నీరందక ఎండుతున్న మిరపతోటలు
ABN, Publish Date - Feb 03 , 2024 | 11:04 PM
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) నీటిపై నమ్మకంతో వేసిన మిరప పంటలు ఎండిపోతున్నాయి.
ఎస్సారెస్పీ నీటిపై ఆశతో వందల ఎకరాల్లో సాగు
రెండు కాపులతోనే నీరు లేక ఎండిన పంటలు
గతేడాది కంటే రెండింతల సాగు
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) నీటిపై నమ్మకంతో వేసిన మిరప పంటలు ఎండిపోతున్నాయి. గతేడా ఎస్సారెస్పీ నీరు నీరు వేసవి సీజన వరకు విడుదల కావడంతో మెట్ట ప్రాంతమైన మోతె మండలంలోని రైతులు ఈ ఏడాది కూడా నీటి విడుదల ఉంటుందని భావించి రెండింతలు విస్తీర్ణంలో మిరప తోటలు సాగు చేశారు. అయితే భూగర్భ జలాలు అడుగంటిపోగా, ఎస్సారెస్పీ రాక రాకపోవడంతో రెండు విడతలు కోతలకే పంటలు ఎండిపోతున్నాయి.
- మోతె
గత ఏడాది క్వింటాకు రూ.20 వేల ధర పలకడంతో భూములు లేని రైతులు సైతం కౌలుకు తీసుకుని ఒక్కో రైతు మూడు నుంచి ఎనిమిది ఎకరాల వరకు సాగుచేశారు. యాసంగి వరినాట్ల సమయం ముగిసి రైతులు బోరుమోటార్లను విపరీతంగా ఉపయోగిస్తుండటంతో భూగర్భజలాలు అడుగంటి బోర్లు ఒట్టిపోతున్నాయి. పంటలు ఎండిపోకుండా రైతులు నీరు అధికంగా ఉన్న బావుల వద్ద నుంచి వేల రూపాయలు వెచ్చించి కిలోమీటర్ల మేర పైపులు వేసుకుని పంటలను కాపాడుకుంటున్నారు. పంటలు ఎండిపోకుండా పలువురు రైతులు మందులను పిచికారీ చేస్తున్నారు. అయితే నీరందక కాయలు ఎండిపోయి నేలరాలిపోతున్నాయి.
ఎస్సారెస్పీ ఆయకట్టులోనూ...
మండలంలో మొత్తం 5,500 ఎకరాల్లో మిరపతోటలను సాగుచేశారు. ప్రస్తుతం రెండు సార్లు పంటను ఏరిన తోటలు 3,200 ఎకరాల్లో ఉన్నాయి. 300 ఎకరాలకు సమృద్ధిగా నీరందుతోంది. మిగతా 2,500 ఎకరాల్లో కొన్నిచోట్ల పాలేరు రిజర్వాయర్ నుంచి సుమారు రెండు కిలోమీటర్ల మేర పైపులు వేసుకుని రైతులందరు పూటల మాదిరి నీటిని తోటలకు వాడుకుంటున్నారు. నామవరం, రాఘవాపురం, సిరికొండ, లాల్‌తండ, భల్లుతండ, భీక్యాతండ, మోతె గ్రామాలకు మాత్రమే కొద్దిమేర ఎస్సారెస్పీ నీరు రావడంతో బావుల ద్వారా నీరు అందుతోంది. అత్యధికంగా సాగు చేసిన గ్రామాల్లోనే నీరందక వందల ఎకరాలు ఎండిపోతున్నాయి. హుుస్సేనాబాద, మామిళ్లగూడెం, సర్వారం, రాందాసుతండ, మేకలపాటి తండ, బుర్కచర్ల, గోల్‌తండ, కర్కాయలగూడెం, రాంపురం తండ, రాయికుంట తండ గ్రామాల్లో ఒక్కో రైతు ఏడు ఎకరాలకు పైగా సాగుచేసిన వారు ఉన్నారు. ఈ గ్రామాల్లో గత ఏడాది వేసవికాలం ముగిసి మళ్లీ మిరప నారు పోసే వరకు మిరపతోటలకు నీరంది పంట దిగబడి వచ్చింది. ప్రస్తుతం తోటలు ఎండిపోతుండడంతో రైతులు చేసేదిలేక కన్నీరు పెడుతున్నారు. అతేకాకుండా పండిన పంటకు గిట్టుబాటు రాకపోవడంతో చేల వద్దనే ఉంచుతున్నారు. పెట్టుబడి గత ఏడాది కన్నా రెండింతలు పెరిగాయి.
ఆత్మకూర్(ఎస్) క్లస్టర్ నుంచి మండలంలోకి మోతె మీదుగా వెళ్లే, ప్రధానకాల్వ, రాంపురంతండ నుంచి కర్కాయలగూడెం మీదుగా అన్నారిగూడెం వెళ్లే కాల్వలతో పాటు సర్వారం, గోల్‌తండ, హుస్సేనాబాద గ్రామాల నుంచి వెళ్తున్న ఎస్సారెస్పీ కాల్వల ద్వారా ఇప్పటివరకు చుక్కనీరు రాలేదు. ఈ ప్రధాన కాల్వలకు అనుసంధానంగా పిల్లకాల్వలు పదుల సంఖ్యలో ఉన్నాయి. కాల్వల ద్వారా వచ్చే నీటిని నమ్ముకుని మిరపతోటలు సాగుచేశారు. గత ఏడాది రెండు విడతలుగా కాల్వల ద్వారా నీరు రావడంతో ఇప్పటి వరకు పంటలను కాపాడుకున్నామని రైతులు తెలిపారు. పంటలు ఎండిపోతున్నా అధికారులు చుక్కనీరు వదలడం లేదు. సూర్యాపేట నియోజకవర్గంలో ఉన్న ప్రతీ గ్రామానికి వరదలతో నీరు వెళ్తోంది. ఖమ్మం జిల్లాలోని పాలేరుకు ఆనుకుని మోతె మండలం ఉన్నా మండలానికి కనీసం ఎత్తిపోతల ద్వారా నీటిని అందించలేకపోతున్నారని రైతులు వాపోతున్నారు.
నీటిని అందిస్తే పంటలు కాపాడుకుంటాం
గత ఏడాది మాదిరే కాల్వల ద్వారా నీరు వస్తుందనే ఆశతో మూడు ఎకరాలు సాగు చేశాం. రెండు సార్లు పంట కోసినం.. ప్రస్తుతం నీరు లేక ఎండిపోయింది. అసలే మెట్ట నేలలు పదును లేకపోతే వారంలోనే మొత్తం చేను ఎర్రబారి ఎండిపోతది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి చొరవ చూపించి కాల్వల ద్వారా ఇప్పుడు నీరిచ్చినా కొద్ది మేర పంటలను కాపాడుకుంటాం. ఎస్సారెస్పీ అధికారులు మండలాన్ని పట్టించుకోకపోవడంతో నీరందడం లేదు.
- గుగులోత నగేష్, రాంపురంతండా గ్రామ రైతు
Updated Date - Feb 03 , 2024 | 11:04 PM