ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Dr. Penna Krishnaprashanthi : నవతరం ఆరోగ్యంగా లేదు

ABN, Publish Date - Jan 17 , 2024 | 03:22 AM

‘జబ్బులకు పరిష్కారం మందులు కాదు. మందులు ఇవ్వడమే వైద్యమూ కాదు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఊరు, మట్టి, చెట్టూచేమా ఆరోగ్యంగా ఉండాలి. మందుల మీద కాదు... ప్రతిదీ మనం తినే

‘జబ్బులకు పరిష్కారం మందులు కాదు. మందులు ఇవ్వడమే వైద్యమూ కాదు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఊరు, మట్టి, చెట్టూచేమా ఆరోగ్యంగా ఉండాలి. మందుల మీద కాదు... ప్రతిదీ మనం తినే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది’ అంటున్నారు కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘బైరాక్‌’ (బయోటెక్నాలజీ ఇండస్ర్టీ రీసెర్చ్‌ అసిస్టెన్స్‌ కౌన్సిల్‌) ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌... తిరుపతి వైద్యురాలు... పెన్నా కృష్ణప్రశాంతి. తెలుగు రాష్ట్రాల నుంచి ‘బైరాక్‌’కు ఎంపికైన తొలి ప్రతినిధిగా చరిత్ర సృష్టించిన ఆమె... తన అనుభవాలను ‘నవ్య’తో పంచుకున్నారు.

‘‘బయోటెక్నాలజీ, వ్యవసాయం, వైద్యం, ఆహారం, పశు, మత్స్య రంగాల్లో ఆధునిక ఆవిష్కరణలకు ‘బైరాక్‌’ ఊతమిస్తోంది. ఈ రంగాల్లో పరిశోధనలకు ఆర్ధిక సాయం చేస్తోంది. దీనికింద పదేళ్లలో దేశంలో దాదాపు 350 ఆవిష్కరణలు జరిగాయి. వీటిలో ‘కొవీషీల్డ్‌ వ్యాక్సిన్‌’ ఒకటి. అత్యంత చవగ్గా, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఎంఆర్‌ఐ స్కానింగ్‌ యంత్రానికి ఒక పరిశోధక బృందం రూపకల్పన చేసింది. గ్రామీణ శాస్త్రవేత్తలు మొదలు... ఐఐటీల దాకా ‘బైరాక్‌’ సేవలను వినియోగించుకోవచ్చు. దురదృష్టం ఏంటంటే ‘బైరాక్‌’ అనేది ఒకటుందనే విషయమే మనలో చాలామందికి తెలియకపోవడం. డిగ్రీ కాలేజీ స్థాయి నుంచే పరిశోధక ప్రాజెక్టులకు దీని నుంచి ఆర్థిక సాయం అందుకునే వీలుంది. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ‘బైరాక్‌’ దగ్గర వందల కోట్ల నిధులున్నాయి. తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు దీన్ని వినియోగించుకుంటున్నట్టుగా ఏపీ వాడుకోవడంలేదు. అవగాహన లేకపోవడమే ఇందుకు కారణం. ‘కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ’ బయోటెక్నాలజీ కార్యదర్శి రాజేష్‌ ఎస్‌ గోఖలే చైర్మన్‌గా ఉండే బైరాక్‌లో శాస్త్రవేత్తలు, అత్యున్నత విద్యావేత్తలు అయిన ఆరుగురు డైరెక్టర్లుంటారు. వీరు రెండు నెలలకోసారి సమావేశం అవుతారు. నూతన ఆవిష్కరణల కోసం వచ్చే ప్రతిపాదనలను పరిశీలించి, చర్చించి నిధులు కేటాయిస్తారు. ఇంత బాధ్యతాయుతమైన, ప్రతిష్టాత్మకమైన డైరెక్టర్‌ పదవి, ఒక స్వతంత్ర తెలుగు వైద్యురాలిని వెతుక్కుంటూ రావడమే విశేషం.

కర్రకు బల్బు వేలాడదీసి...

మా నాన్న పెన్నా ప్రభాకరరెడ్డి నీటి పారుదల శాఖలో ఇంజనీర్‌. మా అమ్మ కోకిలా సరోజమ్మ డాక్టర్‌. నాన్నకు తరచూ బదిలీలవల్ల మేం ఎక్కడా కుదురుగా లేము. గైనకాలజిస్టుగా అమ్మకు క్షణం తీరిక ఉండేది కాదు. ఆమెది వామపక్ష భావజాలం. నాన్న సంప్రదాయవాది. ఆయన వాకిట్లో కర్రకు బల్బు వేలాడదీసి, తనూ మేల్కొని రాత్రంతా నన్ను చదివించేవారు. నేను కాలు బయటపెట్టాల్సిన అవసరం లేకుండా ప్రతిదీ సిద్ధం చేసేవారు. దాంతో నాకు చదవడం తప్ప నలుగురితో కలవడం, మాట్లాడడం తెలీదు. ‘పొట్టిగున్నావు, నల్లగున్నావు, లావుగున్నావు, నీకు పెళ్లికాదు’... అని అందరూ జాలిపడుతూ ఉంటే నాలోకి నేను పారిపోయేదాన్ని. సమాజం చూపే ఈ తేడా నాలో కసిని పెంచింది. దాంతో చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టాను. ప్రతి తరగతిలోనూ ఫస్ట్‌. ఏడులో ఖమ్మం జిల్లా టాపర్‌ని. టెన్త్‌లో స్టేట్‌ ఐదో ర్యాంకర్‌ని. ఇంటర్‌లో స్టేట్‌ సెకండ్‌. అదే ఊపులో ఎంసెట్‌ రాసి 121వ ర్యాంకుతో తిరుపతి ‘ఎస్వీ మెడికల్‌ కాలేజీ’లో చేరాను. మెడిసిన్‌లోనూ పలు సబ్జక్టుల్లో గోల్డ్‌ మెడల్స్‌ సాధించాను. రాష్ట్రంలోని వైద్య కళాశాలలన్నిటిలోనూ ప్రథమ స్థానంలో నిలిచి ‘డాక్టర్‌ ఎన్‌ఆర్‌కె రావు’ గోల్డ్‌ మెడల్‌ను నాటి గవర్నర్‌ కృష్ణకాంత్‌ చేతుల మీదుగా అందుకున్నాను.

చులకన చేసినవారే...

నేను డాక్టర్‌ అయ్యాక కూడా ఈ పరుగు ఆగలేదు. రాష్ట్ర స్థాయిలో 16వ ర్యాంకుతో కర్నూలులో పీజీలో చేరాను. ‘అమ్మాయిలు ఇంట్లో అంట్లు తోముకోవాలి గానీ... జనరల్‌ మెడిసిన్‌కి ఎందుకు వస్తారు’ అని తొలి క్లాస్‌లోనే ఒక ప్రొఫెసర్‌ అన్నారు. ఎప్పటిలాగే నోరు మెదపలేదు. చదువుతోనే వాళ్లకు సమాధానం చెప్పాలనుకున్నాను. ఆరు నెలల తరువాత ఆ ప్రొఫెసరే పిలిచి... ‘జిల్లా కలెక్టర్‌ భార్యకు ఆరోగ్యం బాలేదట. వెళ్లి చూసిరా’ అని అంతమంది మగ డాక్టర్లున్నా నన్నే పంపించారు.

మౌనాన్ని బద్దలు చేసింది...

పీజీ చదువుతుండగానే నా పెళ్లి అయింది. చదువు, చంకలో బిడ్డ, రెండు గదుల ఇరుకు ఇంట్లో కాపురం. మావారు హరినాథరెడ్డి సర్జన్‌. ఆయనకు చాలీచాలని జీతం. వేల రూపాయల ఖరీదు చేసే మెడికల్‌ పుస్తకాలు కొనలేని పరిస్థితి. ఆయన మద్రాసు మూర్‌ మార్కెట్‌కి వెళ్లి చవగ్గా పాత పుస్తకాలు కొనుక్కునేవారు. ఇరువైపుల కుటుంబాల మధ్య పెరిగిన పంతాలు గొడవలుగా మారి పెద్దవాళ్ల ఆసరా కూడా కరువైంది. ఆ సంఘర్షణే నాలో గడ్డకట్టిన మౌనాన్ని బద్దలు చేసింది. ఆ ధిక్కారం స్వతంత్ర బాటలోకి నడిపించింది. పీజీలోనూ కర్నూలు కాలేజీ ఫస్ట్‌ సాధించాను. తరువాత తిరుపతిలో ప్రాక్టీస్‌ ప్రారంభించాను. వేలూరు సీఎంసీలో డయాబెటాలజీలో ఫెలోషిప్‌ చేశాను. డయాబెటిక్‌ ఫుట్‌ మీద అధ్యయనం జరిపి, సమర్పించిన పరిశోధనా వ్యాసానికి జాతీయ స్థాయిలో ఉత్తమ పరిశోధక అవార్డు లభించింది. డయాబెటాలజీలో చేసిన పరిశోధక కృషి... 7 దేశాల్లో ఈ అంశంపై ప్రసంగించే అవకాశం కల్పించింది.

వాళ్లే నేర్పించారు...

కాలేజీలో చదువుకున్న దానికన్నా ఎక్కువ పాఠాలు వైద్యం కోసం వచ్చే ప్రజల నుంచి నేర్చుకున్నాను. జబ్బులకు మందులు మాత్రమే సరిపోవని అర్థం చేసుకున్నాను. మాటలు అవసరం అయ్యాయి. ఆ మాటలను నాకు రోగులే నేర్పించారు. ఎదిగే వయసులో అనారోగ్యంతో వచ్చే ఆడపిల్లల్ని చూస్తే దిగులేసేది. చిన్న సమస్యలే వారి మనసును మెలి పెట్టేసేవి. డబ్బులున్న, చదువుకున్న తల్లులైతే సరే... డాక్టర్‌ దగ్గరకన్నా తీసుకువస్తారు. మరి పేద గ్రామీణ పిల్లల పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్నే నన్ను ప్రభుత్వ బడులకు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు నడిపించింది. పీరియడ్స్‌ సమయంలో వచ్చే నొప్పిని అమ్మతో పంచుకుంటారు గానీ, అదనంగా పెరిగే వెంట్రుకలు, బ్రెస్ట్‌ సైజుపై సందేహాలు, పింపుల్స్‌ వంటివి ఆ వయసు ఆడపిల్లల్ని తీవ్రంగా కలచివేసే అంశాలు. ఎవరితోనూ మాట్లాడలేరు. వీటి గురించి వారికి అర్థమయ్యేలా చెప్పగలిగితే చాలు... సగం ఆరోగ్యం లభించినట్టే. ఇదే వయసు మగపిల్లలతో మాట్లాడాక నాకు ఒక విషయం అర్థమైంది. ఆడపిల్లలకన్నా మగపిల్లలే ఎక్కువగా సిగ్గుపడతారని. ఆడపిల్లల్లానే వాళ్లనీ శరీరంలోని మార్పులు తీవ్రంగా ఆందోళన పెడతాయని.

అధ్యయనాలు పెరగాలి...

అయినా ప్రజారోగ్యం పట్ల ఆందోళన, అసంతృప్తిని ఇవేవీ తగ్గించలేకపోతున్నాయి. నేడు నవతరం ఆరోగ్యంగా లేదు. రేపటి తరం ఆరోగ్యం కోసం గట్టి ప్రయత్నాలు మొదలవ్వాలి. పిల్లల్లో ఒబెసిటీ, పీసీఓడీ ఇప్పుడున్నంత ఎక్కువగా పదేళ్ల కిందట లేవు. కొవిడ్‌ తర్వాత చాలా మార్పులు వచ్చాయి. అధ్యయనాలు పెరగాలి. ప్రాచీన సంస్కృత ఆయుర్వేద గ్రంథాలను అనువదించుకోవాలి. అందులో పేర్కొన్న అంశాల మీద ఆధునిక పరిశోధనలు జరగాలి. ఫలానా పండు తింటే ఫలానా రోగం తగ్గుతుందనో, ఫలానా జబ్బుకి ఫలానా ఆకు లేదా వేరు పరిష్కారం అనో చెప్పడం కాదు. అది ఎలానో పరిశోధనలో నిగ్గు తేల్చాలి. దేశంలోని ఔత్సాహికులనూ, పరిశోధనా సంస్థలనూ ఈ దిశగా మళ్లించగలగాలి. అందుకు అవసరమైన అవగాహన కలిగించేందుకు, కావలసిన ఆర్థిక వనరులు సమకూర్చేందుకు ‘బైరాక్‌’ సిద్ధంగా ఉంది. దాన్ని అందరూ వినియోగించుకోవాలి. విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, కళాశాలలను సంప్రతిస్తూ ఆ దిశగా నా ప్రయత్నం కొనసాగిస్తున్నాను.’’

ప్రత్యేక గుర్తింపు...

ఆలిండియా రేడియోలో ఉపన్యాసాలు, బడి పిల్లలతో సంభాషణలు, ప్రతివారం అవగాహనా కార్యక్రమాలు... ఇవన్నీ నన్ను మాటకారిగా మలిచాయి. ‘ఐఎంఏ, ఫిజీషియన్ల సంఘం, డయాబెటిక్‌ పరిశోధనా మండలి’లో నా పాత్ర, ప్రసంగాలు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. అవి ఉత్తర భారత వైద్య ప్రపంచం చూపును దక్షిణాది వైపు కాస్త మళ్లించగలిగాయి. నా కృషికి ‘ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ ఎక్స్‌లెన్స్‌’ అవార్డు దక్కింది. ఈ ప్రయాణమే నేడు నన్ను ‘బైరాక్‌’ డైరెక్టర్‌ను చేసింది.

పి.నరేంద్ర, తిరుపతి

Updated Date - Jan 17 , 2024 | 03:22 AM

Advertising
Advertising