నిరాశలో పత్తి రైతు
ABN, Publish Date - Jan 04 , 2024 | 10:34 PM
పత్తి రైతుకు ఈయేడు కాలం కలిసి రాలేదు. రెండేళ్ల పాటు లాభాలు పండించిన రైతులు ఈసారి నష్టాలు చవి చూస్తున్నారు. వేలకు వేలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే ప్రతికూల వాతావరణంతో అంతంత మాత్రమే దిగుబడులు వచ్చాయి. వచ్చిన పంటను అమ్ముకునేం దుకు ధర లేకపోవడంతో దిగాలు పడిపోతున్నారు.
నెన్నెల, డిసెంబరు 4: పత్తి రైతులు కుదేలవుతున్నాడు. పత్తి ధర రోజురోజుకు పడిపోతోంది. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం క్వింటాల్ పత్తి ధర రూ. 6500లు ఉంది. గ్రామాల్లో వ్యాపారులు రూ.6 వేలకే కొనుగోలు చేస్తున్నారు. గతేడాది రూ. 10వేల వరకు, 2022లో రూ.12 వేలకు పలికింది. ఈయేడు అవే ధరలు కొనసాగుతాయని ఆశించిన రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. వాతావరణ పరిస్థితులు, చీడపీడలు దాడితో దిగుబడులు అంతంత మాత్రమే వచ్చాయి. పెట్టిన పెట్టుబడుల దృష్ట్యా ప్రస్తుతం లభిస్తున్న ధర గిట్టుబాటు కాదని రెతులంటున్నారు.
-ధర లేక దిగులు...
దిగుబడి తగ్గితే ధర పెరుగుతుంది. దిగుబడి పెరిగితే దర తగ్గుతుంది ఇది సాధారణ మార్కెట్ సూత్రం. పత్తి కొనుగోళ్ల విషయంలో ఈ సూత్రం తిరగబడింది. పత్తి దిగుబడి తగ్గినప్పటికి ధర మాత్రం పెరగడం లేదు. రోజు రోజుకు ధర పడిపోతోంది. గతేడాది క్వింటాల్ రూ.10 వేల పైనే పలికిన ధర ఈ ఏడు రూ.6500లకు పడిపోయింది. సీజన్ ప్రారంభంలో మురిపించిన ధర రోజురోజుకు పతనమవుతోంది. సీజన్ ప్రారంభంలో క్వింటాలుకు రూ.8 వేలు పలికింది. రూ.పది వేల వరకు చేరుతుందని ఆశించిన రైతులకు నిరాశే ఎదురైంది. ప్రభుత్వ మద్దతు ధర రూ. 7020 ఉండగా ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో పత్తి రూ.6500 పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ పడిపోతున్నదని వ్యాపారులు అంటున్నారు. ఫలితంగా ఇక్కడి పత్తికి ధర తగ్గుతున్నదని చెబుతున్నారు. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పత్తి అమ్మకాలు జోరందుకోవ డంతో ధరపై ప్రభావం పడుతున్నదని జిన్నింగ్ మిల్లర్లు అంటున్నారు. పత్తి బేళ్లు, గింజల ధర పడిపోవడం మరో కారణంగా చెబుతున్నారు.
-అంతంతమాత్రపు దిగుబడులు
జిల్లాలో ఈయేడు 1.55 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. సీజన్ ప్రారంభంలో మురిపించిన వర్షాలు ఆ తరువాత ముఖం చాటేశాయి. పత్తి చేన్లు సరిగ్గా ఎదగలేదు. చీడపీడల దాడితో ఎకరాలకు ఎకరాల చేలల్లో కాయలు పుచ్చిపోయాయి. మరి కొన్ని చోట్ల లూజు విత్తనాలు వేసిన చేలల్లో మొక్కలు ఏపుగా పెరిగాయి. పూత, కాత అంతంత మాత్రంగా వచ్చింది. అష్టకష్టాలు పడి తెగుళ్ల బెడదను తప్పించుకు న్నారు.ఎకరానికి 10 నుంచి 13 క్వింటాళ్ల దిగుబడి రావాల్సింది... ఆరు.. ఏడు క్వింటాళ్లకు పైబడి రావడం లేదని రైతులంటున్నారు.
- పెరిగిన పెట్టుబడి
పత్తి పంటలో ఖర్చులు భారీగా పెరిగాయి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీలు, యంత్రాల కిరాయి రూపంలో పెట్టుబడులు రెట్టింపయ్యాయి. దుక్కి దున్నడం నుంచి పత్తి సేకరించే వరకు ఎకరానికి రూ.50 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఎన్నడు లేనిది ఈ సారి గులాబీ రంగు పురుగు, లద్దెపురుగు సోకడంతో నివారణ ఖర్చు మరింత పెరిగింది. పెట్టుబడి తడిసిమోపెడు కాగా అందుకు తగ్గ ధర అందక రైతులు కుంగిపోతున్నారు. స్థానికంగా కూలీల కొరత ఉండటంతో పొరుగు రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకురావాల్సి వచ్చింది. వారికి కిరాయిలు, నిత్యావసర వస్తువులు, బస ఏర్పాట్లు తలకు మించిన భారంగా మారింది. క్వింటాలు పత్తి సేకరణకు రూ. వెయ్యి నుంచి రూ. 1200ల వరకు చెల్లించాల్సి వస్తోంది. వీటన్నింటికి తోడు ఎకరానికి రూ.10 వేలు ఉన్న కౌలు ధర రూ. 16 వేల వరకు పెరిగింది. అన్ని పెరిగినప్పటికి పత్తి ధర మాత్రం పెరగలేదు. పత్తి ధర క్వింటాలుకు రూ.10 వేల పైబడి ఉంటేనే కొంత లాభం ఉంటుందని రైతులంటున్నారు.
- సీసీఐతో ఇబ్బందులు
బహిరంగ మార్కెట్లో పత్తికి డిమాండ్ లేక ప్రస్తుతం సీసీఐ ద్వారా కొనుగోళ్లు సాగుతున్నాయి. ప్రభుత్వ మద్దతు ధర రూ.7020 ఉంది. గిట్టుబాటు ధర పొందాలంటే సీసీఐ నిబంధనలు పాటించాలి. తేమ శాతం 8 కంటే ఎక్కువ ఉంటే ధరలో కోతలు విధిస్తున్నారు. రైతు గుర్తిం పు కార్డు తప్పనిసరి, ఆధార్, ఫోన్ నంబరు అనుసంధానమైన బ్యాంకు ఖాతా ఉండాలని అంటున్నారు. పత్తి సాగు చేసిన రైతుల్లో కొందరివి ఆన్‌లైన్‌లో వేరే పంటలుగా నమోదయ్యాయి. అలాంటి రైతుల పత్తిని అధికారులు తిరస్కరిస్తున్నారు. వ్యవసాయ అధికారులతో ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని కోరుతున్నారు. కౌలు రైతులు పత్రాలు లేక సీసీఐలో అమ్ముకోలేక పోతున్నారు. ప్రభుత్వ సెలవు దినాలతో పాటు ఒక్కోసారి ఐదేసి రోజులు కొనుగోళ్లు నిలిపి వేస్తుండటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రూ. 10 వేలు ఉంటేనే గిట్టుబాటు
-కొండపల్లి శరత్, రైతు, నందులపల్లి
సాగు పెట్టుబడులు రెట్టింపయ్యాయి. కూలీల ధర పెరిగింది. కౌలుఽ, ఎరువులు, పురుగు మందులు ఇలా అన్నింటికి ధరలు పెరుగుతున్నాయి. పత్తి ధర మాత్రం పెరగడం లేదు. నిరుడు క్వింటాలుకు రూ.9 వేలకు పైనే పలికింది. ఈసారి కూడా ధర పెరుగుతుందని ఎదురు చూస్తున్నాం. ధర రోజురోజుకు తగ్గుతోంది. అంతంత మాత్రపు వచ్చిన దిగుబడులతో పెట్టుబడి సైతం రావడం లేదు.
Updated Date - Jan 04 , 2024 | 10:35 PM