ఇథనాల్ పరిశ్రమ నిర్మాణంపై ప్రజాగ్రహం
ABN, Publish Date - Jan 04 , 2024 | 03:42 AM
ఇథనాల్ పరిశ్రమ నిర్మాణం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న దిలావర్‌పూర్, గుండంపల్లి గ్రామాల ప్రజలు బుధవారం ఆకస్మికంగా పరిశ్రమ నిర్మాణ ప్రదేశాన్ని ముట్టడించారు.
కూలీల తరిమివేత..పోలీసుల లాఠీఛార్జి
కారుకు నిప్పు.. పలు వాహనాలు ధ్వంసం
దిలావర్‌పూర్, జనవరి 3 : ఇథనాల్ పరిశ్రమ నిర్మాణం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న దిలావర్‌పూర్, గుండంపల్లి గ్రామాల ప్రజలు బుధవారం ఆకస్మికంగా పరిశ్రమ నిర్మాణ ప్రదేశాన్ని ముట్టడించారు. నిర్మాణ పనులను అడ్డుకున్నారు. అక్కడ పని చేస్తున్న కూలీలను వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో కూలీలు పెట్టె బేడా సర్దుకుని వెళ్లిపోయారు. కూలీల తాత్కాలిక షెడ్లను ప్రజలు ధ్వంసం చేశారు. నిర్మాణంలో ఉన్న ప్రహరీని కూలదోశారు. టిప్పర్ల అద్దాలు ధ్వంసం చేశారు. వాటికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రాళ్లు విసరడంతో రెండు కార్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. భైంసా ఏఎస్పీ క్రాంతిలాల్ పటేల్, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, తహసీల్దార్ సరిత, డీఎస్పీ గంగారెడ్డి, సీఐ శ్రీనివాస్ రైతులతో చర్చలు జరిపినా ఫలించలేదు. ఇదే సమయంలో కొంతమంది పరిశ్రమ ప్రతినిధికారుకు నిప్పు పెట్టారు. పోలీసులు మఫ్టీలో ఉండి వీడియోలు తీస్తుండటాన్ని గమనించిన కొందరు వారి వద్ద నుంచి సెల్‌ఫోన్లను లాక్కుని ధ్వంసం చేశారు. పోలీసులు ముగ్గురిని చితకబాదారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్లని వదిలేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు ఆ ఇద్దరిని వదిలేశారు. తమపై పోలీసులు లాఠీఛార్జి చేయడాన్ని నిరసిస్తూ గురువారం దిలావర్‌పూర్ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ఇథనాల్ పరిశ్రమ వ్యతిరేక కమిటీ, దిలావర్‌పూర్ వీడీసీ పిలుపునిచ్చాయి. పరిశ్రమ రద్దయ్యే వరకు పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు.
Updated Date - Jan 04 , 2024 | 07:17 AM