పండగ పూట విషాదాలు
ABN, Publish Date - Jan 17 , 2024 | 12:28 AM
ఉమ్మడి జిల్లాలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. నలుగురు గాయపడ్డారు. నల్లగొండ జిల్లాలో ముగ్గురు, యాదాద్రిభువనగిరి జిల్లాలో ఒకరు చొప్పున మృత్యువాత పడ్డారు.
ఉమ్మడి జిల్లాలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. నలుగురు గాయపడ్డారు. నల్లగొండ జిల్లాలో ముగ్గురు, యాదాద్రిభువనగిరి జిల్లాలో ఒకరు చొప్పున మృత్యువాత పడ్డారు.
చింతపల్లి, జనవరి 16: సంక్రాంతి పండుగ వేళ కుర్మపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో కారు అదుపు తప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. నాంపల్లి సీఐ నవీనకుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చింతపల్లి మండలం కుర్మపల్లి గ్రామానికి చెందిన దార్ల ప్రభాకర్, పోలోజు రాఘవేందర్(29), దార్ల అరవింద్(22)లు ఇత్తడి వస్తువులపై నక్ష వేసే వృత్తి చేస్తూ జీవనం సాగిస్తుండగా, ఎవరికీ వివాహం కాలేదు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరి కుటుంబాలు సైతం ఇదే వృత్తి నిర్వహణలో ఉన్నాయి. ఈ నెల 14వ తేదీ సాయంత్రం ఈ ముగ్గురూ కలిసి పని నిమిత్తం హైదరాబాద్‌లోని బేగంబజార్‌కు వెళ్లి అదే రోజు రాత్రి స్వగ్రామానికి బయలుదేరారు. ప్రభాకర్ కారు నడుపుతుండగా చింతపల్లి మండలం పోలేపల్లి రాంగనర్ సమీపంలో మూలమలుపు వద్ద కారు అదుపుతప్పి నాలుగు పల్టీలు కొట్టుకుంటూ వెళ్లి రోడ్డు పక్కన స్తంభానికి తగిలి నిలిచింది. ఈ ఘటనలో పోలోజు రాఘవేందర్(29), దార్ల అరవింద్(22) అక్కడికక్కడే మృతి చెందగా ప్రభాకర్‌కు తీవ్రగాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న ప్రయాణికులు డయల్ -100కు సమాచారం అందించారు. దీంతో చింతపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రగాయాలైన ప్రభాకర్‌ను హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అరవింద్ పెద్దనాన్న బ్రహ్మచారి ఫిర్యాదు మేరకు మృతదేహాలకు దేవరకొండ సివిల్ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సీఐ నవీనకుమార్ తెలిపారు.యువకుల మృతదేహాలకు సోమవారం అంత్యక్రియలు పూర్తి చేశారు.సంక్రాంతి పండుగ రోజున గ్రామానికి చెందిన యువకులు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
బైక్ అదుపుతప్పి యువకుడు...
వేములపల్లి: నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలో బైక్ అదుపు తప్పిన ఘటనలో యువకుడు మృతి చెందాడు. ఏఎ్‌సఐ నరసింహారావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మునుగోడడు మండలం కల్వలపల్లి గ్రామానికి చెందిన వంటెపాక స్వామి(25) ప్లంబర్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజువారి పనినిమిత్తం సోమవారం ఉదయం బైక్‌పై మిర్యాలగూడకు వచ్చి పనిముగించుకుని సాయంత్రం స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో మండలంలోని శెట్టిపాలెం గ్రామశివారులోని మహేశ్వరి మిల్లు వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి రైస్‌మిల్లు గోడకు ఢీకొట్టింది. ఈ ఘటనలో స్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. స్వామి తండ్రి శ్రీరాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు.
రెండు బైక్‌లు ఢీకొని..
ఆలేరు రూరల్: యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు మండలంలో రెండు బైక్‌లు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం జరిగింది. ఎస్‌ఐ వెంకటశ్రీను తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరు గ్రామానికి చెందిన సీస మహేష్(35) తన బైక్‌పై గొలనుకొండలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. తిరిగి స్వగ్రామానికి వస్తున్న క్రమంలో జనగాం జిల్లా లింగాలఘనపురం మండల కుందారం గ్రామానికి చెందిన ఎల్లల నరేష్ తన బైక్‌పై ఎదురుగా వస్తూ కుమ్మరికుంట వద్ద మహేష్ బైక్‌ను ఢీకొనడంతో మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. నరే్‌షకు తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆలేరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహేష్ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మహేష్‌కు భార్య భవానీతో పాటు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
Updated Date - Jan 17 , 2024 | 12:28 AM