లక్ష్యం నెరవేరేనా?
ABN, Publish Date - Jan 30 , 2024 | 11:50 PM
జిల్లాలో ఆస్తి పన్ను వసూలు ప్రక్రియ కొనసాగుతోంది. 2023-24 సంవత్సరానికి సంబంధించి మార్చి 31వ తేదీతో గడువు పూర్తి కానుండగా వసూళ్ల లక్ష్యం 40.67 శాతమే అయ్యింది.
కొనసాగుతున్న పన్నుల వసూళ్లు
రూ. 29.5 కోట్లకు రూ.12 కోట్లు వసూలు
స్పెషల్ డ్రైవ్ చేపడుతున్న మునిసిపల్ అధికారులు
మార్చి 31తో ఆఖరు
సూర్యాపేట టౌన, జనవరి 30 : జిల్లాలో ఆస్తి పన్ను వసూలు ప్రక్రియ కొనసాగుతోంది. 2023-24 సంవత్సరానికి సంబంధించి మార్చి 31వ తేదీతో గడువు పూర్తి కానుండగా వసూళ్ల లక్ష్యం 40.67 శాతమే అయ్యింది. జిల్లాలోని ఐదు మునిసిపాలిటీలకు కలిపి రూ.29.5 కోట్లు లక్ష్యం బకాయిలు కాగా, ప్రస్తుతం రూ.12 కోట్లు మాత్రమే వసూలు చేశారు. గతేడాది సూర్యాపేట మునిసిపాలిటీలో 100 శాతం పన్నులు వసూలు చేశారు. మిగతా చోట్ల ఆశాజనకంగా కాలేదు. అయితే ఈ పర్యాయం అన్ని మునిసిపాలిటీల్లోనూ లక్ష్యాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు.
సూర్యాపేట మునిసిపాలిటీ అధికారులు ఇంటి పన్నుల వసూళ్లను ముమ్మరం చేశారు. 22 మంది బిల్‌కలెక్టర్లు, నలుగురు సూపర్‌వైజర్లు పన్నుల వసూళ్లపై దృష్టి సారించారు. ఇంటి పన్నులతో పాటు వాణిజ్య సముదాయాలు, సెమీవాణిజ్య సముదాయాలకు పన్నులు చెల్లించాలని విస్తృత ప్రచారం చేపట్టారు. అధికారులు వాహనాల్లో తిరుగుతూ పన్నులు చెల్లించకుంటే ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరిస్తున్నారు. అయితే గతానికి భిన్నంగా నవంబరు నెల నుంచే వసూళ్లు చేయడం ప్రారంభించారు. ఇందుకోసం ఇటీవలే ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేశారు.
ఎర్లీబర్డ్ పథకంపై ప్రజల ఆసక్తి
ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తుంది. అయితే ఈలోపు చెల్లించే వారికి వడ్డీ ఉండదు. ఆ తర్వాత 2శాతం చొప్పున వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎర్లీబర్డ్ పథకం ద్వారా ముందస్తుగా చెల్లించిన వారికి 5శాతం రాయితీ ఇస్తారు. దీంతో కొంతమంది ఆసక్తి చూపుతున్నారు. గత ఏడాది పన్నుల బకాయిలు అధికంగా ఉన్న వారికి రెడ్ నోటీసులు అందజేశారు. సూర్యాపేటలో 150 నుంచి 250 మందికి రెడ్ నోటీసులు అందజేశారు. దాదాపు రూ.50వేల నుంచి రూ.లక్ష దాకా పన్నులు చెల్లించని వారికి ఈ నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసులు అందుకున్న వారు మూడు రోజుల్లో పన్నులు చెల్లించకుంటే ఆస్తి జప్తు చేసే అధికారం మునిసిపాలిటీకి ఉంటుంది. అయితే గతంలోనే పన్నులు వసూలు చేయడంతో ప్రస్తుతం రెడ్‌నోటీసులు జారీ చేసే అంత బకాయి ఎవరికీ లేదు. ఇక జిల్లాలో సూర్యాపేటతో పాటు కోదాడ, హుజూర్‌నగర్ మునిసిపాలిటీలు ఉండగా కొత్తగా ఏర్పాటైన నేరేడుచర్ల, తిరుమలగిరి మునిసిపాలిటీలు ఉన్నాయి. ప్రస్తుతం సూర్యాపేట మునిసిపాలిటీలో రూ.16కోట్ల ఆస్తి బకాయిలు ఉండగా 56 శాతం మేర రూ.9 కోట్లు వసూలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మునిసిపాలిటీలకు కలిపి రూ.29.5కోట్లు ఉండగా ప్రస్తుతం రూ.12కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం.
పన్నుల వసూళ్లలో వేగం పెంచాలి: అదనపు కలెక్టర్
సూర్యాపేట(కలెక్టరేట్) : జిల్లాలో ఇంటి పన్నుల వసూళ్లలో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ సీహెచ.ప్రియాంక సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సర్పంచుల పదవీ కాలం ముగుస్తు న్నందున పారదర్శకంగా అన్నిగ్రామపంచాయతీలకు ప్రత్యేకాధికారుల నియామకం జరుగుతుందన్నారు. ఇంటి పన్నులను నిర్దేశించిన గడువులోపు 100 శాతం పూర్తి చేయాలన్నారు. ఎక్కడా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో సిబ్బందిని నియామకం చేపట్టవద్దని, జిల్లాలోని సిమెంట్ కంపెనీల నుంచి పన్నులను వసూలు చేయాలన్నారు. పంచాయతీల్లో 10శాతం బడ్జెట్‌ను గ్రీనరీకి ఖర్చు చేయాలన్నారు. అభివృద్ధి ప్రణాళికలను ఈ-గ్రామ స్వరాజ్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. 197 ప్రంచాయతీల్లో ఎఫ్‌టీవోల మేరకు చేపట్టిన మరుగుదొడ్లకు నిబంధనల మేరకు చెల్లింపులు చేయాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో సురే్‌షకుమార్, డీఆర్‌డీవో సుందరి కిరణ్‌కుమార్, డీపీవో యాదయ్య పాల్గొన్నారు.
Updated Date - Jan 30 , 2024 | 11:50 PM