Gulf Stream: ముంచుకొస్తున్న మంచు యుగం?
ABN, Publish Date - Feb 16 , 2024 | 05:12 AM
ఈ ప్రపంచం ఇంత అందంగా, కులాసాగా కనిపిస్తోందంటే.. ఎండ, వాన, చలి, ఇన్ని రుతువులు వస్తున్నాయి, పోతున్నాయంటే.. మనకు తెలియని, మన కంటికి కనిపించని అద్భుతమైన ప్రక్రియలు వేలాది సంవత్సరాలుగా కొనసాగుతుండడమే అందుకు కారణం!
భూతాపం కారణంగా దెబ్బతింటున్న గల్ఫ్ స్ట్రీమ్ లయ
గ్రీన్‌లాండ్ వద్ద భారీగా మంచు కరిగి ఈ ప్రవాహంలోకి
ఆ ప్రవాహం ఆగితే అమెరికాలో, యూరప్, ఆసియాలోని
పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయే ముప్పు
కొన్ని దశాబ్దాల వ్యవధిలో 10 డిగ్రీల మేర తగ్గే ప్రమాదం
మరోసారి హెచ్చరించిన నెదర్లాండ్స్ శాస్త్రవేత్తలు
ఈ ప్రపంచం ఇంత అందంగా, కులాసాగా కనిపిస్తోందంటే.. ఎండ, వాన, చలి, ఇన్ని రుతువులు వస్తున్నాయి, పోతున్నాయంటే.. మనకు తెలియని, మన కంటికి కనిపించని అద్భుతమైన ప్రక్రియలు వేలాది సంవత్సరాలుగా కొనసాగుతుండడమే అందుకు కారణం! సామాన్య మానవులకు అంతగా తెలియని అలాంటి అద్భుతాల్లో ఒకటి.. ‘గల్ఫ్ స్ట్రీమ్’. భూమధ్యరేఖ నుంచి, దక్షిణార్థ గోళం నుంచి వేడిని ఉత్తరార్ధ గోళానికి, ధ్రువాల వద్దకు తీసుకెళ్లి.. ఆ ఉష్ణ శక్తిని అక్కడ విడుదల చేసే సహజ కన్వేయర్ బెల్ట్ లాంటి ఉష్ణ ప్రవాహమే ఈ గల్ఫ్ స్ట్రీమ్! ప్రవహించినంతమేరా ఆయా ప్రాంతాల్లో చలిని నియంత్రిస్తుంటుంది. పశ్చిమ యూరప్ ప్రాంతాలు చలికాలంలో గడ్డకట్టిపోకుండా ఉండడానికి, అక్కడ ఎండాకాలంలో పంటలు పండడానికి ముఖ్య కారణం ఈ ప్రవాహమే. అయితే.. నానాటికీ పెరుగుతున్న భూతాపం కారణంగా హిమనీ నదాలు కరిగిపోయి ఆ నీరు ఈ ప్రవాహంలో చేరుతుండడం వల్ల ఈ గల్ఫ్ స్ట్రీమ్ దెబ్బతిని ఉష్ణ శక్తిని చేరవేయలేకపోయే ప్రమాదం ఉందని.. శాస్త్రజ్ఞులు 1960ల్లోనే హెచ్చరించారు. 2025 నుంచి 2095 నడుమ ఆ ప్రమాదం ఎప్పుడైనా ముంచుకురావచ్చని గత ఏడాది నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ఒక వ్యాసం ప్రచురితమైంది. తాజాగా.. నెదర్లాండ్స్‌లోని యుట్రెక్ట్ యూనివర్సిటీ పరిశోధకులు కూడా ఈ విషయమై హెచ్చరిక జారీచేశారు. అయితే, గత పరిశోధకులు చెప్పినట్టు 2025.. 2095.. అంటూ టైమ్ మాత్రం చెప్పలేదు.
పైకి వెళ్లి.. కిందికి..
అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడే నాలుగు ఉష్ణ ప్రవాహాల్లో ముఖ్యమైనది గల్ఫ్ స్ట్రీమ్. భూమధ్యరేఖ వద్ద సముద్ర ఉపరితలంపై ఎక్కువ ఉప్పగా, వేడిగా ఉండే నీరు ఈ ప్రవాహం గుండా గల్ఫ్ ఆఫ్ మెక్సికో గుండా అమెరికా తీరం వెంట ప్రయాణించి గ్రీన్‌లాండ్ దిశగా ప్రవహిస్తుంది. ఈ ఉష్ణ ప్రవాహం మీదుగా వీచే గాలుల వల్లే పశ్చిమ యూర్‌పకు వెచ్చదనం వస్తుంది. అలా గ్రీన్‌లాండ్ సమీపానికి చేరుకునేసరికి అక్కడి మంచు వాతావరణం కారణంగా ఈ ప్రవాహంలోని నీరు చల్లబడుతుంది. కొంత నీరు గడ్డకట్టగా.. మిగిలిన నీటిలో ఉప్పు శాతం పెరిగిపోతుంది. దానివల్ల నీటి సాంద్రత పెరిగి.. ఆ నీరు మళ్లీ కిందికి.. దక్షిణ దిశగా ప్రవహిస్తుంది. కిందికి వెళ్లిన నీరు మళ్లీ ఉప్పునీటితో కలిసి భూమధ్యరేఖ గుండా గల్ఫ్ ఆఫ్ మెక్సికో, అమెరికా తూర్పు తీరం.. ఇలా ప్రవహించి మళ్లీ గ్రీన్‌లాండ్ వద్దకు చేరుకుంటుంది. ఇలా ఒక కన్వేయర్ బెల్ట్ తిరిగినట్టు గల్ఫ్ స్ట్రీమ్ కొన్ని వేల సంవత్సరాలుగా ప్రవహిస్తోంది. కానీ.. భూతాపం వల్ల గ్రీన్‌ల్యాండ్‌లో ఉన్న మంచు ఫలకాలు పెద్ద ఎత్తున కరిగిపోయి ఈ ప్రవాహంలోకి చల్లటి మంచినీరు వచ్చి కలవడం వల్ల దీని లవణీయత తగ్గిపోతోంది. ఫలితంగా కాలక్రమంలో అక్కడికి చేరిన నీరు కిందికి దిగదు. అంటే సహజ కన్వేయర్ బెల్ట్ ఆగిపోయినట్టే.
ఏమవుతుంది?
గల్ఫ్ స్ట్రీమ్ గతి తప్పితే ఏం జరుగుతుంది? గతి తప్పి చల్లబడ్డ నీరు పైనే ఉండిపోతే.. ఆ నీరు కిందకి దిగక, కింద నుంచి ఉష్ణ ప్రవాహం పైకి రాకపోవడం వల్ల దానివల్ల ఉష్ణ శక్తిని పొందే ఉత్తర అమెరికా, పశ్చిమ యూర్‌పలోని పలు ప్రాంతాల్లో, ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయి. ఎంతగానంటే.. దశాబ్దానికి 1 డిగ్రీ సెల్సియస్ మేర.. కొన్ని ప్రాంతాల్లోనైతే దశాబ్దానికి 3 డిగ్రీల సెల్సియస్ మేర వాతావరణం చల్లబడిపోతుంది. ప్రస్తుతం భూతాపం కారణంగా దశాబ్దానికి 0.2 డిగ్రీల మేర ఉష్ణోగ్రత పెరుగుతోంది. అంటే.. పెరిగే ఉష్ణోగ్రత కన్నా తగ్గే శాతమే ఎక్కువ. ఇలా కొన్ని దశాబ్దాల వ్యవధిలో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ మేర పడిపోతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. దాని పర్యవసానాలు ప్రపంచం మొత్తంపైనా పడతాయి. కొన్ని ప్రాంతాలను పెను తుఫానులు అల్లాడిస్తాయి. మరికొన్నిచోట్ల కరువుకాటకాలు సంభవిస్తాయి. తినడానికి తిండి దొరకని పరిస్థితులు ఏర్పడే ముప్పుంది. ఉత్తర అమెరికా తూర్పు తీరంలో సముద్ర మట్టాలు ఆందోళనకరస్థాయిలో పెరుగుతాయి.
‘ద డే ఆఫ్టర్ టుమారో’... 2004లో వచ్చిన హాలీవుడ్ చిత్రమిది! పర్యావరణ మార్పుల కారణంగా అట్లాంటిక్ మహా సముద్రంలోని ప్రవాహాల్లో మార్పులు ఏర్పడి భూమ్మీద మినీ మంచుయుగం ఏర్పడి ప్రపంచమంతా గడకట్టుకుపోయి, పర్యావరణ ఉత్పాతాలతో అల్లకల్లోలమైపోతుంది! అది సినిమా. కల్పితం. కానీ.. ఉత్తరార్ధ గోళానికి ఉష్ణ శక్తిని చేరవేసే అట్లాంటిక్ మహాసముద్రంలోని గల్ఫ్ ప్రవాహం లయ దెబ్బతిని లయమైపోయే ముప్పు ముంచుకొస్తోందని.. నిజ జీవితంలోనూ మరికొన్నేళ్లలో అలాంటి మినీ మంచుయుగాన్ని చూసే ప్రమాదం ఉందని.. శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు!!
- సెంట్రల్ డెస్క్
Updated Date - Feb 16 , 2024 | 09:38 AM