Viral News: ఇంట్లో టైగర్.. భయంతో పరుగులు పెట్టిన వ్యక్తి.. ఆ తర్వాత ఏమైందంటే?
ABN, Publish Date - Jan 15 , 2024 | 02:03 PM
Viral News: మనం ఎలాగైతే శునకాలు, పిల్లులను ‘పెట్స్’గా పెంచుకుంటామో.. అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో చిరుతలు, పులలు, సింహాలు వంటి వన్యప్రాణులను పెంపుడు జంతువులుగా ఉంచుకుంటారు. సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ.. తాము సింహాలు, పులులను కూడా కంట్రోల్ చేస్తామని గొప్పలు చెప్పుకుంటుంటారు.
మనం ఎలాగైతే శునకాలు, పిల్లులను ‘పెట్స్’గా పెంచుకుంటామో.. అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో చిరుతలు, పులలు, సింహాలు వంటి వన్యప్రాణులను పెంపుడు జంతువులుగా ఉంచుకుంటారు. సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ.. తాము సింహాలు, పులులను కూడా కంట్రోల్ చేస్తామని గొప్పలు చెప్పుకుంటుంటారు. ఇలాంటి వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే.. రీసెంట్‌గా ఓ పెంపుడు పులి ఒక వ్యక్తిని వెంబడించే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
‘బిలియనీర్స్ లైఫ్ స్టైల్’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసిన ఈ వీడియోలో ఏముందంటే.. అది ఒక విలాసవంతమైన ఇల్లు. ఆ ఇంటికి వచ్చిన ఒక వ్యక్తి, ఇంట్లో ఉన్న పెట్ టైగర్‌ని చూసి భయభ్రాంతులకు గురయ్యాడు. తనవైపుకి ఆ పులి ఒక అడుగు వేయగానే.. అది తననేమైనా చేస్తుందేమోనన్న భయంతో ఆ వ్యక్తి పరుగు లంకించాడు. దీంతో.. ఆ పులి అతడ్ని వెంబడించింది. దాని చేతికి చిక్కకుండా పారిపోవాలని ఆ వ్యక్తి సాయశక్తులా ప్రయత్నించాడు కానీ, ఫలితం లేకుండా పోయింది. చివరికి అతను ఆ పులి చేతికి చిక్కాడు. అయితే.. ఇక్కడ ఆ పులి అతడినేమీ వేటాడలేదు. శునకాలతో ఎలాగైతే సరదాగా ఆడుకుంటామో, అలాగే ఆ పులి అతడ్ని వెంబడించింది. ఈ వీడియో మొత్తంలో ఆ వ్యక్తి నవ్వుతూ కనిపించడాన్ని మనం గమనించవచ్చు.
అయితే.. నెటిజన్లు మాత్రం ఈ వీడియోపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పులి అడవికి చెందిందని, ఇలా చేయడం తప్పని, అది బొమ్మ కాదు ఓ అందమైన జంతువు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రకృతిలో స్వేచ్ఛగా విహరించాల్సిన ఈ జంతువుని ఇలా ఒక ఇంట్లో పెంపుడు జంతువుగా ఉంచుకోవడం సబబు కాదంటూ మండిపడుతున్నారు. కానీ.. మరికొందరు మాత్రం ఈ వీడియో చాలా ఫన్నీగా ఉందని చెప్తున్నారు. బిలియనీర్ల జీవనశైలి ఇలాగే ఉంటుందంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
Updated Date - Jan 15 , 2024 | 02:03 PM