40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Govt land Kabja: అధికారుల సహకారంతో ప్రభుత్వ భూమికి ఎసరు

ABN, Publish Date - Jan 17 , 2024 | 03:44 AM

హైదరాబాద్‌ నడిబొడ్డున ప్రభుత్వ భూమిలోంచి అడ్డగోలుగా ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టుకు రోడ్డు వేస్తున్నారు.

Govt land Kabja: అధికారుల సహకారంతో ప్రభుత్వ భూమికి ఎసరు

అధికారుల సహకారంతో ప్రభుత్వ భూమికి ఎసరు

కొండలు తొలిచి, చెరువును పూడ్చి ప్రైవేటు రోడ్డు

బయో డైవర్సిటీ పార్కుకు కూతవేటు దూరంలోనే

రోడ్డేసిన మూడెకరాల భూమి విలువ 450 కోట్లు

మిగిలిన నాలుగెకరాలకు రెక్కలు వచ్చే అవకాశం

ఎన్నికల కోడ్‌ సమయంలో మొదలైన పనులు

ప్రభుత్వం మారినా కొనసాగుతున్న సహకారం

లక్షల మంది చూస్తుండగా కొండలు తొలుస్తున్నా

మాకేం తెలియదంటూ అధికారులంతా మౌనం

అన్ని శాఖల్లోనూ అక్రమ రోడ్డుపై దాటవేత వైఖరే

గత సర్కారులో మంత్రి బామ్మర్దికి ప్రాజెక్టుతో లింకు

ఆయన నివాసం కూడా అందులోని విల్లాల్లోనే

హైదరాబాద్‌ సిటీ, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ నడిబొడ్డున ప్రభుత్వ భూమిలోంచి అడ్డగోలుగా ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టుకు రోడ్డు వేస్తున్నారు. రోజూ లక్షల మంది చూస్తుండగా కొండలను తొలిచి అడ్డగోలుగా రోడ్డు నిర్మిస్తున్నా అక్కడేం జరగనట్లు రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖ అధికారులు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికల కోడ్‌ వచ్చిన తర్వాత మొదలైన ఈ కబ్జాపర్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నెల రోజులుగా కొనసాగుతోంది. ప్రభుత్వ భూమిలో వంద అడుగుల మేర 400 మీటర్ల పొడవున కొండలు తొలుస్తూ శరవేగంగా రోడ్డు పనులు జరుగుతున్నాయి. అధికారులను ఎవర్ని అడిగినా మేమెలాంటి అనుమతులు ఇవ్వలేదు అంటున్నారు. రోడ్డు పనులు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. రూ.450 కోట్ల విలువైన మూడెకరాల ప్రభుత్వ భూమి ప్రైవేటు కంపెనీసొంత రోడ్డుగా మారుతోంది. ఈ క్రమంలో భారీ ఎత్తున పర్యావరణ విధ్వంసం జరుగుతోంది. దివ్యమైన భవనాలకు పేరొందిన ప్రముఖ నిర్మాణ సంస్థ రియాల్టీ ప్రాజెక్టు ఇది. హైదరాబాద్‌ నడిబొడ్డున బయో డైవర్సిటీ పార్క్‌ జంక్షన్‌కు కూతవేటు దూరంలో ఉంది. ఈ ప్రాజెక్టులో ఇప్పటికే పలు ఐటీ టవర్లలో పలు దేశీ, విదేశీ కంపెనీలకు చెందిన వేలమంది సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు పని చేస్తున్నారు. ఈ టవర్లు 24 గంటలూ సందడిగా ఉంటాయి. టవర్లకు వెనుకనే కొండమీద ఈ సంస్థకే విల్లాల ప్రాజెక్టు కూడా ఉంది.

ఆ రెండింటికీ కలిపి ఇప్పుడు ప్రభుత్వ భూమిలో అక్రమంగా కొత్త రోడ్డు వేస్తున్నారు. ఎవరు వేస్తున్నారో తెలీదు. ప్రభుత్వ శాఖలలో ఎవర్ని అడిగినా ‘మేం అనుమతి ఇవ్వలేదు. మాకు సంబంధం లేదు’ అంటున్నారు. నిజానికి ఈ రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టుకు ఓల్డ్‌ బాంబే హైవే మీద ఒక దారి ఉంది. ప్రకృతి రమణీయమైన చెరువు పక్క నుంచి మరో రోడ్డు కోసం గత ప్రభుత్వ హయాంలో పావులు కదిపారు. నిజానికి ఈ రోడ్డుకు సంబంధించిన అనుమతులేవీ రాలేదు. ప్రభుత్వంలోని ఏ శాఖ కూడా ఈ రోడ్డు పని చేపట్టడం లేదు. కానీ, ఎన్నికల కోడ్‌ మొదలైనప్పటి నుంచి శరవేగంగా పనులు జరుగుతున్నాయి. చుట్టూ ఉన్న రద్దీ రోడ్ల మీద వెళుతున్న లక్షల మంది ప్రజలకు కళ్లకు రోడ్డు పనులు కనిపిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల అధికారులు మాత్రం అసలు విషయమే తెలియనట్లు నటిస్తున్నారు. ఆంధ్రజ్యోతి ప్రతినిధి అడిగినపుడు, ‘‘అవునా, పనులు జరుగుతున్నాయా? మాకు తెలీదు. మేమైతే అనుమతి ఇవ్వలేదు’’ అని తప్పించుకుంటున్నారు. జమానా మారినా గత ప్రభుత్వ హయాంలో వేళ్లూనుకున్న వ్యవస్థ చెక్కు చెదరకుండా పని చేస్తోందని ఖాజాగూడ పెద్ద చెరువును కాపాడేందుకు కృషి చేస్తున్న పర్యావరణ ప్రేమికులు అంటున్నారు.

గత నాలుగేళ్లుగా పెద్ద చెరువు విధ్వంసం

చుట్టూ కొండలు... మధ్యలో చెరువు.... నగరం మధ్యలో ఖాజాగూడ పెద్ద చెరువు ఒక రహస్య ప్రదేశంలా ఉండేది. వర్షాకాలంలో కొండలు, గుట్టల నుంచి చెరువులోకి ఉరుకులు పెట్టే సెలయేళ్లతో ప్రకృతి రమణీయతకు నెలవుగా ఉండేది. ఇక్కడ వివిధ సర్వే నంబర్లలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూమి ఉంది. 2020లో కరోనా సమయంలో ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీ మీదుగా ఓల్డ్‌ బాంబే హైవే నుంచి ఢిల్లీ పబ్లిక్‌ స్కూలుకు నేరుగా నాలుగు లేన్ల రోడ్డు వేశారు. దీనిచుట్టూ ఉన్న ప్రైవేటు భూముల్లో అనేక ఐకానిక్‌ టవర్లు వచ్చాయి. అటు కొండలు, ఇటు చెరువు, మధ్యలో రోడ్డుతో ఖాజాగూడ పెద్ద చెరువు ప్రాంతం నక్లెస్‌ రోడ్డు తరహాలో పర్యాటక ప్రదేశంగా మారిపోయింది. అర్ధరాత్రి వరకు పెద్దఎత్తున ఐటీ ఉద్యోగులు ఈ రోడ్డుపైనే పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం గమనించవచ్చు. ఐటీ కారిడార్‌లో ఆకాశాన్ని తాకే హార్మ్యాల మధ్య బయో డైవర్సిటీ జంక్షన్‌కు సమీపంలోనే పర్యావరణ సమతుల్యతను పాటించే విధంగా ఖాజాగూడ పెద్ద చెరువు, కొండలు గుట్టలుంటాయి. ఇలాంటి చోట పర్యావరణ విధ్వంసం సాగుతోంది. ఇప్పటికే సుందరీకరణ పేరుతో చెరువు చుట్టూ బండ్‌, వాకింగ్‌ ట్రాక్‌ నిర్మించి చెరువును కొంత పూడ్చేశారు. ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులు ఎన్నో ఏళ్ల చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తున్న కొండలు, గుట్టలను విల్లాల రోడ్డు కోసం తొలగిస్తున్నారు. అదంతా ప్రభుత్వ భూమేనని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. నెల రోజులుగా నిరాటంకంగా పనులు జరుగుతున్నా రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, మైనింగ్‌, ఇరిగేషన్‌ అధికారులు మాట్లాడటం లేదు. పనులు ఆపే ప్రయత్నం చేయడం లేదు. కనీసం నోటీసులిచ్చేందుకు కూడా ముందుకు రావడం లేదు.

ప్రభుత్వ భూమిలో ప్రైవేటు పాగా

పెద్ద చెరువుకు తూర్పు వైపున కొండలను ఆనుకుని దివ్యమైన భవనాల రియాల్టీ కంపెనీకి పలు ఐటీ టవర్లు, గేటెడ్‌ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టు ఉన్నాయి. వాక్‌ టూ వర్క్‌ పేరుతో ఈ నిర్మాణాలు చేపట్టింది. వాటికి తూర్పున బాంబే హైవే నుంచి రోడ్డు ఉంది. వెనుక భాగాన కొంత వరకు ప్రభుత్వ భూమి, ఖాజాగూడ పెద్ద చెరువు శిఖం భూమి ఉన్నాయి. ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న రోడ్డు గేటెడ్‌ కమ్యూనిటీ విల్లాలకు, ఐటీ కంపెనీకి వెనుక నుంచి ప్రత్యామ్నాయ మార్గం కోసమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రాంతం రాయదుర్గం పాయగా రెవెన్యూ పరిధిలో ఉంది. ఇక్కడ సర్వే నెంబర్‌ 66లో 109 ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని ధరణిలో నిషేధిత జాబితాలో ఉంచారు. 66/7, 66/8, 66/9, 66/10, 66/11 సర్వే నెంబర్లలో చెరువు, చెరువు శిఖం, కొండలు, గుట్టల రూపంలో ప్రభుత్వ భూమి ఉంది. ధరణి ప్రకారం ఈ భూమిని అమ్మడానికి వీల్లేదు. ఏడు ఎకరాల్లో అచ్చం కొండలే ఉన్నాయి. ఈ కొండలు గేటెడ్‌ విల్లాలు, ఐటీ టవర్లకు ఆనుకొని ఉంది. ఇప్పుడా ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అందులో భాగంగానే తొలుత మూడు ఎకరాలను రోడ్డు పేరుతో ఆక్రమిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మిగతా నాలుగు ఎకరాలూ ఏదో విధంగా తీసేసుకుంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బావమరిది చొరవతో

గత ప్రభుత్వంలో కీలక మంత్రికి బావమరిది కుటుంబం ఈ రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టు విల్లాల్లోనే నివాసం ఉంటోంది. అతని చొరవ వల్లే ప్రభుత్వ భూమిలో రోడ్డు వేయడానికి అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల నుంచి పరోక్ష సహకారం అందుతోందన్న ఆరోపణ కూడా ఉంది. నిజానికి ఈ విల్లా ప్రాజెక్టుల మీదుగా గతంలో ఎయిర్‌పోర్డు మెట్రో రైలు ప్రాజెక్టు మంజూరైంది. దాంతోపాటు లింక్‌ రోడ్డు కూడా ప్లాన్‌ చేశారు. ఖాజాగూడ కొండలు హెరిటేజ్‌ సైట్‌ కావడంతో న్యాయ సమస్యలు ఉంటాయని గ్రహించి మెట్రో అధికారులు చెరువు పక్క నుంచి మెట్రో ఆలోచనను విరమించుకున్నారు. దాంతోనే లింకు రోడ్డు కూడా కనుమరుగైంది. ఇది ముందే గ్రహించిన ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వం ఉండగానే కనీసం రోడ్డునన్నా దక్కించుకుందామని పావులు కదిపారని అంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చీ రాగానే ప్రభుత్వ భూమిలో నుంచి కొండలు, గుట్టలను తొలిచేస్తూ రోడ్డు నిర్మాణ పనులు మొదలెట్టారు. ప్రముఖ నిర్మాణ సంస్థతో పాటు మాజీ మంత్రి బావమరిది కూడా కీలకంగా వ్యవహరించడం వల్లే అధికారులు మౌనంగా ఉంటున్నారని అంటున్నారు. రోడా మిస్త్రీ కళాశాల నుంచి విల్లా ప్రాజెక్టు, ఐటీ టవర్ల రోడ్డును కలుపుతూ పనులు జరుగుతున్నాయి. చెరువు వద్ద ఏకంగా ఔట్‌ పోస్టు ఏర్పాటు చేసి ఎవర్నీ రోడ్డు పనులు జరిగే ప్రభుత్వ భూమి లోపలికి రానివ్వకుండా సాయుధులను నియమించారు. మీకేం పని అని అంటూ అటుగా వచ్చిన వాళ్లను గదమాయించి పంపేస్తున్నారు.

వాకింగ్‌ ట్రాక్‌ పేరుతో పూడ్చేశారు

ఖాజాగూడ పెద్ద చెరువు చుట్టూ జీహెచ్‌ఎంసీ, సాగునీటి శాఖ అధికారులు సుందరీకరణ పేరుతో వాకింగ్‌ ట్రాక్‌ నిర్మాణం చేపట్టారు. రోడా మిస్త్రి కళాశాల నుంచి రెండు కిలోమీటర్ల పొడవున 30 అడగుల వెడల్పుతో వాకింగ్‌ ట్రాక్‌ నిర్మాణం కోసం ఇప్పటికే పెద్దఎత్తున చెరువును పూడ్చేశారు. ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ ప్రకారం ఖాజాగూడ పెద్ద చెరువు విస్తీర్ణం 38 ఎకరాలు. రాళ్లు, మట్టి చుట్టురా పోయడంతో అది కుంచించుకుపోతోంది. దీనిపై ఇప్పటికే పలువురు పర్యావరణవేత్తలు ఆందోళన చేపట్టారు. కోర్డులను ఆశ్రయించారు.

ఏ శాఖ అనుమతి లేదు

ప్రస్తుతం రోడ్డు పనులు జరుగుతున్న చోట ఎకరం విలువ కనీసం రూ.150 కోట్లు ఉంటుంది. వంద అడుగుల రోడ్డు 400 మీటర్ల పొడవున నిర్మిస్తున్నారు. అంటే కనీసం మూడు ఎకరాలు. రూ.450 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి. పైగా హెరిటేజ్‌ విలువ కలిగిన కొండలను తవ్వేస్తున్నారు. ప్రైవేటు స్థలంలో చిన్న నిర్మాణం చేపట్టాలన్నా ప్రభుత్వ అనుమతులు అవసరం. ప్రయివేటు భూమిలో రోడ్డు వేయాలన్నా అనుమతి ఉండాలి. ఈ రోడ్డుకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.

ఇది ప్రయివేటుదే అనుకున్నా రోడ్డుకు అనుమతి ఉండాల్సిందే. పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీసే పనులకు అనుమతి విషయంలో మరింత జాగ్రత్త పాటించాలి. ఆ కోణంలో అధికారులెవరూ జోక్యం చేసుకోవడం లేదు. ప్రభుత్వ భూమిలో ఎలా రోడ్డు వేస్తారని కనీసం ప్రశ్నించి నోటీసులిచ్చే వారు కరువయ్యారు.

విల్లాలకు రోడ్డు వేస్తున్నారు

పెద్ద చెరువు ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ లోపల వాకింగ్‌ ట్రాక్‌ పేరుతో ఇప్పటికే పూడ్చేశారు. దీనిపై హైకోర్టులో పిల్‌ వేశాను. హైకోర్టులో విచారణ సాగుతోంది. ఎన్నికల ముందు సర్వే చేసి హైకోర్టుకు నివేదిక కూడా ఇచ్చాను. దీనికి అదనంగా ఇప్పుడు రోడామిస్త్రీ కాలేజీ నుంచి చెరువు లోపల భాగం నుంచి విల్లాల వైపు రోడ్డేస్తున్నారు. విల్లాలకు ఈ రోడ్డును అనుసంధానం చేస్తున్నారు. పెద్ద చెరువు వెంట వ్యక్తుల ప్రయోజనం కోసం సాగుతున్న విధ్వంసాన్ని వెంటనే ఆపాలి. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం చెరువును కాపాడే విధంగా చర్యలు చేపట్టాలి.

- సోల్‌ కన్వీనర్‌ లుబ్నా సారవత్‌,

పర్యావరణ ఉద్యమకారిణి ఎవరికి భూమిని కేటాయించలేదు

ఖాజాగూడ పెద్ద చెరువును ఆనుకొని ఉన్న కొండల ప్రాంతంలో రోడ్డు నిర్మాణం కోసం ఎవరికి భూమిని సర్వే చేసి ఇవ్వలేదు. ఎవరికి భూమిని కేటాయించలేదు.

-మహేష్‌, సర్వేయర్‌, శేరిలింగంపల్లి మండలం.

మాకు సంబంధం లేదు

చెరువు, చెరువు శిఖం మాత్రమే మా పరిధిలోకి వస్తుంది. చెరువు పక్కన ఉన్న కొండ ప్రాంతంలో జరిగే ఇతర పనులతో మాకు సంబంధం లేదు. అక్కడ జరుగుతున్న రోడ్డు పనులు మా శాఖ పరిధిలోకి రావు.

- నాగరాజు, ఏఈ, ఇరిగేషన్‌ విభాగం

మాకెవరూ చెప్పలేదు

ఖాజాగూడ పెద్ద చెరువు పక్కన కొండలపై రోడ్డు నిర్మాణానికి సంబంధించి జీహెచ్‌ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ భూసేకరణ విభాగానికి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. మేమైతే అక్కడ ఎలాంటి సర్వేలు చేపట్టలేదు. ఆ రోడ్డు మేం వేయడం లేదు.

-రవీందర్‌, సెక్షన్‌ ఇన్‌చార్జి, టౌన్‌ ప్లానింగ్‌

విభాగం, జీహెచ్‌ఎంసీ, సర్కిల్‌-20 రోడ్డు నిర్మాణ ప్రతిపాదనలు లేవు

హైదరాబాద్‌ రోడ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో పెద్ద చెరువు కొండలపైఎలాంటి రోడ్డు నిర్మాణ పనులను చేపట్టలేదు. ఆ ప్రాంతంలో అలాంటి ప్రతిపాదనలు ఏమీలేవు.

-విక్రమ్‌, డీఈ, హెచ్‌ఆర్‌డీసీ

Updated Date - Jan 17 , 2024 | 08:08 AM

Advertising
Advertising