బీఆర్‌ఎస్ కౌన్సిలర్లకు విప్ జారీ
ABN, Publish Date - Jan 20 , 2024 | 12:09 AM
బీఆర్‌ఎస్ కౌన్సిలర్లకు ఆ పార్టీ విప్ జారీ చేసింది. ఈ నెల 24న మునిసిపల్ వైస్‌చైర్మన జక్కుల నాగేశ్వరరావుపై అవిశ్వాస సమావేశం ఉన్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి శుక్రవారం విప్ జారీ చేశారు.
హుజూర్‌నగర్, జనవరి 19 : బీఆర్‌ఎస్ కౌన్సిలర్లకు ఆ పార్టీ విప్ జారీ చేసింది. ఈ నెల 24న మునిసిపల్ వైస్‌చైర్మన జక్కుల నాగేశ్వరరావుపై అవిశ్వాస సమావేశం ఉన్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి శుక్రవారం విప్ జారీ చేశారు. ఈ మేరకు రిజిస్టర్ పోస్టు ద్వారా విప్ పత్రాలు పంపినప్పటికీ ఏ ఒక్క కౌన్సిలర్ తీసుకోలేదు. దీంతో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ రోజు ఏ జరుగనుందోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. దీంతో అవిశ్వాస అంశం రాజకీయ వర్గాల్లో రసవత్తరంగా మారింది.
ఎన్నికల సమయంలో మారిన బలాబలాలు
హుజూర్‌నగర్ మునిసిపాలిటీలో మొత్తం 28 మంది కౌన్సిలర్లు ఉన్నారు. 2020 జనవరిలో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి 20, కాంగ్రెస్ పార్టీ నుంచి 7, సీపీఎం నుంచి ఒకరు గెలుపొందారు. కాగా అసెంబ్లీ ఎన్నికల ముందు, తర్వాత బీఆర్‌ఎ్‌సకు చెందిన 13 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 6వ వార్డు కౌన్సిలర్ బీఆర్‌ఎ్‌సలో చేరారు. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ 19 మంది, బీఆర్‌ఎ్‌సకు ఎనిమిది మంది, సీపీఎంకు ఒక కౌన్సిలర్ ఉన్నారు. ఇదిలా ఉండగా మునిసిపల్ వైస్‌చైర్మనపై అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ పార్టీతో పాటు సీపీఎం కౌన్సిలర్ కూడా వారికి మద్దతుగా ఉన్నారు.
విప్ జారీతో కౌన్సిలర్లలో చర్చ...
బీఆర్‌ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచిన కౌన్సిలర్లకు(పార్టీ మారిన వారికి కూడా) ఆ పార్టీ శుక్రవారం విప్ జారీ చేసింది. మాజీ ఎమ్మెలేఏ్య శానంపూడి సైదిరెడ్డి విప్ జారీ చేయడం గమనార్హం. విప్ పత్రాలను రిజిస్టర్ పోస్టు చేసినప్పటికీ ఒక్కరూ తీసుకోలేదు. విప్ జారీతో కౌన్సిలర్లలో చర్చ మొదలైంది. అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేస్తే కౌన్సిల్ పదవి పోతుందని నాయకులు చర్చించుకోవడంతో అసలు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ మొదలైంది. అవిశ్వాసంపై వైస్‌చైర్మన కోర్టుకు వెళ్లకుండా కేవియట్ దాఖలు చేయడంతోనే విప్ జారీని అస్త్రంగా వాడుతున్నారన్న కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. మెజార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో విప్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
పార్టీ మారక
ముందే నోటీసిచ్చాం..
బీఆర్‌ఎస్ కౌన్సిలర్ల విప్ జారీ చేసిన నేపథ్యంలో కౌన్సిలర్ల నుంచి దీటుగా సమాధానం వస్తోంది. బీఆర్‌ఎస్ నుంచి గెలిచి చైర్మనగా ఎన్నికైన వారితో పాటు మొత్తం 13 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ మారక ముందే బీఆర్‌ఎ్‌సలో ఉన్నప్పుడే వైస్‌చైర్మనపై అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చామని, ఆ మేరకే సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని పలువురు కౌన్సిలర్లు పేర్కొంటున్నారు.
బీఆర్‌ఎస్ పక్షం కాంగ్రె్‌సలో విలీనం చేశాం
హుజూర్‌నగర్ మునిసిపాలిటీలోని బీఆర్‌ఎస్ పక్షాన్ని కాంగ్రె్‌సలో విలీనం చేసినట్లేనని పార్టీ మారిన కౌన్సిలర్లు ప్రకటించారు. పార్టీ గుర్తుపై గెలిచిన 20 మందిలో 13 మంది కాంగ్రె్‌సలో చేరడంతోనే విలీన ప్రక్రియ పూర్తయినట్లేనని ప్రకటిస్తున్నారు. 1/3 వంతు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ పక్షంలో చేరడంతో కౌన్సిల్‌లో బీఆర్‌ఎ్‌సకు స్థానం లేకుండా పోయిందంటున్నారు. విప్ జారీతో ఒకరు, పార్టీ పక్షం విలీనమంటూ కౌన్సిలర్ల వాదనలతో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌రోజు ఏంజరుగుతోందనని అందరూ చర్చించుకుంటున్నారు. విప్ జారీ చెల్లుతుందా, లేదా అన్నదీ చర్చనీయాంశమైంది.
మున్సిపల్ కౌన్సిలర్లకు విప్ జారీ చెల్లదు
బీఆర్‌ఎస్ పార్టీ గుర్తుపై గెలిచిన కౌన్సిలర్లకు మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి జారీ చేసిన విప్ చెల్లదని 3వ వార్డు కౌన్సిలర్ కోతి సంపత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ కౌన్సిల్ పక్షాన్ని కాంగ్రె్‌సలో విలీనం చేశామన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం 1/3 కింద 20 మందిలో 13 మంది కాంగ్రె్‌సలో చేరినట్లు తెలిపారు. అటువంటి సమయంలో విప్ జారీకి ప్రాధాన్యం లేదన్నారు.
Updated Date - Jan 20 , 2024 | 12:09 AM