పంచాయతీల్లో ప్రత్యేక పాలన
ABN, Publish Date - Jan 31 , 2024 | 11:53 PM
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 1,740 గ్రామపంచాయతీల్లో శుక్రవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. సర్పంచల పదవీకాలం ఈ నెల 1న ముగుస్తుండటంతో ఇకపై పాలన బాధ్యతలను అధికారులు చేపట్టనున్నారు.
నేటి సాయంత్రంలోగా సర్పంచల నుంచి రికార్డుల స్వాధీనం
ఉమ్మడి జిల్లాలో 1,740 గ్రామాలకు అధికారుల నియామకం
రేపటి నుంచి బాధ్యతలు చేపట్టనున్న ప్రత్యేక అధికారులు
విద్యాశాఖ మినహా మిగతా శాఖల ఉద్యోగులకు బాధ్యతలు
నల్లగొండ/ సూర్యాపేట సిటీ, జనవరి 31 : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 1,740 గ్రామపంచాయతీల్లో శుక్రవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. సర్పంచల పదవీకాలం ఈ నెల 1న ముగుస్తుండటంతో ఇకపై పాలన బాధ్యతలను అధికారులు చేపట్టనున్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాకపోవడంతో గ్రామాలకు ప్రత్యేక అధికారులను నియమించాలని ప్రభు త్వం నిర్ణయించింది. మూడు జిల్లాల నుంచి ప్రతిపాదించిన ప్రత్యేక అఽధికారుల జాబితాకు ఏ క్షణమైనా ఆమోదం లభించనుంది. విద్యాశాఖ ఉద్యోగులు మినహా ఇతర శాఖలన్నింటి నుంచి ఉద్యోగులను ప్రత్యేక అధికారులుగా తీసుకోనున్నారు. ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఉపతహసీల్దార్లు, పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్లు, గ్రామీణ నీటి సరఫరా విభాగం అసిస్టెంట్ ఇంజనీర్లు, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు, వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యానశాఖ అధికారులు, ఆరోగ్యశాఖ సూపర్‌వైజర్లు, రెవెన్యూ ఇనస్పెక్టర్లు, మండల పరిషత సూపరింటెండెంట్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు, టైపిస్టులను ప్రత్యేక అధికారులుగా నియమించనున్నారు. నల్లగొండ జిల్లాలో 844గ్రామాలకు, సూర్యాపేట జిల్లాలో 475గ్రామాలకు, యాదాద్రి జిల్లాలో 421 గ్రామాలకు ప్రత్యేకఅధికారులను నియమించనున్నారు.
నేటి సాయంత్రంలోగా రికార్డులు స్వాధీనం
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారుల పాలన నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 1,740 గ్రామపంచాయతీలకు చెందిన రికార్డులను సర్పంచుల నుంచి గురువారం సాయ ంత్రం ఐదు గంటల్లోగా రికార్డులను స్వాధీనం చేసుకోనున్నారు. ఇప్పటికే అన్నిగ్రామాల సర్పంచలకు రికార్డులను అప్పగించాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సర్పంచలు, ఉపసర్పంచల నుంచి రికార్డులు, చెక్‌బుక్‌లు, డిజిటల్ బుక్‌ల కీలను స్వాధీన చేసుకోనున్నారు. గురువారంతో సర్పంచల పదవీకాలం ముగుస్తున్నందున వాటిని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. ఎవరైనా ప్రభుత్వ ఆదేశాలు పాటించకుండా రికార్డులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం డిజిటల్ సంతకాల కీలు పెనడ్రైవ్‌ల రూపంలో సర్పంచలు, ఉపసర్పంచల వద్ద ఉన్నాయి. వాటిని పంచాయతీ కార్యదర్శులు సాధీనం చేసుకోనున్నారు. ఫిబ్రవరి 2 నుంచి విధుల్లో చేరనున్న ప్రత్యేక అధికారులకు ప్రభుత్వం డిజిటల్ సంతకాల కీలను ఇవ్వనుంది. ఇప్పటివరకు సర్పంచలు, ఉపసర్పంచలకు జాయింట్ చెక్‌పవర్ ఉండగా ఇకపై ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్‌పవర్ ఇవ్వనున్నారు. అభివృద్ధి పనులకు సంబంధించి వారి ఇద్దరి సంతకాలతో నిధులు డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.
పాత బిల్లులు చెల్లించి ఆదుకోవాలి
గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశాం. గ్రామ అభివృద్ధి కోసం అప్పులు చేసి పనులు చేపట్టాం. తమ గ్రామంలో మన ఊరు మన బడి కోసం రూ.కోటి అప్పులు చేసి పనులు చేపట్టాం. నేటి వరకు నయా పైసా విడుదల కాలేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బిల్లులు చెల్లించి ఆదుకోవాలి. సర్పంచగా పదవీకాలం సంతృప్తికరంగా ఉన్నా బిల్లులు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నాం.
- దండ రేణుకఅశోక్‌రెడ్డి, సర్పంచ, బైరవునిబండ, శాలిగౌరారం
స్పెషల్ ఆఫీసర్ల నియామకానికి ఏర్పాట్లు
ప్రభుత్వఆదేశాల మేరకు స్పెషల్ ఆఫీసర్ల నియా మకానికి అన్ని ఏర్పాట్లుచేశాం. విద్యాశాఖ మినహా అన్ని ప్రభుత్వశాఖల నుంచి అధికారులను గుర్తించి స్పెషల్ ఆఫీసర్ల నియామకం కోసం ఒక జాబితాను రూపొందించాం. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడగానే ప్రొసీడింగ్స్ ఇస్తారు. ప్రస్తుత సర్పంచలు శుక్రవారం 5 గంటల తరువాత డిజిటల్ కీ, చెక్‌బుక్‌లు అందజేయాల్సి ఉంటుంది.
-విష్ణువర్ధనరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి
Updated Date - Jan 31 , 2024 | 11:53 PM