Story : ఆత్మ సంతృప్తి
ABN, Publish Date - Jan 19 , 2024 | 05:26 AM
ఒక రాజ్యంలో ఓ అత్యంత తెలివైనవాడుండేవాడు. అతని పేరు సుబ్బన్న. తెలివైనవాడే కానీ తృప్తి, ఆనందం అనే మాట తెలీని వాడు. ఎవరిని చూసినా తానే వాడికంటే గొప్ప అనుకుండే నైజం.
ఒక రాజ్యంలో ఓ అత్యంత తెలివైనవాడుండేవాడు. అతని పేరు సుబ్బన్న. తెలివైనవాడే కానీ తృప్తి, ఆనందం అనే మాట తెలీని వాడు. ఎవరిని చూసినా తానే వాడికంటే గొప్ప అనుకుండే నైజం. దీంతో సుబ్బన్న అహంభావి అనేవారు కొందరు. ఇవేమీ పట్టించుకునేవాడు కాదు సుబ్బన్న.
రాజ్యంలో ఓ గుడి కట్టారు. అది రాముల వారి ఆలయం. ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాలకు వెళ్లి ఆనందించాలని సుబ్బన్న అనుకున్నాడు. తన ఊరు దూరం అయినా కాలిబాటన, బండిలో ఇలా ఉత్సవ స్థలానికి చేరుకున్నాడు. మొదటి రోజు రాజుగారు వచ్చారు. అందరూ ఆసీనులై ఉండగా.. ఇద్దరు కళాకారులు వచ్చి పాటలు పాడారు. ఆ పాటలు విని తన్మయత్వం చెందాడు. తాను కూడా అలా పాడితే బావుండునని అనుకున్నాడు. ఎంతో బాధపడ్డాడు. తానూ అలా గాయకుడిని అయితే బావుండును అనుకున్నాడు.
రెండో రోజు రాజుగారి ముందు కవులు వచ్చి పద్యాలు పాడారు. పండితులు మాట్లాడారు. వారిలా పద్యాలు రాయలేకపోతినే అనుకున్నాడు. కొన్ని పద్యాలు అర్థమై ఎంతో సంతోషపడ్డాడు. నేను కూడా పండితుడిని అయితే వీరి భాష వచ్చి ఉండేది కదా అని వగచాడు. రానే చివరి రోజు వచ్చింది. మూడో రోజు రామాలయం దగ్గర రామాయణం బొమ్మలు, ఎన్నో విశేషాలను కళాకారులు చిత్రించారు. కాన్వాసుల మీద రాళ్లమీద రామాయణగాథ వివరించబడింది. ఆ బొమ్మలు చూసి నేను కూడా ఇలా గీసి ఉంటే అందరి మెప్పు పొందేవాడిని కదా.. అనుకున్నాడు సుబ్బన్న.
బాధతో కోపంతో ఇంటికి పయనమయ్యాడు. మూడోరోజు రాత్రి ఓ ఆశ్రమంలో బస చేశాడు. అక్కడ ముగ్గురు కనపడ్డారు. ఒకడు గుడ్డివాడు, రెండోవాడు చెవిటి, మూడో వాడికి కళ్లు లేవు. అది చూసి సుబ్బన్న ఆశ్చర్యపోయాడు. ‘వీళ్లు ఈ రాముడి గుడి ఉండే ఊరిలోనే ఉన్నారు. అయితే ఏ కళలనూ ఆస్వాదించలేకపోతున్నారే. వారి కంటే నేనే నయం కదా’ అనుకున్నాడు. వెంటనే అతనికి ఆత్మసంతృప్తి కలిగింది. ఎంతో
ఆనందపడ్డాడు.
Updated Date - Jan 19 , 2024 | 05:26 AM