TG Cabinet: కీలక హామీలకు రేవంత్ కేబినెట్ ఆమోదం.. అదిరిపోయే శుభవార్తలు!
ABN, Publish Date - Feb 04 , 2024 | 10:02 PM
ఆదివారం సెక్రటేరియెట్‌లో తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా.. కొన్ని కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వాహనాల నెంబర్ ప్లేట్‌లలో టీఎస్‌కు బదులుగా టీజీగా మారుస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 గ్యాస్ సిలిండర్ పథకాలకు కూడా మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఆదివారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా.. కొన్ని కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వాహనాల నెంబర్ ప్లేట్‌లలో టీఎస్‌కు (TS) బదులుగా టీజీగా (TG) మారుస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 గ్యాస్ సిలిండర్ పథకాలకు కూడా మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. తెలంగాణ తల్లి రూపురేఖల్లోనూ మార్పులు చేయనున్నారు. కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాలను మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వెల్లడించారు.
అవును మార్చేస్తున్నాం..!
ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయని తెలిపారు. బడ్జెట్ సమావేశాల గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రూ.500 గ్యాస్ సిలిండర్ హామీలకు, ‘జయ జయహే తెలంగాణ’ గేయాన్ని రాష్ట్ర గేయంగా మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపిందన్నారు. తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు రాష్ట్ర చిహ్నంలోనూ మార్పులు చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. తెలంగాణ ఆత్మ కనిపించే విధంగా రాష్ట్ర రాజముద్రను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ మరో రెండు గ్యారెంటీ స్కీములను ప్రకటించనున్నారని స్పష్టం చేశారు.
అనుమానాలు అక్కర్లేదు!
అనంతరం శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశామన్నారు. ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌గా అప్‌గ్రేడ్ చేయాలని, నూతన హై కోర్టుకు భూ కేటాయింపుపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఆరు గ్యారెంటీల విషయంలో అనుమానాలు అక్కర్లేదని.. గత ప్రభుత్వం తెలంగాణ ఖజానాను ఖాళీ చేసినా వెనక్కి తగ్గమని మాటిచ్చారు. వ్యవసాయ శాఖలోని ఖాళీలను నింపాలని నిర్ణయించామని.. ఉద్యోగాల భర్తీ అంశంపై కసరత్తు చేస్తున్నామని.. సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అహంకారపూరితమైన చిహ్నాలను మార్చాలని కేబినెట్ నిర్ణయించిందని శ్రీధర్ బాబు మీడియాకు వెల్లడించారు.
Updated Date - Feb 04 , 2024 | 10:36 PM