజర్వ్స్ లేదా అత్యధిక చిరుతల సంఖ్య ఉన్న ప్రాంతాల లిస్టులో నాగర్జున సాగర్, పన్నా, సాత్పురాలు ఉన్నాయి.
మధ్య భారత రాష్ట్రాలు, తూర్పు కనుమల్లో వాటి సంఖ్య 1.5 శాతం వృద్ధి చెందింది. శివాలిక్ కొండలు, గంగా మైదానాల్లో 3.4 శాతం తగ్గుదల నమోదైంది. ప్రకృతి విధ్వంసం, చిరుతలను వేటాడటం, వన్యప్రాణుల ఘర్షణ.. చిరుతల మృతికి ప్రధాన కారణాలని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) చెప్పింది. కేంద్ర బృందం వాటి సంఖ్యను కనుక్కునేందుకు 6,41,449 కి.మీల మేర పాదాల సర్వే నిర్వహించింది. 32,803 ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు అమర్చారు. మొత్తంగా 4 కోట్ల 70 లక్షల 81 వేల 881 ఫొటోలు తీశారు. 85,488 ఫొటోల్లో 13,874 చిరుతలను గుర్తించారు. ఈ సందర్భంగా మంత్రి భూపేందర్ మాట్లాడుతూ.. వన్యప్రాణుల సంరక్షణ కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టినట్లు చెప్పారు. చిరుతల సంఖ్య పెరగడంపై ఆయన అధికారులను అభినందించారు. వన్యమృగాలను సంరక్షించే లక్ష్యాన్ని చేరుకుంటున్నట్లు వివరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Feb 29 , 2024 | 04:46 PM