రేవంత్ తలకిందులుగా తపస్సు చేసినా రాహుల్ ప్రధాని కాలేరు
ABN, Publish Date - Feb 04 , 2024 | 05:04 AM
సీఎం రేవంత్‌రెడ్డి తలకిందులు తపస్సు చేసినా రాహుల్‌గాంధీ ప్రధాని కాలేరని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
ఢిల్లీలో ప్రశ్నించే గొంతుక బీఆరెస్సే
ఆటో డ్రైవర్లకు నెలకు 10వేలివ్వాలి: హరీశ్
భద్రాచలం, ఫిబ్రవరి 3: సీఎం రేవంత్‌రెడ్డి తలకిందులు తపస్సు చేసినా రాహుల్‌గాంధీ ప్రధాని కాలేరని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ హక్కులు కాపాడాలన్నా, కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను అమలు చేయించాలన్నా, ఢిల్లీలో పోరాటం చేయాలన్నా ప్రశ్నించే గొంతుక బీఆరేస్సేనని తెలిపారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు మెజార్టీ అందించాలని ప్రజలను కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శనివారం నిర్వహించిన బీఆర్‌ఎస్ అసెంబ్లీ నియోజకవర్గ సమావేశంలో హరీశ్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బీజేపీని నిలువరించే శక్తి తృణమూల్ కాంగ్రెస్, ఆప్, బీఆర్‌ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీలకే ఉందన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా తాము ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పజెప్పలేదని, కానీ నేడు ప్రాజెక్టులన్నీ అప్పజెప్పి రాష్ట్రానికి అధికారం లేకుండా చేశారని విమర్శించారు. దీంతో ఖమ్మం, నల్లగొండ, మహబూబూబ్‌నగర్, హైదరాబాద్ జిల్లాల వాసులకు తాగునీటి సమస్య ఎదురుకానుండగా నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయుకట్టుకు నీళ్లందకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆదిలాబాద్‌లో తమ ప్రభుత్వం ఏం చేసిందో గ్రామాల్లోకి వెళ్లి చూడాలని సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు. ఆ జిల్లాలో నాలుగు వైద్య కళాశాలలు, ఇంటింటా తాగునీటి సౌకర్యం, తండాలను జీపీలుగా మార్చిన ఖ్యాతి బీఆర్ ఎ్‌సకే దక్కుతుందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణమంటే తిట్ల పురాణమా అని ప్రశ్నించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి వాడని అనాగరిక, అసభ్యకర భాషను రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం పరువు తీస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్లు నెలవారీ లోన్ వాయిదాలు కట్టలేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని, ఇప్పటికే 12 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం నెలకు రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం, రాష్ట్ర మంత్రులు రెచ్చగొట్టినా తాము రెచ్చిపోమని, తాము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పటికీ ప్రజాపక్షమేనని ఆయన స్పష్టం చేశారు.
Updated Date - Feb 04 , 2024 | 05:04 AM