India vs South Africa: చరిత్ర సృష్టించిన రెండో టెస్టు మ్యాచ్.. అత్యంత తక్కువ సమయంలోనే..
ABN, Publish Date - Jan 04 , 2024 | 07:08 PM
కేప్‌టౌన్‌లోని న్యలాండ్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండు టెస్టు క్రికెట్ మ్యాచ్ సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. కేవలం ఒకటిన్నర రోజుల్లో ఐదు సెషన్స్‌లోపే ముగిసిన ఈ మ్యాచ్..
కేప్‌టౌన్‌లోని న్యలాండ్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండు టెస్టు క్రికెట్ మ్యాచ్ సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. కేవలం ఒకటిన్నర రోజుల్లో ఐదు సెషన్స్‌లోపే ముగిసిన ఈ మ్యాచ్.. బంతుల పరంగా అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్‌గా చరిత్రపుటలకెక్కింది. ఈ మ్యాచ్ కేవలం 642 బంతుల్లోనే (107 ఓవర్లు) ముగిసింది. 147 ఏళ్లు టెస్టు క్రికెట్ చరిత్రలో ఏ ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఇంత తక్కువ బంతుల్లో ముగిసిన దాఖలాలు లేవు.
ఇంతకుముందు 1932లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరిగి మ్యాచ్ 656 బంతుల్లోనే ముగిసి.. అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్‌గా అగ్రస్థానంలో ఉండేది. ఇప్పుడు భారత్, సౌతాఫ్రికా రెండో టెస్టు మ్యాచ్ 14 బంతుల తేడాతో ఆ రికార్డ్‌ని బద్దలుకొట్టేసింది. ఇక 1935లో వెస్టిండీస్-ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచ్ 672 బంతుల్లోనూ, 1888లో ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ 788 బంతుల్లోనూ, 1888లో ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య లార్డ్స్‌లో జరిగిన మ్యాచ్ 792 బంతుల్లోనూ ముగిశాయి. దీంతో.. బంతుల పరంగా అత్యంత వేగంగా ముగిసిన టెస్టు మ్యాచ్‌ల్లో ఇవి వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచాయి.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు మహమ్మద్ సిరాజ్ (6/15) ధాటికి 55 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియా 153 పరుగులకి పరిమితం అయ్యింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో భాగంగా.. బుమ్రా 6/61) విజృంభణకు ప్రత్యర్థి జట్టు 176 పరుగులకే చాపచుట్టేసింది. తర్వాత 79 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు.. 12 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసి గెలుపొందింది. దీంతో.. ఈ టెస్టు సిరీస్ 1-1తో సమంగా ముగిసింది.
Updated Date - Jan 04 , 2024 | 07:08 PM