నల్లగొండను ఎండబెడతారా..? : జూలకంటి
ABN, Publish Date - Jan 30 , 2024 | 11:57 PM
ఇతర జిల్లాలకు సాగర్ నీరు వీడుదల చేసి నల్లగొండను ఎండబెడతారా అని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రశ్నించారు.
మిర్యాలగూడ, జనవరి 30: ఇతర జిల్లాలకు సాగర్ నీరు వీడుదల చేసి నల్లగొండను ఎండబెడతారా అని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌కు తాగునీరు, ఖమ్మం జిల్లా పాలేరుకు ఎడమకాల్వ ద్వారా నీరు విడుదల చేసేందుకు చర్యలు చేపడుతూ ప్రాజెక్టు ఉన్న నల్లగొండ జిల్లాను ఎండబెట్టడం సరికాదన్నారు. నల్లగొండ జిల్లా ప్రజలకు సాగునీటి, తాగునీటి ఎద్దడి రాకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా మంత్రులపై ఉందన్నారు. ఎస్‌ఎల్‌బీసీ కింద నల్లగొండ, నకిరేకల్ ఎడమకాల్వకింద నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లోని వారికి ప్రయోజనం కలుగుతుందన్నారు. రైతులు బోరుబావుల కింద సాగుచేసిన వరి పొలాలు పొట్టదశలో నీరు లేక ఎండిపోతున్నాయన్నారు. పంటను రక్షించుకోకుంటే రైస్‌మిల్లులు మూతపడే ప్రమాదం ఉందన్నారు. బియ్యం ధరలు పెరిగి సామాన్యులకు భారంగా మారుతోందన్నారు. గతంలో సాగర్ నీటిమట్టం 505అడుగులు ఉన్నప్పుడు కూడా ఎడమకాల్వకు నీరు విడుదల చేసి చెరువులు కుంటలు నింపిన సంఘటనలు ఉన్నాయని గుర్తుచేశారు. ప్రస్తుతం 520అడుగులు ప్రాజెక్టులో నీరు ఉన్నందున పది రోజులపాటు సాగర్ ఎడమకాల్వకు, ఎస్‌ఎల్‌బీసీ, వరదకాల్వలకు నీరు విడుదల చేసి చెరువులను, కుంటలను నీటితో నింపాలన్నారు. పలు చోట్ల మిషన్‌భగీరథ నీరందక ప్రజలకు తాగునీటి కొరత ఏర్పడుతుందన్నారు. ఎడమకాల్వ ద్వారా చెరువులను నింపితే భూగర్భ జలాలు పెరిగి బోరుబావుల కింద సాగు చేసిన పొలాలను రక్షించవచ్చునని అన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలను కలిసి చర్చించినట్లు తెలిపారు. ఎడమకాల్వపై నున్న మేజర్, మైనర్ కాల్వల తూముల వద్ద అధికారులను కాపలాఉంచి ఖమ్మం జిల్లా పాలేరుకు తరలిస్తామనడం సరికాదన్నారు. నల్లగొండ జిల్లాలోని చెరువులను సాగర్ నీటిద్వారా నింపేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2న సాగర్‌లోని ప్రాజెక్టు సీఈ కార్యాలయం ఎదుట జరిగే ధర్నాకు జిల్లా వ్యాప్తంగా రైతులు కదిలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర నాయకుడు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, తిరుపతి రాంమూర్తి, జగదీశ్‌చంద్ర, రాగిరెడ్డి మంగారెడ్డి, భావాండ్ల పాండు, వినోద్‌నాయక్, పరుశరాములు, పగిడోజు రాంమూర్తి, పాపానాయక్ పాల్గొన్నారు.
Updated Date - Jan 30 , 2024 | 11:57 PM