Aadhaar : ఆధార్.. అవస్థ!
ABN, Publish Date - Jan 08 , 2024 | 04:36 AM
ఆధార్ కార్డులో చిరునామా మార్చాలి.. పేరులో దొర్లిన చిన్న తప్పును సవరించాలి.. ఇతర డాక్యుమెంట్లలో ఉన్న విధంగా పుట్టిన తేదీ సరి చేయాలి.. సాధారణంగానైతే ఇందుకు పెద్దగా సమయం పట్టదు.
సవరణలకు రోజుల తరబడి పాట్లు
గతంలో రాష్ట్రంలో 1800 సెంటర్లు
ప్రస్తుతం 350 కన్నా తక్కువే
వాటిలో రోజుకు 50-60 టోకెన్లే
అర్ధరాత్రి నుంచే ప్రజల బారులు
ఇదివరకు మీ సేవల్లో మార్పులు
మూడేళ్ల క్రితం నిలిపివేసిన కేంద్రం
ప్రభుత్వ ఆఫీసుల్లోనే అవకాశం
సెంటర్లు పెంచాలన్నా.. విముఖత
తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనం
‘అభయహస్తం’తో సమస్య జటిలం
హైదరాబాద్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ఆధార్ కార్డులో చిరునామా మార్చాలి.. పేరులో దొర్లిన చిన్న తప్పును సవరించాలి.. ఇతర డాక్యుమెంట్లలో ఉన్న విధంగా పుట్టిన తేదీ సరి చేయాలి.. సాధారణంగానైతే ఇందుకు పెద్దగా సమయం పట్టదు. అధీకృత ఆధార్ కేంద్రానికి వెళ్తే ఒక గంటలోనే పూర్తవుద్ది. ఆన్‌లైన్‌లో అయితే అంతకంటే తక్కువ సమయమే పడుతుంది. కానీ, ఆన్‌లైన్‌పై ఎక్కువ మందికి అవగాహన లేకపోవడం, ఆధార్ కేంద్రాల సంఖ్య తక్కువగా ఉండడం వెరసి.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఉదయం ఆధార్ కేంద్రం తెరిచేటప్పటికే వందలాది మంది గుమిగూడుతున్నారు. ఎముకలు కొరికే చలిలోనూ అర్ధరాత్రి ఆ కేంద్రాల బయటే నిద్రిస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన అభయహస్తం పథకాలకు ఆధార్ కార్డును తప్పని సరి చేయడంతో కొన్ని రోజులుగా ఆధార్ కేంద్రాల వద్ద రద్దీ విపరీతంగా పెరిగింది. కాగా, విద్యాసంస్థల్లో ప్రవేశం పొందాలన్నా, ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేయాలన్నా.. ఆధార్ లేనిదే పని జరగడం లేదు. ఒకసారి ఆధార్ పొందినవారు అందులో వివరాలను మార్చుకునే అవకాశం ఉంది. గతంలో అన్ని మీసేవ కేంద్రాలు, అధీకృత ఆధార్ కేంద్రాల్లో కొత్త ఆధార్ కార్డుల జారీ, సవరణలకు అవకాశం ఉండేది. రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్ల మీసేవ కేంద్రాలు ఉండటంతో సవరణలు అప్పటికప్పుడే జరిగిపోయేవి. అయితే, విదేశీయులు సైతం ఆధార్ పొందుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్రం నియంత్రణ చర్యలు చేపట్టింది.
ప్రభుత్వేతర సంస్థలకు ఆధార్ సవరణ అనుమతులను రద్దుచేసింది. దీంతో మీసేవ కేంద్రాల్లో ఆధార్ సేవలు ఆగిపోయాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తేనే అనుమతులు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఆధార్ సవరణలకు కమీషన్ తక్కువగా ఉండటంతో ప్రభుత్వ కార్యాలయాల్లోకి వెళ్లేందుకు అత్యధికులు ఆసక్తి చూపలేదు. మూడేళ్ల క్రితం రాష్ట్రవ్యాప్తంగా 1800 ఆధార్ సవరణ కేంద్రాలు ఉండగా.. 700 మంది మాత్రమే ప్రభుత్వ కేంద్రాలకు మారారు. అయితే, చిన్నపాటి తప్పులకు ఈ కేంద్రాల అనుమతులనూ యూఐడీఏఐ రద్దు చేస్తూ పోతోంది. నిర్దేశించిన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయలేదన్న కారణాలతో లైసెన్సులను ఏడాదిపాటు డీయాక్టివేట్ చేస్తోంది. ఇలా రాష్ట్రంలో ప్రతినెలా 25-30 ఆధార్ కేంద్రాలను తొలగిస్తుండటంతో వీటి సంఖ్య నానాటికీ తగ్గుతోంది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆధార్ సవరణలకు అందుబాటులో ఉన్న కేంద్రాలు 350లోపే ఉన్నాయి. వీటిలో దాదాపు 150వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. ప్రజల సౌకర్యార్థం పోస్టాఫీసులు, బ్యాంకులు, ప్రభుత్వ బడుల్లో కొన్ని ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేశారని చెబుతున్నా.. ఎక్కడా పని చేస్తున్న దాఖలాలు లేవు. నెట్‌వర్క్ సమస్యలతో రోజుకు నాలుగైదు కంటే ఎక్కువ దరఖాస్తులు తీసుకోవడం లేదు.
రోజుకు 50-60 మందికే అవకాశం
ప్రస్తుతం ఉన్న ఆధార్ కేంద్రాల్లోనూ రోజుకు గరిష్టంగా 50-60 మందికే సవరణలు చేయగలుగుతున్నారు. దీంతో ఉదయం 10 గంటలకు కేంద్రం తెరిచేలోపే వందలాది మంది బారులుదీరుతున్నారు. పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తుండడంతో పలు కేంద్రాల వద్ద గొడవలు నిత్యకృత్యంగా మారాయి. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ దోమలగూడ ఆధార్ కేంద్రంలోని ఆపరేటర్‌పై ప్రజలు దాడి చేశారు. జిల్లాల్లో భారీ రద్దీని నియంత్రించేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇన్ని వ్యయప్రయాసలు ఎదుర్కొని ఆధార్ సవరణలకు దరఖాస్తు చేసినా.. దానిని ఆమోదిస్తారన్న గ్యారెంటీ ఉండట్లేదు. అన్ని డాక్యుమెంట్లు సమర్పించినా.. తిరస్కరణకు గురవుతున్నాయి.
మాదాపూర్‌లో స్లాట్ బుకింగ్ రద్దు
గతంలో ప్రజల సౌకర్యార్థం మాదాపూర్, మూసారాంబాగ్ ఆధార్ కేంద్రాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని యూఐడీఏఐ ప్రవేశపెట్టింది. మూసారాంబాగ్‌లో రోజుకు 500మందికి అవకాశం ఉండగా, మాదాపూర్‌లో అత్యధికంగా 2000 మంది స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉండేది. అయితే, ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా నెల క్రితం మాదాపూర్ కేంద్రంలో స్లాట్ బుకింగ్ విధానాన్ని అకస్మాత్తుగా రద్దు చేశారు. దీంతో అక్కడికి వెళ్లి క్యూలో నిలబడి సేవలు పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం వెళ్తే సాయంత్రానికి గానీ తమ వంతు రావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక, మూసారాంబాగ్ కేంద్రంలో స్లాట్ బుకింగ్ అవకాశం ఉన్నా.. వచ్చే 60 రోజులకు సంబంధించిన బుకింగ్‌లు ఫుల్ అయిపోయాయి. వాస్తవానికి మీసేవ కేంద్రాల నుంచి ఆధార్ సేవలను తొలగిస్తూ మూడేళ్ల క్రితం కేంద్రం నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచే మిగతా కేంద్రాల వద్ద రద్దీ పెరిగిపోయింది. ఆధార్ కేంద్రాలను పెంచాలని, మరిన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆధార్ కేంద్రాలను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రెండేళ్ల క్రితం రాష్ట్రం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. కానీ.. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
హైకోర్టు తీర్పుతో కాస్త ఊరట
రాష్ట్రంలో ఆధార్ సేవలు అందిస్తున్న కేంద్రాలు ఇప్పటికే తక్కువ ఉండగా, పలు తప్పులు చేశారన్న కారణంగా ప్రతి నెలా కొన్ని కేంద్రాలను యూఐడీఏఐ రద్దు చేస్తూ పోతోంది. ఆధార్ కేంద్రాల్లో పని చేసే ఆపరేటర్లకు యూఐడీఏఐ ప్రత్యేక బయోమెట్రిక్ సాఫ్ట్‌వేర్ యాక్టివేట్ చేస్తుంది. దాని ఆధారంగానే ఆధార్‌లో సవరణకు అవకాశం ఉంటుంది. అయితే, సదరు ఆపరేటర్ ఉద్యోగం మానేస్తే మరో అపరేటర్‌కు బయోమెట్రిక్ యాక్టివేషన్ చేయడం లేదు. అలాగే, ఆయా కేంద్రాల్లోని డెస్క్‌టాప్, ల్యాప్‌టా్‌పలకు యూఐడీఏఐ ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేస్తుంది. ఒక వేళ అవి మరమ్మతుకు గురైతే.. మరో డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టా్‌పకు సాఫ్ట్‌వేర్ మార్చడం లేదు. ఇలా.. ఏడాది కాలంలో 400 కేంద్రాల అనుమతులను యూఐడీఏఐ రద్దు చేసింది. దీనిపై మీసేవ నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించగా.. గత నెలలో సానుకూలంగా తీర్పువచ్చింది. సిస్టమ్, ఆపరేటర్ మార్పు కారణంగా రద్దుచేసిన లైసెన్సులను పునరుద్ధరించాలన్న ఆదేశాలతో గత నెలలో 50-60కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో మరిన్ని అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.
Updated Date - Jan 08 , 2024 | 04:36 AM