దీపం వెలిగింది.. ఉర్సు మొదలైంది
ABN, Publish Date - Jan 25 , 2024 | 11:32 PM
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అతిపెద్ద జాతరలో ఒకటైన జాన్‌పహాడ్ సైదులు దర్గా ఉర్సు గురువారం ఘనంగా ప్రారంభమైంది.
పాలకవీడు, జనవరి 25 : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అతిపెద్ద జాతరలో ఒకటైన జాన్‌పహాడ్ సైదులు దర్గా ఉర్సు గురువారం ఘనంగా ప్రారంభమైంది. తెల్లవారుజామున సైదులు స్వామిని పెళ్లికుమారుడిగా ముస్తాబు చేసి, కొవ్వొత్తుల హారతుల మధ్య దర్గాలోని హజ్రత్ సయ్యద్‌మోహినుద్దీషా, జాన్‌పాక్ షహీద్ రహమతుల్లా సమాధులపై పూజారి జాని గంధం ఎక్కించి పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. దర్గాలోని నాగేంద్రుడి పుట్టకు హిందువులతో పాటు ముస్లిం మహిళలు పాలు, గుడ్లు వేసి దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. ఇది దర్గాలోని ప్రత్యేకత.ఉర్సు సందర్భంగా పకీరులు ఖవ్వాలి నిర్వహిస్తూ ముస్లిం సంప్రదాయ పద్ధతిలో నృత్యాలు చేశారు. పూజారులు దర్గాలోని రెండు సమాధులపై హైదరాబాద్ నుంచి తెప్పించిన పువ్వులు, ప్రత్యేక దట్టీలను కప్పి సైదులు బాబా సమాధులను అత్యంత సుందరంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అదేవిధంగా సైదులుబాబాకు అంగరక్షకుడిగా ఉన్న సిపాయి బాబా సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సిపాయి దేవుడికి పూజలు నిర్వహించిన తర్వాతే సైదులు బాబాకు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. శుక్రవారం నిర్వహించే గంధం ఊరేగింపునకు భక్తులు పెద్దసంఖ్యలో గురువారం సాయంత్రం నుంచే దర్గాకు చేరుకుంటున్నారు. ఉర్సు సందర్భంగా దర్గా పరిసర ప్రాంతాల్లో వివిధ రకాల దుకాణాలను ఏర్పాటుచేశారు. చుట్టుపక్కల తండాల ప్రజలు బంధువులను పిలుచుకొని కందూరు చేసుకుంటున్నారు. భక్తుల రాకతో దర్గా చుట్టుపక్కల ప్రాంతాలు సందడిగా కనిపిస్తున్నాయి. స్టాళ్ల వద్ద వస్తువులు కొనుగోలు చేస్తూ సందడి చేశారు.
ప్రభుత్వ శాఖల శిబిరాలు
దర్గా సమీపంలో ప్రభుత్వ శాఖలకు సంబంధించిన శిబిరాలను ఏర్పాటుచేశారు. వైద్యం, రెవెన్యూ, పంచాయతీరాజ్, అగ్నిమాపక శాఖలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. కోదాడ నుంచి నేరేడుచర్ల మీదుగా ప్రత్యేకంగా 15 ఆర్టీసీ సర్వీసులను, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ డిపో నుంచి దామరచర్ల మీదుగా 15 ఆర్టీసీ సర్వీసులను నిరంతరాయంగా నడుపుతున్నారు. ఆర్టీసీ బస్సులతో పాటు ఆటోలు, ట్రాక్టర్లు, లారీలు తదితర ప్రైవేటు వాహనాల్లో ఇప్పటికే భక్తులు పెద్దసంఖ్యలో దర్గాకు చేరుకుంటున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
నేడు గంఽధం ఊరేగింపు
ఉర్సు ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం గంధం ఊరేగింపు. శుక్రవారం నిర్వహించే ఈ ఉత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. తొక్కిసలాట జరగకుండా పోలీసులు రోప్ పార్టీలను నియమించారు. వక్ఫ్‌బోర్డు నుంచి ఉదయం 9 గంటలకు చందల్‌ఖానా నుంచి గంధం ఊరేగింపు మొదలవుతుంది. అక్కడి నుంచి జాన్‌పహాడ్, చెర్వుతండా వరకు గుర్రాల మీద తీసుకువెళ్తారు. తిరిగి ఒంటి గంటకు గంధాన్ని జాన్‌పహాడ్ దర్గా వద్దకు తీసుకువస్తారు. దర్గా లోపల ఉన్న భక్తులను బయటకు పంపి దర్గాలో గంధం ఎక్కిస్తారు. గంధాన్ని అత్యంత అందుకునేందుకు భక్తులు ఎగబడతారు. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు.
నేడు మంత్రి ఉత్తమ్ రాక
జానపహాడ్ దర్గాను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం దర్శించుకుంటారని జడ్పీటీసీ మోతీలాల్, ఎంపీపీ గోపాల్ తెలిపారు. అనంతరంగంధం ఊరేగింపులో పాల్గొంటారన్నారు. కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
Updated Date - Jan 25 , 2024 | 11:32 PM