Viral News: పెళ్లికి వచ్చిన అనుకోని అతిథులు.. పరుగు తీసిన బంధువులు.. 12 మందికి గాయాలు
ABN, Publish Date - Feb 18 , 2024 | 05:31 PM
పెళ్లిళ్లలో చిన్న చిన్న కారణాల వల్ల గొడవలు ఏర్పడటం, బంధవులు కొట్టుకోవడం, ఎవరో ఒకరు గాయాలపాలవ్వడం వంటి సంఘటనలు మన దేశంలో అప్పుడప్పుడు చోటు చేసుకుంటుంటాయి. కానీ.. మధ్యప్రదేశ్లోని ఒక పెళ్లిలో అనుకోని అతిథుల కారణంగా గందరగోళ వాతావరణం నెలకొంది. బంధవులందరూ భయంతో పరుగు లంకించాల్సి వచ్చింది.
పెళ్లిళ్లలో చిన్న చిన్న కారణాల వల్ల గొడవలు ఏర్పడటం, బంధవులు కొట్టుకోవడం, ఎవరో ఒకరు గాయాలపాలవ్వడం వంటి సంఘటనలు మన దేశంలో అప్పుడప్పుడు చోటు చేసుకుంటుంటాయి. కానీ.. మధ్యప్రదేశ్లోని ఒక పెళ్లిలో అనుకోని అతిథుల కారణంగా గందరగోళ వాతావరణం నెలకొంది. బంధవులందరూ భయంతో పరుగు లంకించాల్సి వచ్చింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 12 మంది గాయాలపాలయ్యారు కూడా! ఇంతకీ ఆ అనుకోని అతిథులు ఎవరనుకుంటున్నారా? మరెవ్వరో కాదు.. తేనెటీగలు. ఆ వివరాల్లోకి వెళ్తే..
మధ్యప్రదేశ్ రాష్ట్రం గుణ జిల్లాలోని కస్తూరి గార్డెన్ హోటల్లో ఒక వివాహ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంతోమంది బంధువులు, స్నేహితులు విచ్చేశారు. అప్పటివరకూ అక్కడ వాతావరణం ఎంతో సరదాగా ఉంది. కానీ.. ఇంతలోనే పిలవని ఆహ్వానితులుగా తేనెటీగలు ఈ పెళ్లికి వచ్చాయి. ఆ హోటల్ పైకప్పుపైనే నివాసం ఏర్పాటు చేసుకున్న తేనెటీగలు.. వేలాది సంఖ్యలో దూసుకొచ్చి బంధువులపై విరుచుకుపడ్డాయి. దీంతో.. వీటి బారి నుంచి తప్పించుకోవడం కోసం పెళ్లికి వచ్చి ఆహ్వానితులు పరుగులు పెట్టారు. ఫలితంగా.. అక్కడ గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలోనే.. బంధువుల్లో 12 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.
ఈ సంఘటన గురించి అధికారులకు సమాచారం అందించగా.. వాళ్లు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితుల్ని అదుపు చేసి, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చేర్చారు. మరోవైపు.. హోటల్ యాజమాన్యంపై కూడా అధికారులు సీరియస్ అయినట్లు తెలిసింది. తేనెటీగలు నివాసం ఏర్పరచుకునేంతవరకు ఏం చేస్తున్నారంటూ నిలదీశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Updated Date - Feb 18 , 2024 | 05:31 PM