బీఆర్‌ఎస్ చేజారిన నల్లగొండ మునిసిపాలిటీ
ABN, Publish Date - Jan 09 , 2024 | 04:12 AM
నల్లగొండ మునిసిపాలిటీ ‘హస్త’గతంకానుంది. మునిసిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డిపై కాంగ్రెస్ పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో ఆయన చైర్మన్ పదవిని కోల్పోయారు.
మునిసిపల్ చైర్మన్‌పై నెగ్గిన అవిశ్వాసం
నాటి ప్రతీకారాన్ని తీర్చుకున్న కాంగ్రెస్
నల్లగొండ, జనవరి 8: నల్లగొండ మునిసిపాలిటీ ‘హస్త’గతంకానుంది. మునిసిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డిపై కాంగ్రెస్ పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో ఆయన చైర్మన్ పదవిని కోల్పోయారు. ఫలితంగా నల్లగొండ మునిసిపల్ పీఠాన్ని బీఆర్‌ఎస్ కోల్పోయింది. గత నెలలో సైదిరెడ్డిపై కాంగ్రెస్ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్‌కు అవిశ్వాస నోటీసు అందజేశారు. ఈ నేపథ్యంలో సోమవారం మునిసిపల్ కార్యాలయంలో జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ హేమంత్ కేశవ్‌పాటిల్ ఆధ్వర్యంలో అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి మునిసిపాలిటీలోని 48 మంది కౌన్సిలర్లలో 47 మంది హాజరయ్యారు. ఒక కౌన్సిలర్, ఇద్దరు ఎక్స్‌అఫీషియో సభ్యులు గైర్హాజరయ్యారు. 41మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి అనుకూలంగా మద్దతు తెలపగా.. బీఆర్‌ఎ్‌సకు అనుకూలంగా ఐదుగురు కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. బీఆర్‌ఎస్ బహిష్కృత కౌన్సిలర్ పిల్లి రామరాజుయాదవ్ తటస్థంగా ఉన్నారు. ఓటింగ్ నిర్వహణ నేపథ్యంలో హేమంత్ కేశవ్‌పాటిల్ మాట్లాడుతూ సమావేశ వివరాలను పురపాలక శాఖకు పంపుతామని, ఎన్నికల కమిషన్ ఆదేశాలతోపాటు తేదీ నిర్ణయించాక మునిసిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తామన్నారు.
కాగా, నల్లగొండ మునిసిపాలిటీలో 2020లో జరిగిన మునిసిపల్ చైర్మన్ ఎన్నికలో ఎదురైన పరాభవానికి కాంగ్రెస్ బదులు తీర్చుకుంది. బీఆర్‌ఎస్ మునిసిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డిపై సోమవారం నిర్వహించిన అవిశ్వాసాన్ని కాంగ్రెస్ పట్టుదలతో నెగ్గించుకుంది. 2020 జనవరిలో నిర్వహించిన నల్లగొండ మునిసిపాలిటీ ఎన్నికల్లో మొత్తం 48 వార్డులుండగా.. బీఆర్‌ఎస్ 20, కాంగ్రెస్ 20, బీజేపీ 6, ఎంఐఎం ఒకటి, ఇండిపెండెంట్‌గా ఒకరు గెలిచారు. చైర్మన్ స్థానాన్ని దక్కించుకునేందుకు 26ఓట్లు కావాల్సి ఉండగా.. ఎంఐఎం, మరో ఇండిపెండెంట్ అభ్యర్థి, ఎక్స్ అఫిషియో ఓట్లతో బీఆర్‌ఎస్ గట్టెక్కింది. మొత్తం 27మంది మద్దతు నాడు లభించింది. ఇక బీఆర్‌ఎస్, బీజేపీ ఒప్పందం మేరకు బీజేపీ.. కాంగ్రె్‌సకు మద్దతు తెలపలేదు. వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించి ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించాల్సి ఉండగా... బీఆర్‌ఎస్ ఒప్పందాన్ని ఉల్లంఘించి వైస్ చైర్మన్ పదవిని కూడా దక్కించుకుంది. అయితే నాడు అధికార పార్టీ ఎత్తులతో చిత్తయిన కాంగ్రెస్ అప్పటి ప్రతికారాన్ని సోమవారం తీర్చుకుంది. మునిసిపల్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానంలో 41 మంది మద్దతుతో పంతం నెగ్గించుకుంది.
Updated Date - Jan 09 , 2024 | 04:12 AM