పాలస్తీనా జాతీయ జెండాల ప్రదర్శన
ABN, Publish Date - Jan 27 , 2024 | 12:59 AM
గణతంత్ర దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో నలుగురు యువకులు పాలస్తీనా దేశ జాతీయ జెండాలను ప్రదర్శించటం తీవ్ర చర్చనీయాంశమైంది. సీఐ రాఘవేందర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో కలకలం
మిర్యాలగూడ అర్బన, జనవరి 26 : గణతంత్ర దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో నలుగురు యువకులు పాలస్తీనా దేశ జాతీయ జెండాలను ప్రదర్శించటం తీవ్ర చర్చనీయాంశమైంది. సీఐ రాఘవేందర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని ఓ డిగ్రీ కళాశాల సమీపంలోని షాపింగ్‌మాల్ వద్ద నలుగురు యువకులు రెండు పాలస్తీనా జాతీయ జెండాలను పట్టుకుని ప్రదర్శిస్తుండగా, మరో యువకుడు వారిని వీడియోలో చిత్రీకరిస్తున్నాడు. దీనిని గమనించిన రోడ్డుపై వెళ్తున్న కొందరు యువకులు పాలస్తీనా జెండాలను పట్టుకున్న యువకులను వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. సోషల్‌మీడియాలో యువకుల వీడియో వైరల్ అవుతుండటంతో పోలీసులకు సమాచారం అందింది. వెంటనే డీఎస్పీ వెంకటగిరి స్పందించి వనటౌన సీఐ రాఘవేందర్‌ను అప్రమత్తం చేశారు. సీఐ సంఘటనా స్థలానికి చేరుకుని యువకులను అదుపులోకి తీసుకుని స్టేషనకు తరలించి విచారించినట్లు సీఐ తెలిపారు. సోషల్ మీడియా రీల్స్ చిత్రీకరణలో భాగంగా సదరు యువకులు పాలస్తీనా దేశ జాతీయజెండాలను ప్రదర్శించామని నిందితులు తమవిచారణలో చెప్పినట్లు సీఐ వివరించారు. సున్నితమైన అంశం కావడంతో యువకుల వివరాలు వెల్లడించేందుకు సీఐ నిరాకరించారు. ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. ఇదిలా ఉండగా గణతంత్ర వేడుకలను శాంతియుతంగా జరుపుకుంటున్న సందర్భంలో పాలస్తీనా జాతీయ జెండాలను ప్రదర్శించడం అత్యంత హేయమైన చర్య అని బీజేపీ పట్టణ కార్యదర్శి శ్యామ్ అన్నారు. ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించిన వారిని చట్టబద్ధంగా శిక్షించాలని వీహెచపీ, బజరంగ్‌దళ్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కాగా సుమారు అరగంటకు పైగా పాలస్తీనా జెండాలతో యువకులు నిలబడ్డారు. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే నలుగురు యువకులు ఉన్నారు.
Updated Date - Jan 27 , 2024 | 01:00 AM