Origins of Life: భూమిపై జీవానికి మూలం గుర్తింపు!
ABN, Publish Date - Jan 16 , 2024 | 04:59 PM
భూమిపై జీవానికి మూలం ఏది? అనే ప్రశ్నకు ఇప్పటికీ నిర్దిష్టమై సమాధానం లేదు. ఈ రహస్యాన్ని చేధించేందుకు గత కొన్ని శతాబ్దాలుగా నిరంతరాయంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో సిద్ధాంతాలు తెరపైకి వచ్చి కొత్త సమాచారం తెలిసినప్పటికీ జీవానికి మూలం ఎక్కడనే దానిపై ఇంతవరకు స్పష్టత లేదు.
భూమిపై జీవానికి మూలం ఏది? అనే ప్రశ్నకు ఇప్పటికీ నిర్దిష్టమై సమాధానం లేదు. ఈ రహస్యాన్ని చేధించేందుకు గత కొన్ని శతాబ్దాలుగా నిరంతరాయంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో సిద్ధాంతాలు తెరపైకి వచ్చి కొత్త సమాచారం తెలిసినప్పటికీ జీవానికి మూలం ఎక్కడనే దానిపై ఇంతవరకు స్పష్టత లేదు. అయితే ఇంగ్లండ్‌లోని న్యూకాసిల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు జీవ మూలం అన్వేషణలో కీలక పురోగతి సాధించారు. పురాతన వేడి నీటి చెలమలే (Hot Springs) జీవానికి మూలమని చెబుతున్నారు. దాదాపు 3.5 బిలియన్ సంవత్సరాలక్రితం సహజ రసాయనాలు తొలుత జీవులుగా ఎలా రూపాంతరం చెందాయో తెలుసుకునేందుకు పరిశోధకులు పురాతన వేడి నీటి చెలమ వాతావరణాన్ని సృష్టించి ప్రయోగాన్ని చేపట్టారు. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో హైడ్రోజన్, బైకార్బొనేట్, ఐరన్ అధికంగా ఉండే మాగ్నెటైట్‌ల కలయికతో సేంద్రీయ అణువుల సమ్మేళనం పదార్థం ఏర్పడిందని పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా పొడవుపరంగా కొవ్వు ఆమ్లాలు 18 కార్బన్ అణువుల వరకు విస్తరించి ఉన్నాయని పసిగట్టామని తెలిపారు. ఈ మేరకు ‘నేచర్ కమ్యూనికేషన్స్ ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంట్ జర్నల్’లో అధ్యయనం ప్రచురితమైంది.
జీవం పుట్టుకలో అకర్బన రసాయనాల నుంచి కీలక అణువుల ఉత్పత్తి ఏవిధంగా జరుగుతుందో పరిశోధలు గుర్తించారు. బిలియన్ల సంవత్సరాల క్రితం భూమిపై జీవం ఎలా ఏర్పడిందనే పరిశోధనలో కీలక దశను అర్థం చేసుకోవడానికి ఈ అవగాహన చాలా ముఖ్యమని పేర్కొన్నారు. పురాతన కణ త్వచాల ఏర్పాటులో సేంద్రీయ అణువులు ఏ విధంగా సహాయపడ్డాయనేద తెలుసుకునేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని చెప్పారు. భూమిపై జీవం పుట్టుక మాదిరిగానే సుదూర గ్రహాల మీద కూడా ఘనీభవించిన సముద్రాలపై ఇలాంటి ప్రక్రియ జరిగేందుకు ఆస్కారముందని పరిశోధకులు చెబుతున్నారు. మన సౌర వ్యవస్థలో వేరే గ్రహాల మీద జీవం ఉద్భవించి ఉండొచ్చని పేర్కొన్నారు.
Updated Date - Jan 16 , 2024 | 05:06 PM